చక్రస్నానం పరమార్ధం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ
బ్రహ్మోత్సవాలు పూర్తయిన పిదప పరమాత్మ సుదర్శన స్వామిని ముందుంచుకొని పుష్కరిణిలో తీర్థమాడుటే చక్రస్నానము. దీనినే చక్రతీర్థం అని కూడా అంటారు. బ్రహ్మోత్సవము అనగా యజ్ఞం. యజ్ఞసమాప్తి కాగానే అవభృధ స్నానం చేయాలి. ‘భృధం’ – బరువు, ‘అవ’ – దించుకోవడం, ‘అవభృదం’ అనగా బరువు దించుకొనుట. ఇన్ని రోజులు యజ్ఞం నిర్వహించి అలసిన వారు ఆ బరువును అంటే అలసటను స్నానంతో ముగించుకుంటారు. యజ్ఞంలో పాల్గొనని వారు కూడ ‘అవభృంధం’లో పాల్గొంటే యజ్ఞ ఫలితం వస్తుందని శాస్త్ర నిర్వచనం. బ్రహ్మోత్సవాలలో అన్నింటికి తాను ముందుండి కార్యక్రమాన్ని నిర్వహించే వాడు సుదర్శన భగవానుడే. ఒక్క బ్రహ్మోత్సవలే కాక భగవంతుని అన్ని కార్యక్రమాలలో ముందుండి నిర్వహించే వాడు సుదర్శన భగవానుడే కావున ఆ పరమాత్మ కూడ లోక రక్షణ భారాన్ని సుదర్శుని పై పెట్టి స్వామి అమ్మవారితో విహరిస్తూ ఉంటాడు. ఇంత సేవ చేస్తున్న తన భక్తుడైన సుదర్శనునికి ఉచిత రీతిన సన్మానించడమే ‘చక్రస్నానం’. అన్నింటిలో తన ముందుండి నిర్వహించు సుదర్శనుడికి తన కన్నా ముందు స్నానం ఆచరింప చేసి తరువాత తాను స్నానమాచరిస్తాడు స్వామి. ఈ విధంగా పరమాత్మ భక్తవాత్సల్యాన్ని చాటుకుని, ముందు సుదర్శన స్నానం గావించి తరువాత ఉభయ దేవేరులతో స్వామి స్నానమాచరించడమే చక్రస్నానం, చక్రతీర్థం.
అన్ని ఉత్సవాలు స్వామికి అయితే ఈ ఉత్సవం చక్ర స్వామికి. ఇన్ని సేవలలో స్వామిని మనం పూజిస్తే ఆ స్వామి భక్తునికి పట్టం కట్టడం చక్రస్నానం. అందుకే ఇది భక్తోత్సవం. చక్రస్నానం నాడు సుదర్శన స్వామి మరియు మలయప్ప స్వామితో కలిసి స్నానం చేసే మహాభాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఆ పుణ్యాన్ని ప్రసాదించమని స్వామిని ప్రార్థించి ఆయన దయతో బ్రహ్మోత్సవాలలో పాల్గొని, సేవించి తరించే సదవకాశాన్ని కల్పించాలని ఆ స్వామినే వేడుకుందాం.
ఓం నమో వేంకటేశాయ
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు,
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి