భగవంతుడు ఆది మధ్యాంతములు లేనివాడు. సృష్టింపబడే స్థితిని ”ఆది”గాను, ఉన్నస్థితిని ”మధ్య”గానూ, లయమయ్యే స్థితిని ”అంతిమం”గానూ గుర్తిస్తాము. ఇది ప్రకృతికి సంబంధించినది. సృష్టికి ముందు తరువాత కూడా ఉండేవాడు కాబట్టి భగవంతుడు ఆదిమధ్యాంత రహితునిగా చెప్పబడ్డాడు. సకల జీవుల యందు తన అస్తిత్వాన్ని, సాన్నిధ్యాన్ని ప్రకటిస్తాడు కాబట్టి, భగవంతుడిని విభునిగా చెపుతారు. విభుడు అంటే తన ఆజ్ఞకు తిరుగులేని వాడని అర్థం.
ప్రకృతిని స్త్రీశక్తిగాను, ప్రకృతికి అతీతమైన శక్తిని పురుషశక్తిగాను గుర్తిస్తారు. పురుషుడు సకల జీవులలో అంతర్యామిగా వర్తిస్తూ లోకరీతిని నడిపిస్తుంటాడు. సినిమా తెరపైన నటులు వివిధ సన్నివేశాలలో నటిస్తుంటారు. వాటిని చూచే వ్యక్తులకు సన్నివేశాన్ని బట్టి సంతోషం, దు:ఖము, కోపం లాంటి భావోద్వేగాలు కలుగుతాయే కాని ఆ ఉద్వేగాలు తెరపైన నటించే వారికి కలుగవు. అదేవిధంగా, మాయ అనే తెర వెనుక భగవంతుడు ప్రదర్శించే రాగద్వేషాలు, భావోద్వేగాలు ఆయన కంటవు అంటుంది భాగవతం.
సర్వాంతర్యామియైన భగవంతుడే జీవులకు కైవల్యమును ప్రసాదించుటకు సమర్ధుడు. కైవల్యము అంటే.. అన్నీ తానే అనే భావము. అన్నింటా తనను, తనలో అన్నింటినీ చూడగలగిన స్థితిని కైవల్యస్థితి లేదా మోక్షము అంటారు. ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు. కాకపోతే.. మాయ క్రమ్మడం చేత భగవంతుడు వేరు అనే భావనను పొందిన జీవుడు సత్యాన్ని గుర్తించడమే మోక్షం. ఇది కాలానికి అతీతమైనది. కాలమనేది భగవంతుని స్వరూపము. సృష్టికి సంబంధించిన సకలమూ కాలములో నియమితమై ఉంటుంది. సృష్టి ధర్మాలను వ్యక్తం చేస్తూ.. పరస్పర సంబంధాన్ని కలిగించే పరమాత్మ శక్తియే కాలము. అందుకే భగవంతుని వ్యక్త స్వరూపంగా నిర్వచింపబడే కాలము అవ్యయమైనది, శాశ్వతమైనదిగా చెపుతారు. ఎలాగైతే గాలి వేగానికి ఆకాశంలో మేఘాలు కలుస్తూ విడిపోతూ ఉంటాయో అలాగే ప్రపంచమంతా కాలమనే అల్లికతో కలుస్తూ విడిపోతూ ఉంటుంది. కాలము ఇలాగే ఉంటుందని ఎవరూ చెప్పలేరు. అందువల్ల కాల ప్రభావాన్ని తప్పుకోవడం అసాధ్యమని పెద్దలు చెపుతారు.
దేవేందునికి బృహస్పతి గురువుగా మంత్రాంగం నిర్వ#హంచాడు. అత్యంత బలవంతులైన, రణకోవిదులైన దేవతాగణం సేనాధిపతులుగా ఉన్నారు. అమరావతి కోట, సాక్షాత్తూ మధుసూదనుడు తన తోబుట్టువు, ఐరావతము తన వాహనము అయినా ఇంద్రుడు తన దాయాదుల చేతిలో పరాజయం పాలయ్యాడు.
మహాభారతంలో.. నాలుగు దిక్కుల రాజులను జయించి వైభవంగా రాజసూయ యాగం చేసిన ధర్మరాజు ప్రభువు. అర్జునుడు దేవేంద్రుని కుమారుడు.. యుద్ధంలో సాక్షాత్తూ పరమశివుని మెప్పించి పాశుపతాన్ని సాధించిన జోదు. సాధనం.. అగ్నిచే ఇవ్వబడిన గాండీవమనే భయంకరమైన విల్లు. సారధి సాక్షాత్తూ కృష్ణ పరమాత్మయే.. అతనికి సహాయం చేసిన వాడు గదాయుద్ధంలో నేర్పరియైన భీముడు. అయినా కురుక్షేత్రంలో ఎన్నో కష్టాలు పడ్డారు.
అష్ట వసువులలో ఒకనిగా, పావన మూర్తియైన గంగాదేవి కుమారునిగా, జగదేక ధనుర్ధరుడన్న ప్రఖ్యాతి గలిగిన భీష్ముడు.. ఇఛ్ఛా మరణాన్ని వరంగా పొందినా కురుక్షేత్రంలో అంపశయ్యపై శయనించాల్సి వచ్చింది.
ఇలా ఎన్ని ఉదాహరణలను విచారించినా.. ఆ పరమాత్మ ఎవరికే సమయంలో దేనిని అనుగ్ర#హస్తాడో ఎవరూ ఊ#హంచలేరు. అందుకే కాలమే అన్నింటికీ అతీతమైనది. కాల ప్రభావాన్ని ఎవరూ అధిగమించలేరు అంటారు.
సమయం వచ్చే వరకు సహనం పాటించేవాడే ప్రశాంత జీవనం గడుపుతాడు.
– పాలకుర్తి రామమూర్తి