ప్రతి ఇంటికి పెద్దదిక్కు వుండాలి అంటారు. జీవితంలో ధర్మాధర్మ విచక్షణను తెలుసుకోవడానికి వారు అవసరం. ఎందుకంటే ఎంతో అనుభవంతో వారు చెప్పే మాటలు చద్దన్నం మూటలా పనిచేస్తాయి. వారి మాటలు చాదస్తాలని కొట్టివేయడం అన్ని సమయాలలోనూ తగదు.అందుకుఉదాహరణగా…
ఇంటి పెద్దదిక్కు కుటుంబంలో వున్న అందరినీ ఒకేలా చూ స్తూ, వాడి నడవడికను సరిచేస్తూ ఉంటారు. నాలుగు మం చి మాటలు చెప్పడానికి అయినా, ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే ఖండించడానికి అయినా వారు ముందుకు వస్తారు. వారిని ధర్మ మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూ వుంటారు. మాకు పెద్ద దిక్కే వద్దు, మంచి చెప్పే వాళ్లు వద్దు అని అంటే ఆ కుటుంబం ఎటుపోతుంది. కళ్లు గానక ఊబిలోనికి కూరుకుపోతారు.
ఇదే మహాభారతంలో దుర్యోధనుని విషయంలో జరిగింది. దుర్యోధనునికి తల్లిదండ్రులు కుమారునిపై వున్న ప్రేమ వలన చెప్ప లేకపోయారు, విదురుడు మంత్రి కావడం వలన చెప్పలేకపోయాడు, కురు వృద్ధుడు భీష్ముడు తాతగారి హోదాలో వున్న చనువు కొద్దీ ఎన్నో సార్లు చెప్పి చూశాడు. కానీ దుర్యోధనుడు ఆయన్నీ లెక్క చేయలేదు. చివరికి రాజ్యమే కూలిపోయింది. జీవితమే లేకుండా పోయింది. దీనినిబట్టి పెద్దలు లేని సంసారం, కుటుంబం ఏమవుతుందో తెలుసు కోవాలి. నూరుగురు కౌరవులు ఏమయినారో మనం గుర్తుంచుకోవాలి,
ఎవరి జీవితంలో అయినా ధర్మాన్ని చెప్పేవాడు ఒక్కడైనా వుండాలి. పుత్ర వాత్సల్యంతో ధృతరాష్ట్రుడు కొడుకులు అపసవ్యంగా ప్రవర్తిస్తున్నా వారిని పూర్తిగా ఖండించలేదు. ధృతరాష్ట్రుడు సహజంగా దుర్మార్గుడు కాదు. విదురుడు చెప్పే మంచి మాటలు శ్రద్ధాసక్తులతో వినేవాడు. అయినా కూడా పుత్రవాత్సల్యంతో పక్షపాత వైఖరి ప్రద ర్శించేవాడు. చెప్పుడు మాటల ప్రభావంతో పాండవుల మీద కోపం పెంచుకున్నాడు. కానీ ఆ కోపావేశాలను పైకి చూపించేవాడు కాదు. లోపల దావానలంలా రగిలిపోతూ ఉండేది. అసలు పక్షపాత వైఖరి లేనట్లుగా నటించేవాడు. అటు తన బిడ్డలపై ప్రేమ, ఇటు తాను నమ్ము కున్న సిద్ధాంతాల మధ్య నలిగిపోయేవాడు. పైకి మాత్రం నవ్వులు చిందిస్తూ ఎంతో ఉదారునిగా కనిపించేవాడు. అదే ధృతరాష్ట్రుని గొప్ప తనం. ఇదంతా ధృతరాష్ట్రుడు విదురుడ్ని పక్కన పెట్టుకోవడం వలన సంభవించింది. అందుకనే ఆయనకు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శన భాగ్యం కల్పించాడు.
