Friday, November 22, 2024

విదురుడు చెప్పిన రాజ ధర్మాలు

నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు, సందేహాలకు పరిష్కారం, సమాధానం లభించే మహిమాన్విత అద్భుత ఇతిహాసం పంచమ వేదమయిన శ్రీ మహాభారతం. లక్షలాది శ్లోకాలతో కూడి ఈ జీవన మార్గదర్శి యందు విదురుడు చెప్పిన నీతి వాక్యములు సదా అనుసరణీయములు.

ధృతరాష్ట్రుని పుత్ర వ్యామోహం వలన తాను చేస్తున్న పని తప్పని తెలిసినా నిగ్రహించుకోలేక సర్వనాశనానికి కారకుడయ్యాడు. కానీ తన అధర్మ నిర్ణయాలకు అతని అంతరంగం అనుక్షణం దహించుకు పోతూ ఉండేది. అటువంటి సమయంలో తన మందిరానికి విదురుణ్ణి రప్పించుకొని ధర్మ బోధ చేయించుకునేవాడు. కానీ పాటించడానికి అతని మనసు ఏకీభవించేది కాదు. ఆ బలహీనత వల్లనే మహాభారత యుద్ధం సంభవించింది. అటువంటి విదురనీతి యందు రాజుకు ఉండాల్సిన లక్షణాలు, బాధ్యతల గురించి ధృతరాష్ట్రునికి చెప్పిన విషయాలను మననం చేసుకుందాం.
కోపం లేనివాడు, మట్టి, రాయి, బంగారం వీటియందు సమదృష్టి కల వాడు, శోకం లేనివాడు, స్నేహం, విరోధం లేనివాడు, సన్మాన అవమాన ములను సమంగా చూసేవాడు, ప్రియము అప్రియములు లేనివాడు, స్వతహా గా పండు, నీరు, ధాన్యం, దుంపలు, కూరగాయలు భుజించువాడు, మనో నిగ్రహం, నిత్యాగ్ని కార్యాల మీద శ్రద్ధ అతిథులను ఆదరించుట మొదలైన లక్షణాలు గల తాపసులను రాజు ఆదరించాలి.
తెలివైన వారికి అపకారం చేసి వారికి దూరంగా ఉన్నామని ఏమరు పాటుతో ఉండకూడదు. బుద్దిమంతుని చేతులు చాలా పొడవు, అంటే వారు దూరం నుండే ప్రతీకారం తీర్చుకోగలరు. నమ్మదగని వారిని నమ్మకూడదు. నమ్మదగిన వారిని అతిగా నమ్మకూడదు. నమ్మకంతో పుట్టిన భయం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మానవుడు ఈర్ష్యారహితుడు, భార్యను రక్షించుకో గలి గినవాడు, తన సంపదను న్యాయబద్ధంగా పంచేవాడు, ప్రియంగా సంభా షించేవాడు, మృదు స్వభావుడు, స్త్రీలతో సభ్యత, మధురంగా మాట్లాడేవాడు, కానివారి వశం కాకుండా ఉండేవాడై ఉండాలి.
సద్వంశంలో పుట్టి అగ్ని సమానమైన తేజస్సు కలిగినా కట్టెలలో నిప్పులాగా సహనంతో ప్రశాంతంగా ఉండాలి. బాహ్య పరివారానికి గాని, అభ్యంతర పరివారానికిగాని తెలియకుండా ఆలోచన చేసే రాజు చిరకాలం ఐశ్వర్యం పొందుతాడు. ధర్మార్థ కామాలకు సంబంధించిన పనులు చేస్తున్న ప్పుడు ముందు చెప్పరాదు. తరువాతనే చెప్పాలి. అప్పుడే ఆ కార్యం సఫలమ వుతుంది. మిత్రుడు, పండితుడైన స్నేహితుడు, చపల చిత్తుడుగాని పండితునికి మాత్రమే రహస్యాలోచన చేయాలి. పరీక్షించిన తరువాతనే మంత్రిని నియ మించుకోవాలి.
