Monday, November 25, 2024

రామ తత్త్వం

రామతత్త్వం జీవ తత్త్వంగా, జీవన తత్త్వంగా, జీవిత తత్త్వం గా మార్చుకునేందుకు ప్రయత్నించిన, ప్రయత్నిస్తున్న ప్రతిరోజూ శ్రీరామ నవమే అనంటారో మహనీయుడు. ప్రేమ తత్త్వాన్ని ప్రతి మనిషీ నింపుకుని, పెంచి పోషించుకుని, సత్య మార్గంలో పయనిస్తూ, రామతత్త్వాన్ని జీవన మార్గంగా మార్చుకు నేందుకు ప్రయత్నం చేసిన ప్రతీ క్షణమూ శ్రీరామ నవమే అనేది దీని సారాంశం. రాముడు ఆచరించిన ధర్మాన్ని, ఆయన చూపిన సత్యశీ లతను, శ్రీరాముడు జీవించిన విధాన్ని, విధానాన్ని, మన హృదయంలో ఆవిష్కరింప జేసుకోవడానికి మనం అనుసరించే ప్రతి అంశమూ, మనల్ని శ్రీరామ నవమి తాత్త్వికతకు తీసుకువెళ్ళే శుభఘడియే అనేది ఆ మహనీయుని బోధనలో ఉన్న అంతరార్ధం.
నారాయణాష్టక్షరిలో ప్రధానమైన ‘రా’, శివ పంచాక్షరిలో ప్రధానమైన ”మ” కారాన్ని కలిపి ‘రామా’ అనే పేరుని కౌసల్యా పుత్రునికి వశిష్ట మహర్షి పెట్టారు. అందుకే రామ నామానికి అంతటి శక్తి, విశిష్టత, వరిష్ఠత, ప్రాభవం, వైభవం వచ్చాయి. ‘రామ’లో ‘ర’ అనే అగ్ని బీజం, ‘అ’ అనే సూర్య బీజం, ‘మ’ అనే చంద్ర బీజం ఉండటం చేత, పాపాలను శాపాలను తాపాన్ని చల్లార్చి హాయిని చేకూర్చుతుంది రామ నామం.
రామ నామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అని అనడానికి మనం నోరును పూర్తిగా తెరుస్తాం. అప్పుడు మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకుపోయి, ‘రా’ అక్షరంలో ఉన్న అగ్నిబీజం వల న అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయి. ‘మ’ అనే అక్షరం ఉచ్ఛ రించేటప్పుడు పెదవులు రెండూ మూసుకుంటాయి. అప్పుడు బయట ఉన్న పాపాలు ఏవీ మన లోనికి ప్రవేశించలేవు. అందుకే రామ అనే పదం అంత గొప్పది, శక్తి కలది అయింది. రామ నామ స్మరణం అతి విశిష్టమైనది, మోక్షాన్ని యిచ్చేది అయింది.
తలపు, మాట, క్రియ ఈ మూడింటి ఏకత్వమే రామతత్త్వం. సర్వ వ్యాపకమైనది రామ తత్త్వం. సర్వ జీవితాంతరాత్మ తత్త్వమే రామతత్త్వం.ఓసారి అగస్త్యుని తల్లి తన కొడుకు సముద్రాన్నంత టినీ ఔపోసన పట్టిన గొప్పవాడని మురిసిపోతూ చెబుతోంది. ఆమాట అక్కడకి వచ్చిన హనుమంతుని తల్లి అంజనాదేవి వింది.
”అదంత గొప్ప విషయమేం కాదు. నా కొడుకు నూరు యోజ నాల సముద్రాన్ని ఒక్క క్షణంలో దాటాడు. కాబట్టి నా కొడుకే మహా గొప్ప” అంది అంజనాదేవి. ఈ ఇద్దరి మాటలను అక్కడే ఉన్న శ్రీరాముని తల్లి వింది. ఊరుకోలేక పోయింది కౌసల్య. ”నా కొడుకు శ్రీరాముని నామాన్ని స్మరణ చేయటం వల్లనే నీ కొడుకు సముద్రాన్ని దాటగలిగాడు. ‘రామ’ అనే నామమే లేకపోతే హనుమంతుడు ఏమీ చేయలేక పోయేవాడు. నా కొడుకు నామమే హనుమంతునికి అంతటి బలాన్ని ఇచ్చింది. కాబట్టి నా కొడుకు రాముడే గొప్ప వాడు.” అంది. కౌసల్య చెప్పిన దాన్ని తక్కిన ఇద్దరూ ఒప్పుకోలేదు. అప్పుడు కౌసల్య తిన్నగా రాముడినే అడిగింది. అప్పుడు రాముడు ”ఓం నమో నారాయణాయ.”లోని ‘రా’, ”ఓం నమశ్శివాయ” లోని ‘మ’, అనే రెండు బీజాక్షరాలు నా నామంలో ఉండటం చేత ‘రామ’ అనే పేరు యీ దేహానికి ఉండటం చేత యిది సాధ్యమైంది. ఇది నా ప్రతిభ కాదు.” అని సమాధానమిస్తాడు. దైవంకన్నా దైవ నామం, రాముని కన్నా రామ నామం గొప్పవని వివరించేందుకు చెప్పే చమత్కారంతో కూడు కున్న కథఇది.

మరో సమయంలో—సీతమ్మ అశోక వనంలో ఉన్న సమయంలో, రావణాసురుడు సీతమ్మ వారి మీద మోహంతో యింగితం కోల్పోతున్న క్షణంలో, రావణుడు పడుతున్న బాధను చూసి ఓ రాక్షసి ”సీతమ్మకు రాముడంటే పంచప్రాణాలు కదా! మీరేమో అన్ని విద్యలలోను ఆరి తేరినవారు . కాబట్టి మీరు శ్రీరాముని రూపంలో సీతమ్మ దగ్గరకు వెళ్ళండి. సీతమ్మ మిమ్మల్ని తప్పక అంగీకరి స్తుంది.” అని ఉపాయం చెబుతుంది. అది విన్న రావణబ్రహ్మ విరగబడి నవ్వుతాడు. తనకి ఉపాయం చెప్పి న రాక్షసి వంక చూస్తూ ”ఆ మాత్రం తెలివి నాకు లేదా? ఆ ఆలోచన నాకూ వచ్చింది. ఆలోచనను అమ లు చేసాను. నేను రామునిగా పూర్తిగా మారిపోయాను. అయితే అదేమి చిత్ర మో, నేను రాముడిగా మారిన క్షణం లోనే, నాలోని కాముడు మాయమైపోయా డు.” అంటూ అసలు విషయాన్ని చెబుతాడు రావణాసురుడు. రాముడు ఉన్నచోట కాముడు ఉండడు. అని చెప్పేందుకు చెప్పే కథ ఇది. ఇది యదా ర్థమా? కాదా? అనే వాదోపవాదాలు యిక్కడ అనవస రం. అంతరార్ధం గ్రహించటమే ముఖ్యం.
అదేవిధంగా కాముడు మనలో ఉన్నంతకాలంఅంటే కోర్కెలు మనలో ఉన్నంతకాలం మనకు రాముడు దొరకడు. అందడు. చిక్క డు. బంగారు లేడి వృత్తాంతం ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. అరణ్యంలో ఉన్న సీతమ్మకి అనుకోకుండా, అనూహ్యంగా బంగా రు లేడి మీద కోరిక పుడుతుంది. బంగారు లేడి కావాలని రాముడ్ని అడుగుతుంది. బంగారు లేడిని తేవడానికి రాముడు వెళ్తాడు. అప్పుడు సన్యాసి రూపంలో రావణుడు వచ్చి సీతమ్మను అనుసరి స్తాడు. తర్వాత కథ అంతా తెలిసిందే. సీతమ్మకు కోరిక కలిగిన వెం టనే రాముడు సీతమ్మకు దూరమయ్యాడు. సీతమ్మ అన్నీ త్యజిం చిన తర్వాతనే అహోరాత్రాలు రాముడే సర్వస్వం అనుకునే స్థితి వచ్చిన తర్వాతనే రాముడు మళ్ళీ సీతమ్మకి దగ్గరవుతాడు.
రామకథ మూలాల్లోకి వెళ్లి పరిశీలిద్దాం. ”గుణవంతుడు, మహావీరుడు, సత్య వాక్పరిపాలకుడు ఇత్యాది పదహారు మహా గుణములు కలిగిన నరుని గురించి నేను తెలుసుకోవాలనుకుంటు న్నాను” అని వాల్మీకి నారద మహర్షిని అడుగుతాడు. అప్పుడు నారదుడు ”నీవు చెప్పిన ఆ పదహారు సుగుణాలు కలవాడు ఈ లోకమునందే ఉన్నాడు. అతడే శ్రీరాముడు. పదహారు కళలతో ప్రకాశించే శ్రీరామ చంద్రుడు అతి విశిష్టుడు” అంటాడు. అంతటితో ఊరుకోకుండా రామ జననం నుంచి రామ పట్టాభిషేకం వరకు యావత్తు వృత్తాంతాన్ని సంక్షిప్తంగా వాల్మీకి మహర్షికి ఉపదేశించి రామాయణాన్ని రచించమని ఆదేశిస్తాడు నారద మహర్షి.
రామకథ (రామాయణం) పర్వతములు, నదులు ఉన్నంత వరకు లోకమున శాశ్వతంగా నిలిచి ఉంటుందని బ్రహ్మ వాల్మీకిని అనుగ్రహిస్తాడు. ఇక్కడే మరో విషయం కూడా గుర్తు చేసుకోవాలి. ఇక్కడ పర్వతాలు అంటే పురుషులని, నదులు అంటే స్త్రీలు అని అంతరార్ధమని, కాబట్టి స్త్రీ పురుషులు ఉన్నంత కాలం రామాయ ణం, రామకథ నిలిచి ఉంటుందనేది గుర్తించాలి.
రామ నామస్మరణలో మరో విశేషాన్ని కూడా చూద్దాం. ”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే….”
అనే శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే వేయిసార్లు స్మరించిన పుణ్యందక్కుతుందట. ‘ర’ కార, ‘మ’ కార బీజాక్షరాల కారణంగా విష్ణునామ స్మరణ, శివనామ స్మరణ ఫలితం కూడా కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక- శ్రీరాముడు కులాలకు మతాలకు వర్గాలకు అతీతుడు. ”రామ తత్త్వం” ఈ తరతమ భేదాలకు అతీతమైంది. శ్రీరాముడు తానీషాకు దర్శనమిచ్చాడు. పడవ నడుపుకుని బ్రతికే గుహుడ్ని, వానరుడైన హనుమంతుణ్ణి అనుగ్రహించాడు. తన సోదరులతో సమానమైన స్థాయిని, స్థానాన్ని ఆ ఇద్దరికీ ఇచ్చాడు. శబరి ఎంగిలిని ఆరగించి ఆమెని అనుగ్రహించాడు. పక్షి జఠా యువు చేసిన సహాయానికి ప్రతిఫలంగా, ఉత్తరక్రియలు జరిపి జఠా యువు ఋణం తీర్చుకున్నాడు శ్రీరాముడు. అదేవిధంగా ”జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయశి.” స్వర్గం కంటే మించినది కన్నతల్లి. స్వర్గం కంటే మించినటు వంటిది జన్మభూమి అనే మహత్తరమైన జననీ తత్త్వాన్ని అందించిన ఆదర్శమూర్తి శ్రీరాముడు.
ఇక సీతారాములు—వారి దాంపత్యం లోకానికి ఆదర్శం. ఇరువురిదీ ఏక స్వరూపం. వాల్మీకి రామాయణంలో సీతమ్మ వారు రావణుడితో ”రాముడు సూర్యుడు అయితే నేను ”సూర్య ప్రభ”ను అని అంటుంది. సూర్యుడి నుంచి సూర్య ప్రకాశమును వేరు చేయ లేము కదా! సీతారాములూ అంతే!!. ఆ ఏకరూపత ఆ అద్వైత స్థితి లోకానికి ఆదర్శమై, ఆచంద్ర తారార్కమై, సీతారాముల తత్త్వం సత్యమై, నిత్యమై, సనాతనమైన దివ్యత్వంగా ఆదర్శంగా భాసిల్లు తూనే ఉంటుంది. రాముడు లోక హితాన్ని కోరాడు. సంపూర్ణ జ్ఞాన స్వరూపునిగా వెలిగాడు. సమస్త సద్గుణాలను పోషించుకున్నాడు. పోషించాడు. ఈ మూడింటి ద్వారా తన అవతార తత్త్వాన్ని చాటిన అవతారమూర్తి శ్రీరాముడు. మనసులోని మంచిమాట, మాటలోని మంచి పలుకు, క్రియలో ఉన్న ఆచరణ మనుషుల్ని రమింప చేస్తాయి. అందుకే రమించే తత్త్వమే రామ తత్త్వం.
ఆ రామ చంద్రుడ్ని శరణు వేడాలి. శరణాగతులం కావాలి.

  • రమాప్రసాద్‌ ఆదిభట్ల, 93480 06669
Advertisement

తాజా వార్తలు

Advertisement