ఇక దుర్యోధనుడికి విషయానికి వస్తే తండ్రి హితబోధలను అపహాస్యం చేసాడు. యుద్ధంలో ఓడిపోతామన్న తండ్రి హెచ్చరికలను పెడచెవిన బెట్టాడు. ఇదంతా పగ… ద్వేషం… ప్రతీకారంతో ఎల్లవేళలా రగిలిపోతూ ఉండే శకుడ్ని దగ్గర పెట్టుకొని, పెద్దల మాట వినకపోవడం వలన ఏర్పడిన దుస్థితి. అందుకే ఏ వ్యక్తి అయినా సహజంగా దుర్మార్గు డైనా సరే ఓ మహాత్ముడిని, మంచివాడిని చెంత పెట్టుకోవాలి. మంచి వారితో స్నే హంచేయాలని. దీనిని అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి.
అదే ధర్మరాజు విషయానికి వస్తే… అందరి మాట విన్నాడు. ఆయన మాట ఆయన తమ్ముళ్లు విన్నారు, ధర్మ ప్రవర్తనతో బ్రతికారు. ఎన్ని కష్టాలను అనుభవించినా ధర్మాన్ని వీడలేదు.
దుర్యోధనుడు ఎవ్వరి మాట వినలేదు, తల్లిదండ్రుల మాట విన లేదు, గురువుల మాట వినలేదు, పెద్దల మాట వినలేదు, శ్రేయోభి లాషుల మాట వినలేదు, భగవంతుడి మాట కూడా వినలేదు చివరికి ఏమైపోయాడు? మంచి చెప్పే వాళ్లను బ్రతిమలాడి అయినా తెచ్చు కోవాలి. ”అయ్యా మీరు మార్గ నిర్దేశకులుగా ఉండండి, అధ్యక్షులుగా వుండండి, పెద్దలుగా వుండండి మాకు!” అని ప్రాధేయపడి వుంచుకో వాలి. పెద్దవాళ్లను వుంచుకున్నందు వలన కుటుంబాలకు, సంస్థలకు, సభలకు గౌరవం లభిస్తుంది, చెడ్డవాళ్లను డబ్బులు ఇచ్చి అయినా వదిలించు కోవాలి అంటారు. రాజు చెడ్డవాడు అయినా మహా మంత్రి మంచివాడుగా, ధర్మం చెప్పేవాడుగా వుండాలి. అప్పుడే ఆ రాజు, ప్రజలు పది కాలాలపాటు చల్లగా వుంటారు. ధర్మం చెప్పే పెద్దలు లేనం దువలన, చెప్పినా వినకపోవడం వలన సమాజం దెబ్బతింటుంది.
ఎవడికి వాడు నేనే పెద్ద అనుకోకూడదు. ఎంతటి జ్ఞానవంతులు అయినా సరే ఒక్కోసారి పొరబాట్లు, తప్పులు జరిగిపోతూ వుంటాయి అని తెలియజేస్తుంది భీష్ముడి ప్రవర్తన. భీష్ముడు ధృతరాష్ట్రునికి, అర్జుని కి లభించిన శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపం తనకు లభించలేదని బాధప డతాడు. అదే విషయాన్ని శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు.
”శ్రీకృష్ణా! నేను ఏమి తప్పు చేసాను. నీ దివ్యదర్శన భాగ్యం నాకు కలుగజేయలేదు?” అని. అప్పుడు శ్రీకృష్ణుడు ”ఓ తప్పు జరిగేచోట పెద్దలు అలా చూస్తూ వుండటమే పెద్ద తప్పు” అని అంటాడు.
ఓ తప్పును చూస్తూ ఖండించకుండా, అక్కడ నుంచి వెళ్లిపోకుం డా మౌనం వహంచి చూస్తూ వుండటమే భీష్ముడు చేసిన తప్పు. ద్రౌప ది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు ఏమీ చేయలేక నిస్సహా స్థితి లో అక్కడే వుండిపోయాడు. అదే విదురుడు అయితే ఆ దుష్టత్వాన్ని చూడకుండా సభలోంచి లేని వెళ్లిపోతాడు. అంటే ఓ తప్పు జరిగే ప్రదే శంలో పెద్దలు చూస్తూ ఉండిపోకూడదు. ఖండించాలి లేదా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోవాలి. లేదంటే భగవంతుడు ఆ పాపాన్ని వారి ఖాతాలో కూడా వేస్తారు. అందువలన తాము చెప్పే మాటలను ఎవరూ వినరని తెలుసుకుని పెద్దలు ఆ స్థలం నుంచి వెళ్లిపోవాలి.
- వై.శ్రీనివాసశర్మ