వసంత ఋతువు ఆగమనంతో ప్రకృతి మాత పులకించే సమయం… చెట్లు చిగురించి నవవధువులా వింత కాంతులతో మెరుస్తుంటాయి. ఎన్నెన్నో అందాలు, సౌగంధా లతో ప్రకృతి పారవశ్యంతో మురిపించేవేళ… చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే తెలుగువారి ప్రప్రధమ పండుగ ‘ఉగాది’.
సంస్కృతీ సంప్రదాయాల సమస్త శుభతత్త్వ పునాది…
ఊరూవాడా సమ తత్త్వ హుషారు తెచ్చేపండుగ ఉగాది….
యుగం అంటే రెండు లేదా జంట అని అర్ధం. ఉత్తరాయణం దక్షిణాయణం అనబడే ”అయన” ద్వయమే యుగం. (పరోక్షంగా సంవత్సరం). యుగానికి ఆది కాబట్టి ”యుగాది” అయింది. కాల క్రమంలో ”ఉగాది”గా మారింది.
బ్రహ్మ ఈ రోజునే సృష్టి మొత్తం చేసాడని పురాణాలు చెబు తున్నాయి. విక్రమాదిత్యుడు, శాలివాహనుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడే పట్టాభిషిక్తులైనారని పెద్దలు చెబుతారు. శాలివాహన శకానికి యుగకర్తగా నిలిచిన శాలివాహన చక్రవర్తి స్మృత్యర్థమే ఉగాది వచ్చింది అనేది చారిత్రక భావన. అక్షయమైన కాలాన్ని ‘నేను’ అంటాడు గీతలో గీతాచార్యుడు. కాలం భగవత్ స్వరూపం. మహాభారతం ఆదిపర్వంలో ఉదంకుని చరిత్రలో సంవత్సర స్వరూప నిరూపణ ఉంది.
గురువు ఆజ్ఞతో ఉదంకుడు ఓ ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ తెలు పు నలుపు దారాలను ఇద్దరు నేస్తుంటారు. దానికి సమీపంలో పన్నెం డు ఆకుల చక్రాన్ని ఆరుగురు తిప్పుతున్నారు. ఉదంకునికి వీరెవరో తెలియలేదు. వేదాన్ని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తెలిసింది తెలుపు నలుపు దారాలను నేస్తున్న ఆ యిద్దరు, విధి – విధాతలు అని. తెలుపు పగలు అని. నలుపు రాత్రి అని. పన్నెండు ఆకుల చక్రమే పన్నెండు నెలల కాలం. ఈ పన్నెండు ఆకుల కాలాన్ని ఆరు రుతువులు తిప్పుతున్నాయి. ఇదీ—మహా భారతం ఆదిపర్వంలో చెప్పబడిన సంవత్సర స్వరూప ప్రస్తావన. ఇ#హ పర సౌఖ్యాలను పొందేందుకు ప్రభవ నుంచి అక్షయ సంవత్సరాల మధ్యన ఉండే కాలమే యోగ్యమైనది అని పెద్దలు అంటారు.
జీవన సందేశాన్నిచ్చే ఉగాది పచ్చడి
”శతాయుర్వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయచ!
సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం!!”
అనే శ్లోకాన్ని చదువుకుని ఉగాది రోజు ఉదయమే ఉగాది పచ్చడి సేవించాలి.
వేపపువ్వు, చింతపండు, కొత్త బెల్లం, మామిడి ముక్కలు, చెరుకు, ఉప్పు కలిపి ఉగాది పచ్చడి చేస్తారు. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. జీవితంలో అన్నింటినీ సమర్ధతతో సమంగా స్వీకరించి, నిరాశ, నిస్పృహలను దరిచేర నివ్వకుండా, ఆశావ#హ దృక్పథంతో మంచిని (తీపిని) అందుకోవాలి అనే జీవన సందేశం ఉగాది పచ్చడి ప్రసాదంలో దాగున్నది.
