Friday, November 22, 2024

తిరుప్పావై : పాశురము-7

తిరుప్పావై ప్రవచనాలు :
పాశురము : 7
ఆండాళ్‌ తిరువడిగలే శరణం

కీళు కీశెన్ఱెఙ్గు మానై చ్చాత్త ఙ్గలన్దు
పేశిన పేచ్చరవమ్‌ కేట్టిలైయో పేయ్‌ప్పెణ్ణ!
కాశుమ్‌ విఱప్పుమ్‌ కలగలప్పక్కై పేర్తు
వాశ నఱుఙ్గుళ లయ్‌చ్చియర్‌; మత్తినాల్‌
ఓశైప్పడుత్త త్తయిరరవమ్‌ కేట్టిలైయో
నాయకప్పెణ్పిళ్ళాయ్‌! నారాయణన్‌ మూర్తి
కేశవనై ప్పాడవుమ్‌ నీకేట్టే కిడత్తియో
తేశముడై యాయ్‌ఐ తిఱ వే లోరెమ్బావాయ్‌

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళశాసనములతో…

తాత్పర్యము :
” కీచుకీచుమని అంతటను భకద్వాజ పక్షులు కలుసుకొని పలుకు మాటల ధ్వని వినలేదా? పిచ్చి పిల్లా! మెడలోని తాళిబొట్టు కాసుల పేరు ధ్వనించునట్లు చేతులూపుచు తలలోని పూవులు జారి, పరిమళము కల కేశపాశములు గల గోప యువతులు కవ్వముతో పెరుగు చిలుకు చప్పుడు విన లేదా? నాయకులారా! అన్ని పదార్థములందు తానుండి, వాటికి కనింపించకుండా వాటిని నిలుపుచు, వాని కాధారమై నియమకుడై వాని కాత్మయైన నారాయణుడు పామరులకు కూడా చర్మ చక్షువులతో చూచుటకు వీలుగా రూపము దాల్చిన సుల భుడు. తనను ఆశ్రయించిన మన విరోధులను తన శ్రమను కూడా లెక్కించక హింసించు, కరుణామయుడగు కేశవుని ( కేశిని వధించువాడు) కీర్తించిననూ, విని కూడా పరుండియే ఉంటివా? తేజశ్శాలినీ తలుపు తెరువుము”
భరద్వాజ పక్షుల పలుకులనగా శ్రోత్రియులగు బ్రాహ్మణులు తెల్లవారు ఝామున లేచి తాము వేదమును చుదువుకొనుచు, శిష్యులకు చెప్పుకొనుట.రాత్రియనగా తమోగుణము. తెల్లవారుట యనగా సత్త్వగుణము.
పెరుగు చిలుకుట యనగా క్షీరసాగర మధనము. ఇచట సముద్రము భగవానుడు. పాలు భగవత్స్వరూప రూపగుణ విభూతులు. మధించుట యనగా మననము చేయుట. భగవానుని యందు నిలిపిన బుద్ధియే మందరము. శ్రద్ధయే వాసుకి. భగవత్కటాక్షమే అమృతము. గోవులనగా వాక్కులు, వేదములు. వాని వలన వచ్చు పాలు భాగవద్గుణములు.
మంగళ సూత్రము ఆచార్యుడు చేయు భగవన్మంత్రోపదేశము. కాసులపేరు ఆచార్యునియందు మనకు కలుగు భక్తి. వీటి ధ్వని భాగవతుల యందు భక్తి. భగవద్భక్తియే కేశపాశము. భగవంతునితో మనకు గల సంబంధ జ్ఞానము పుష్పము. అది పరిమళించుట యనగా ఫలసంగ కర్తృత్వములు లేకపోవుట.
ఇచట కేశి అశ్వరూపియగు రాక్షసుడు. అశ్వమనగా ఇంద్రియము లేదా అహంకారము. వీటిని నిలువరించగలవాడు ఆచార్యుడు. లేదా భగవంతుడు అతనిని అభిముఖుని కమ్మని ప్రార్థించుచున్నారు.
ఈ పాశురమున కులశేఖరాళ్వారులను మేల్కొలుపుచున్నారు.
‘ నాయకప్పెంబిళ్ళాయ్‌’ అనుటచే కులశేఖరుల ఆళ్వారుల రత్నమాలలో మధ్యనాయకమణిగా అలరారుచున్నందున కులశేఖరుల తెలియుదురు.
మరియు ‘ తేశముడయాయ్‌’ అనునది తేజశ్శాలీ, అని కదా తెలుపును. కులశేఖరులు క్షత్రియులు కావున తేజస్సు సహజ గుణము కదా. ఇంకనూ ఈ పాశురమున ‘ ఆనైచ్ఛాత్తు’ అని మలయాళ భాషాపదమును వాడిరి. కావున మళయాళ దేశమున జన్మించిన కులశేఖరులను తెలుపును.
ఇక గురుపరంపరలో ‘అస్పత్పరమగురుభ్యోనమ: అను వాక్యమును అనుసంధానము గావించుకొన వలయును. ఇచట గురవునకు గురువులు పరమాచార్యులు నాయకప్పెణ్పిళ్ళాయ్‌ కదా.

- Advertisement -

డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement