మహాభారత యుద్ధం ముగిసింది. ధర్మరాజు తీవ్ర వైరాగ్యానికి గురయ్యాడు. అనేక విధాలుగా వ్యాసభగవానుడు నచ్చ జెప్పి పట్టాభిషేకానికి ఉద్యుక్తుణ్ణి చేయసాగాడు. అంత ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థించాడు. శరశయ్యపైనున్న పితామహుడు భీష్మాచార్యుని దగ్గరకు తీసుకు వెళ్ళాడు. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహంతో ధర్మరాజుకు అనేక ధర్మ సూక్ష్మాలు, పరిపాలనా విధానాలు వివరించాడు భీష్మాచార్యుడు. అంత ధర్మరాజు పాపము యొక్క మూలము ఎక్కడుందని ప్రశ్నించాడు.
పాపస్య యదధిష్ఠానం యత: పాపం ప్రవర్తతే!
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం తత్త్వేన భరతర్షభ!!
ఓ! భరత శ్రేష్ఠా! పాపము యొక్క అధిష్టానమేది? దేని నుండి అది ప్రవృత్తమగుచున్నది? అను విషయము నేను మీ ముఖ:తహ వినాలనుకుంటున్నాను అని ప్రార్థించాడు. అంత భీష్మాచార్యుడు.
పాపస్య యదధిష్ఠానం తచ్చృణుష్వ నరాధిప!
ఏకోలోభో మహా గ్రాహో లోభాత్ పాపం ప్రవర్తతే!!
ధర్మరాజా! పాపము యొక్క అధిష్టానమును వినుము. లోభమే పాపము యొక్క అధిష్టానము. ఇది మనిషిని మ్రింగివేయు మొసలి వంటిది. అనేక పాప ప్రవృత్తులకు ఈ లోభ గుణమే కారణమై యున్నది.
లోభము వలన కామము ప్రకటితమగుచున్నది. అటుపై మాయ, మోహము, అభిమానము, పరాధీనత్వము మొదలైన దోష ములు కలుగుచున్నవి. దంభము, ద్రోహము, నింద, చాడీలు చెప్పుట, మాత్సర్యము మొదలైన దుర్గుణములు లోభియందు ప్రస్ఫుట ముగా కనబడును. లోభి సదా మూఢుడై ఉండును. అందువలన సహజముగా అజ్ఞానము కలిగియుండును. అన్ని దోషములకు లోభత్వమే కారణము కావున దానిని త్యజించవేయవలెను. కావున దమమును ఆశ్రయించుటయే దానికి పరిష్కారం. అనగా ఇంద్రియ నిగ్రహము కలిగియుండుట.
ఎవడు తన మనస్సును, ఇంద్రియములను దమ మొనరించు కొనగలడో అతడు సుఖముగ నిద్రించును. సుఖముగ మేల్కొనును. సుఖముగా లోకమున సంచరించును. కనుక లోభము అనేది ఒక భూతం లాంటిది. దీని వలననే పాపం, దు:ఖం, అధర్మం జనిస్తాయి. మనిషి పాపాచారుడవుతాడు. అందరినీ దూరం చేసుకుంటాడు. సమాజం అతనిని కపటిగా భావిస్తారు. ఈ లోభం వలననే మోహం, మాయ, గర్వం, అవినయం పడతాయి. చివరకు క్షమలేని వానిగా, నిర్లజ్జగా, చింతతో అపకీర్తి పాలవుతాడు. అంతులేని సంపదల దాహంతో చేయకూడని పనులు చేస్తాడు.
అందరినీ అవమానిస్తాడు. ఎవరినీ నమ్మక అందరిపట్ల సం దేహ భావంతో ఉంటాడు. ఇతరుల సంపదను హరించాలని చూడ టం, ఇతరులను నిందించుటలో సంతోషం, గొప్పలు చెప్పుకోవడం, అబద్దాలాటానికి ముందుండుటం మొదలగు దుర్గుణాలకు కారణం ఈ లోభత్వమే!
సమస్త నదులలోని నీరు సముద్రములో కలిసినా అది నిండదు. అదేవిధముగా ఎన్ని భోగాలు లభించినా, సంపద చేకూరినా లోభం యొక్క కడుపు నిండదు. వేద వేత్తలు కూడ ఈ లోభ పాపపు పిడికి లిలో చిక్కుకుని పాపాన్ని మూటగట్టుకుంటారు. లోభి మాటలు చాలా మధురంగా ఉంటాయి. అంతరంగంలోని భావం మాత్రంం చాలా చేదుగా ఉంటుంది. ధర్మం పేరు మీద సమాజాన్ని మోసం చేస్తారు. లోభ గ్రస్తులైన ఈ దురాత్ముల వల్ల సమాజంలోని తటస్తులు కూడా లోభగ్రస్తులవుతారు. ఈ లోభ గుణం ఎటువంటిది అంటే వార్దక్యంలో కూడా వీడదు. ఇటువంటి వారి సాంగత్యం చేస్తే రాజు యొక్క సంపద, గౌరవం కూడా నశిస్తాయి. లోభం అంటే అజ్ఞానం అని గ్రహించాలి. అందువలన లోభాన్ని విడిచి పెట్టే వాడు ప్రజలను సరిగ్గా పాలించగలడు. అటువంటి వారే ఇహ, పర లోకాల్లో సుఖిస్తారు.
లోభం వల్ల అంతిమ దశలో దుర్దశను అనుభవిస్తారు. మాట మీద నిలబడకపోవడం వల్ల, ఇత రులను అసహ్యించుకోవడం వలన, గొప్పలు చెప్పుకోవడం వల్ల, అందరినీ దూరం చేసుకుం టాడు లోభి.
లోభి లక్షణాలు, పర్యవసా నాలు తెల్చిన భీష్మాచార్యుడు శిష్టుల లక్షణాలు కూడా తెలియజేసాడు. వీరికి పునర్జన్మ భయముం డదు. వీరు సాత్విక ఆహారాన్నే భుజిస్తారు. సన్మాన, అవమానాలను సమానంగా భావిస్తారు. సుఖదు:ఖాల యందు సమాన దృష్టి కలిగి ఉంటారు. వీరు ఏదైనా ఇవ్వడమే కాని తీసుకోరు. ఇతరుల మేలును సదా కాంక్షిస్తారు. ఇతరుల కోసం తమ సర్వస్వాన్ని ధారపోయడానికి సర్వసిద్ధంగా ఉంటారు. వీరిలో పిరికితనం ఉండదు. ఎవరినీ భయ భ్రాంతులకు గురి చెయ్యరు. అహంకార, మమకారాలు ఉండవు. సదా మర్యాదను పాటిస్తారు. వీరు ధనం కాని, కీర్తిగాని కూడ బెట్టు కోరు. వీరిలో భయం, క్రోధం, చపలత్వం, శోకం ఉండవు. వీరు ధర్మ ము యొక్క ముసుగులో జీవించరు. స్వచ్చమైన స్వభావులై ధర్మాన్ని కాపాడతారు. వీరు సత్త్వగుణ సంపన్నులై సమదర్శన మార్గంలో పయనిస్తారు.
సత్పురుషులైన పూర్వుల ఆచరణకు, వీరి జీవన విధానానికి బేధముండదు. స్వార్థరహితులై సదా సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడతారు. అందుకే వీరు కీర్తి కాముకులు కాకపోయినా వీరి చరిత్ర తరతరాల కీర్తించబడు తుంది. వీరు మరణానంతరము తిరిగిరాని పరమ పదాన్ని చేర తారు. కావున ధర్మరాజా! ఇటు వంటి వారిని అనుసరించు.
ఇటువంటి వారిని సమీక రించి ఆదరించు. నీ ఇంద్రియాలను జయించి ధర్మప్రియులు, నిస్వా ర్థపరులు. దివ్య గుణ సంపన్నులు అయిన మహానుభావులను సేవించి, వారి బోధనలను పాటించు, ఇటువంటి వారి వల్లనే నీవు మంచి పరిపాలన అందించి ప్రజల మన్ననను పొందుటకు అర్హత సాధిస్తావు. అజ్ఞానంతో లోభులను చేరదీస్తే మహాపాపాన్ని మూట గట్టుకుంటావు. నిస్వార్థపరులైన శిష్టాచారుల వల్ల లోభుల సంఖ్య తగ్గుతుంది. సమాజం జ్ఞాన మార్గం వైపు మరలుతుంది. ఈవిధంగా లోభమే పాపమునకు మూలమని భీష్మా చార్యుడు ధర్మరాజుకు విశదపరచినాడు.
– వారణాశి వెంకట
సూర్య కామేశ్వరరావు
8074666269
పాపానికి మూలము లోభమే!
Advertisement
తాజా వార్తలు
Advertisement