జీవితంలో ముఖ్య విషయాలు… ఒకటి మనిషి విజయానికి కృషి చెయ్యాలి, గెలిస్తే ఆనందం మన సొంతం, ఓడిపోతే ఆనందం పొరుగువాడి సొంతం. లక్ష్యాలకై కలలు కనాలి, ఆ కలల సాకారం కోసం రాత్రంబవళ్లు కృషి చెయ్యాలి. స్నేహితులను కొద్దిమందినే ఉంచుకోవాలి. అదీ, ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వారినే. అలాగే, మంచివారు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరూ నమ్మరు, కపటబుద్ది కలవాడు ఎన్ని అబద్దాలు చెప్పినా నమ్మేస్తారు. అందుకే చెడ్డవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు, ధనం చూసి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది, మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుని వంటిది, అది సృష్టి ఉన్నంతవరకు వెలుగుతూనే ఉంటుంది.
నేటి విద్యార్థులే రేపటి పౌరులు… అధికారులు. ఈనాడు ఎవరినైతే మనం మ#హనీయులు, ఆదర్శపురుషులని భావిస్తున్నామో వారందరు ఒకానొక సమయంలో విద్యార్థులే. వ్యక్తి విలువ జీవిత సంస్కారాన్ని బట్టి ఉంటుంది. నిత్య జీవితంలో దురలవాట్లకు దుర్భావాలకు దూరంగా ఉంటూ సదభ్యాసాలు, సద్భావనలను ఆచరిస్తూ పోవడమే సంస్కారం. దేశమంటే మట్టి కాదు, మనుష్యుల సమూ#హమే. కాబట్టి దేశాన్ని ఉద్దరించాలంటే మొట్టమొదటగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధి పరచుకోనాలి, తల్లిదండ్రులు, గురువులు బిడ్డలను చిన్నతనం నుండే ఆదర్శ ప్రాయులుగా తీర్చి దిద్దినపుడే వారు సమాజంలో గౌరవ మర్యాదల నందుకోగలరు.
వందమంది శత్రువుల కన్నా ఒక నమ్మకద్రోహం చాలా ప్రమాదకరం. మన మంచి కోరుకునే వారిని దూరం చేసుకోకూడదు. అలాగే, మన చెడును కోరుకునే వారిని చాలా దూరంగా ఉంచాలి. వాళ్ల స్వార్ధం కోసం మనల్ని పొగిడేవాళ్లను దగ్గరకు రానీయరాదు. స్వచ్చమైన మనస్సు వున్నవారు అన్ని విషయాలను బయటికి చెప్పేస్తారు, వారికి శ్రమించడం తప్ప నటించడం తెలియదు, వాళ్ల కోపం క్షణకాలం. వాళ్ల ప్రేమ జీవితాంతం. అలాంటి వారిని వదులుకోరాదు. రాతితో కొడితే అద్దం పగులుతుంది. కటువుగా మాటలవలన మనస్సు ముక్కలౌతుంది. అమృతాన్ని పోసినా వీటిని అతకడం కష్టం, ఒకవేళ అతికినా మునుపటి నాణ్యత రాదు. ఏ బంధమైనా అంతే. విలువలు తెలుసుకొని వ్యవ#హరించాలి.
నేటి మానవుడు కోరికలు తీరినప్పుడే తనకు ఆనందం లభిస్తుందని అనుకుంటారు. ఇది తప్పు… కోరికలు తీరడం కాదు ఆనందం, కోరికలు లేకుండుటయే నిజమైన ఆనందం. కాబట్టి కోరికలు తగ్గించుకోవాలి. దీనినే వైరాగ్యం అంటారు. ఇది నాది అనుకున్నప్పుడు దానికి సంబంధించిన సుఖదు:ఖములను అనుభవింప తప్పదు. అభిమాన మమకారాల్ని వీడనంతవరకు మానవునికి ఆనందం ప్రాప్తించదు. మనస్సు ఆధారంగా ఉన్న మానవుడు చెడుతలపులతో పతనమౌతున్నాడు, బుద్ధిని ఆధారం చేసుకున్న వాడే మాననీయునిగా మారతాడు. అలాంటి వాడే జ్ఞాని. మనసున్నంత వరకు మాయ తప్పదు… దు:ఖం తప్పదు. మనస్సే గుణం, మనస్సే ప్రకృతి, మనస్సే సర్వం.
– శేఖరమంత్రి ప్రభాకర్