రహస్యాన్ని రక్షించేవాడు, ధనప్రాప్తిని కలిగించేవాడు మంత్రిగా ఉండాలి. ధర్మార్థ కామాలకు సంబంధించిన పనులు పూర్తయిన తరువాతనే సభ్యులకు తెలియజేయాలి. మంత్ర రక్షణం చేసే రాజు నిస్సంశయంగా కార్య సాధకుడు అవుతాడు. మోహాన్ని విడిచిపెట్టకుండా నిందింపదగిన పనులు చేసే రాజు వాటి విపరీత పరిణామాలవల్ల తన జీవితాన్ని కూడా కోల్పో తాడు. ప్రజా ప్రశస్తమయిన పనులు చేయడం వలన సుఖపడతాడు. లేకపోతే పశ్చాత్తాపం మిగులుతుంది. తన స్థితి యొక్క వృద్ధి, క్షయాలు, చక్కని పాండి త్యము, శీలము కల రాజుకు ఈ భూమి మొత్తం స్వాధీనమవుతుంది. సంతోషము, తన పనిని తానే విశ్లేషించుకుంటూ స్వయంగా కోశాగారాన్ని రక్షించుకొనే రాజుకు సర్వ సంపదలు లభిస్తాయి. సేవకులకు సంపదను పంచా లి. రాజు తన పేరుతోను, ఛత్రంతోను సంతృప్తిపడాలి.
దేశ సంపదను రాజు ఒక్కడే అనుభవించకూడదు. భోగాలను ప్రజలతో కలిసి అనుభవించాలి. చంపదగిన శత్రువు తనకు చిక్కితే వదిలిపెట్టకూడదు. తనకంటే అధికు డయితే ముందు సేవించాలి. తరువాత బలం పుంజుకుని ఆ శత్రువును అంతంచేయాలి. లేకపోతే వానివల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. దైవజ్ఞుల పట్ల, తోటి రాజుల పట్ల, బ్రాహ్మణులు, వృద్ధులు, బాలురు రోగుల పట్ల కోపాన్ని చూపకూడదు. మూఢులతో కలహించరాదు. తెలివిగా విడిచిపెట్టాలి. అప్పుడే కీడు కలుగక కీర్తి కలుగుతుంది. నపుంసకుని స్త్రీలు భర్తగా కోరనట్లుగా నిష్పల అనుగ్రహము, వ్యర్థమైన కోపముగల రాజును ప్రజలు కోరుకోరు. సత్‌ప్రవ ర్తన, తెలివి, అసూయ లేకపోవడం, ధర్మ పూర్వకమైన నడవడి, మధురమైన వాక్కు, కోపం లేకపోవడం మొదలైన గుణాలు గలవారికి కష్టాలు కలగక సుఖంతో తులతూగుతారు.
వంచన లేని దానం, హద్దులు మీరకపోవడం, హితంగా మాట్లాడటం ఈ మూడు ప్రజలను తన వైపు తిప్పుకుంటాయి.
మోసం చేయనివాడు, కృతజ్ఞుడు, బుద్ధిమంతుడు, నిష్కల్మషుడు, సమర్ధుడు అయినవారికి కష్టకాలమందు ప్రజాపరివారం యొక్క అండ దండలుంటాయి. తన వారికి పెట్టకుండా తినేవాడు, దుష్టుడు, కృతఘ్నుడు, సిగ్గులేని వాడైన రాజును తక్షణం ప్రజలు విడిచి పెడతారు. అవసరమైనప్పుడు ఆదుకుని , మిగిలిన సమయాలలో దూరంగా ఉండే సేవకులను పండిత సమానులుగా భావించాలి. అవసరమైన సమయాల్లో చేసే సేవ వల్ల ఘర్షణ, గందరగోళం కలుగు తుంది. జూదరుల చేత, చారణులు, వేశ్యల చేత పొగడబడే వాడు ఎంతోకాలం మనలేడు. ఈ విధంగా విదురుడు నీతి వాక్యాలు చెప్పి, సర్వ శక్తివంతులు, తేజోవంతులు ధర్మ పరులు అయిన పాండవులను వదిలి ఐశ్వర్యమదమత్తునిగా మారిన ధుర్యోధనునికి నీ సంపదను అనుభవించమని ఇచ్చా. కానీ భవిష్యత్‌లో అతనికి రాజ్య భ్రష్టత తప్పదని హెచ్చరించాడు.
– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
80746 66269

Advertisement

తాజా వార్తలు

Advertisement