ఆండాళ్ తిరువడిగలే శరణం
ఉఙ్గల్ పుళైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెఙ్గళ్గు నీర్‌వాయ్ నెగిళ్‌న్దు
అమ్బల్‌వాయ్‌కూమ్బినకాణ్
శెఙ్గల్ పొడిక్కూఱౖ వెణ్బల్ తవత్తవర్
తఙ్గల్ తిరుక్కొయిల్ శఙ్గిడువాన్ పొగిన్ఱార్
ఎఙ్గ ళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశుమ్
నఙ్గాయ్! ఎళున్దిరాయ్ నాణాదాయ్ నావుడైయాయ్!
శ ఙ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
పఙ్గయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్
ఆండాళ్ తిరువడిగలే శరణం
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళశాసనములతో…
తాత్పర్యము :
” మీ ఇంటి పెరటిలోని తోట లోని బావిలో ఎర్రతామరులు విచ్చినవి. నల్లకలువలు ముకుళించినవి. ఎర్రని జేగురు రాళ్ళ పొడితో రంగు అద్దబడిన కాషాయ వస్త్రములను దాల్చి, తెల్లని పలువరుసకల సన్న్యాసులు తమ దేవాలయములకు కుంచెకోల పట్టుకొని ఆరాధనకై వెళ్ళుచున్నారు. మమ్ములను ముందుగా లేపెదవని మాట ఇచ్చిన పరిపూర్ణులారా! లేచి వచ్చి మా కొరత తీర్పుము. సిగ్గులేనిదానా! మాట నేర్పుగలదానా! లెమ్ము! శంఖ చక్రములను ధరించి విశాల బాహువులు గల పుండరీ కాక్షుని కీర్తించుటకు రమ్ము!”
ఈ శరీరమే యొక తోట. చైతన్య ప్రసరణ మార్గమును నాడీ మండలము వెన్నుపూసలో నుండును. ఇదియే దిగుడు బావి. తామర పూవులనగా నాడీ చక్రములు, మూలాధారము,స్శాధి ష్ఠానము మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచ క్రము, సహస్రారము. కలువల నగా ఇంద్రియములు. ఇంద్రియములు ముడుచుకొనినవి.
ఇచట తోట యనగా ‘అష్టాక్షరీ’ మంత్రము. ఇందు మధ్యలో కల బావి ‘నమ:’ అనునది. తామర పూవు అనగా పారతంత్ర ్యము. కలువపూవు అనగా స్వాతంత్య్రము. జేగురు రాయి అనగా విషయములందు రక్తికల మనసు. విషయరాగమే ఎరుపు. భగవత్పారతంత్య్రమును తెలియుటయే పొడిచేయుట. భగవత్సంబంధము గల పదార్థములందు కలుపుట నీటిలో కలుపుట. ఇట్లు భగవత్పారతంత్య్రము భగవత్ప్రీతి విభూతి యందు ప్రీతి గల మనసు గలిగి యుండుట కాషాయ వస్త్రదారణ.
తెల్లని పలువరుస ఆహారశుద్ధిని సూచించును. వాక్‌శుద్ధిని కూడా.
సన్న్యాసులనగా ప్రపన్నులు
తనకు కలిగిన భగవదనుభవమును దాచుకొనక పరిపూర్ణముగా శిష్యులు కొసంగుటే సిగ్గులేకుండట. భగవదనుభవము పరిపూర్ణత. శిష్యులకు మనోరంజకముగా బోధించ కలుగుటే మాటనేర్పు.
శంఖమనగా ప్రణవము! చక్రమనగా సుదర్శనము. భగవంతుని స్వరూపమును చక్కగా చూపునది.
కుంచె కోలయనగా ఆచార్య జ్ఞానముద్ర.
జ్ఞానముద్రయనగా చూపుడువ్రేలు బొటనవ్రేలుతో చేరియుండట. మూడు వ్రేళ్ళు దూరముగా నుండుట. బొటనవ్రేలు భగవంతుడు. చూపుడువ్రేలు జీవుడు. మూడువ్రేళ్ళు గుణత్రయము. గుణత్రయమునకు దూరమైననే జీవుడు భగవంతుని చేరును. ఇది జ్ఞానముద్రలోని సందేశము.
శంఖచక్రములను భుజములందు చిహ్నములుగా దాల్చిన ఆచార్యులే మనకు ఆశ్రయించదగినవారు.
ఈ పాశురమున తిరుప్పాణియాళ్వారులను మేల్కొలుపుచున్నారు.
‘నంగాయ్’ ‘నాణాదాయ్’ ‘నావుడయామ్’ అను సంబోధనలు వీరికి చక్కగా సరిపోవును. సంగాయ్ అనునది గుణపరిపూర్తిని తెలుపును. ‘నాణాదాయ్’ అనునది అహంకార రాహిత్యమునుచెప్పుచున్నది. ఈ ఆళ్వారులు లోకసారంగ మహామునుల భుజములపై కూర్చొని ఆచార్యపురుషుల ఇండ్ల ముందునుండి సాగుచు అహంకారము ఏ మాత్రము లేకుండగా చేతులు జోడించుకొని ‘ఆడియార్కెన్నై యాట్పడుత్త విమల’ ‘నీదాసులకు నన్ను దాసుని చేసిన విమలా!’ అని సాధించుటచే వీరు ‘నాణాదాయ్’ గదా!
ఇక వీరు సాధించిన ‘అమలనాదిపిరాన్’ అను ప్రబంధమును పది పాశురములలో అఖిలవేద ప్రతిపాదిత గంభీరార్థములను సాధించియున్నారని వేదాంత దేశికలు ప్రస్తుతించి యున్నందున వీరు నాలుక గలవారే కావున ‘నావుడయాయ్’ అనునది సరిపోవును.
ఇక ‘ఎంగళైమున్న ఎళుప్పువాన్’ అనుదానిలో భాగవతులను మోసుకొనిపోవుట అను విలక్షణార్థము ధ్వనించుచున్నది కావున వీరికి సమన్వయమగును.
ఇక ఇచట గురుపరంపరా వాక్యమున
‘శ్రీమన్నాధమునయే నమ:’ అని అనుసంధానము చేసుకొనవలయును. వీరు ‘నావుడయాయ్’ అనగా నాలుక బలము కలవారు. ‘కణ్ణినుణ్ శిరుత్తాంబు’ను జపించి నమ్మాళ్వారులను ప్రసన్నులనుచేసుకొని నాలాయిర దివ్య ప్రబంధమును పొంది దివ్యముగా గానము చేసి చేయించి లోకమున వ్యాపింపచేసి మహానుభావులు కావున వీరు ‘నావుడయాయ్’ గదా!
డాక్టర్ కందాడై రామానుజాచార్యులు