ఆరోగ్య రీత్యా చూస్తే ఉగాది నుంచి ఎండలు ముదురుతాయి. ఆటాలమ్మ పొంగు వగైరా వేడి సంబంధ కారక వ్యాధులు వచ్చే అవ కాశం ఉంది. బెల్లం చల్లదనాన్ని ఇస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. వేపపువ్వు వాత, పిత్త, పైత్య వికార దోషాలను తొలగించి ఆరోగ్యం కలిగిస్తుందనేది వైద్య శాస్త్రం చెబుతున్న విషయమే.
ఉగాది ప్రమాణాలు
ఉగాదికి సంబంధించిన ప్రమాణాలు ”నిర్ణయ సింధు”, ”ధర్మ సింధు”లలో ఉన్నాయి.
ఉగాది రోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబ కుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారో#హణం (పూర్ణ కుంభ దానం), పంచాంగ శ్రవణం మున్నగు ”పంచ కృత్య నిర్వహణ” కావించాలని వ్రత గ్రంథాలు చెప్పే విషయం.
పంచాంగ శ్రవణం వెనుక మరో విశేషమూ ఉంది. పంచాం గం వినటం సత్కర్మ. ఆయుష్షు వృద్ధి చెందుతుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. సిరి సంపదలు పెరుగుతాయి అని చెబుతారు పెద్ద లు. దుస్వప్న దోషాలు నశిస్తాయని, గంగా స్నాన పుణ్యమూ, గోదా న ఫలితమూ పంచాంగ శ్రవణం వలన కలుగుతుంది అని మహ నీయులు చెబుతారు. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసిన వారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర వైభవాన్ని, శని ఐశ్వర్యాన్ని, కుజుడు శుభాన్ని, రాహువు బాహు బలాన్ని, కేతువు కులాధిక్యతను యిస్తారని ”సూర్య శౌర్య మదేందు ఇంద్ర పదవీం…” అనే శ్లోకం చెబుతోంది.
లక్ష్మీ ప్రాప్తికి, విజయ సాధనకు చైతన్యం కావాలి. కాలం జీవు నికి చైతన్యం కలిగిస్తుంది. అందుకే ”తత్త్వైనమ:”, ”నిమేషాయ నమ:” ”కాలాయ నమ:” అంటూ ప్రకృతిని, ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాం. ఉగాది నాటి పంచాంగ పూజ, పంచాంగ శ్రవ ణం, కాల స్వరూప నామార్చనకు ప్రతీకం. పంచాంగ పూజ దేవీ పూజకు సదృశమైనదని, దేవీపూజ ఫలాన్ని ఇస్తుందని పెద్దల ఉవాచ. ఉగాది నాడు చేయాల్సిన పూజలు, దానాలు గురించి జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ప్రజాహత కార్యక్రమాలు ప్రారంభిం చటానికి మంచి రోజు ఉగాది. చలి వేంద్రాలు ప్రారంభించడానికి, మిత్రుల్ని శ్రేయోభిలాషులను కలుసుకోవడానికి, రాజ దర్శనం అం టే ఉన్నతాధికారులను కలుసుకోవడానికి ఉగాది ఉత్తమోత్తమైనది. విసనకర్రలు, చెప్పులు గొడుగులు కొనుక్కోవటం, దానం చేయడం వగైరా పనులు ఉగాది రోజునే ప్రారంభించాలని చెప్పడం వెనుక సామాజిక సేవా కోణం కనిపిస్తుంది.
ఉగాది సందర్భంగా కవి సమ్మేళనాలు జరుగుతాయి. క్రిష్ణ దేవరాయల కాలంలో వసంతోత్సవాలు వైభవంగా జరిగేవి. కవుల కు, గాయకులకు, నర్తకులకు సన్మానాలు ఘనంగా జరిగేవి.
వరాహ మిహురుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది కూడా చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే అని పెద్దల భావన. సకల అను భూతుల సమ్మేళనం జీవితం. స్థిత ప్రజ్ఞత అలవరచుకోవడమే వివేకవంతుని లక్షణం. ఇదే ఉగాది సందేశం.
- రమాప్రసాద్ ఆదిభట్ల, 93480 06669