Thursday, November 21, 2024

శ్రీ రామ నామం సర్వ జగద్రక్షా కవచం

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే!!

శ్రీమన్నారాయణ స్వరూపుడు, అష్టాదశ పురాణకర్త అయిన వేదవ్యాస మహర్షి తన ఆధ్యాత్మ రామాయణంలో ”మనసారా శ్రీ నామాన్ని మూడుసార్లు ధ్యానించిన వారికి విష్ణు సహస్రనామ పారాయణ ఫలం దక్కుతుంది”
అని చెప్తూ పై రీతిగా శ్రీరామ నామ విశిష్టతను పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించుట జరిగింది.

అట్టి విశేషమైన తారక మంత్రమైన శ్రీరామ నామము వైభ వాన్ని గూర్చి వాల్మీకి నుండి నేటి వరకు ఎందరో రుషులు, మహా కవులు ప్రశంసించి కీర్తించడం జరిగింది. రామా అనే నామంలో ఎంతో పరమార్థముందని పండితులు పేర్కొన్నారు. రామా (ర ఆ మా) నామంలో ర అక్షరం రుద్రుని, అ అక్షరం బ్రహ్మను, మ అక్షరం విష్ణువునీ సూచిస్తుందని, అనగా రామనామం త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మ స్వరూపమని మహ ర్షులు పేర్కొన్నారు.
అష్టాక్షరీ మంత్రమైన ”ఓం నారాయణాయ నమ:!”లోని ‘రా’ అనే బీజాక్షరం కలిసి ‘రామ’ అనే మహిన్వితమైన నామమైంది. ఈ తారకమంత్రాన్నే తారుమారుగా ”మరామరా” అని పలికినా తుదకు ”రామా” నామ ధ్యాన తత్పరుడైన ఆ బోయవాడే ”ఆది కవి- వాల్మీకి” యై ”శ్రీ మద్రామాయణ” మహా కావ్య రచన చేసి, తాను తరించుటేకాక, సమస్త లోక వాసులను యుగయుగాలుగా తరింపజేసాడు. ఇంకా ఎందరో నేటికీ ఆ రామనామ తారకమంత్ర ధ్యానంతో కోట్లాది భక్తులు తరిస్తున్నారు. ఆ లోక కళ్యాణమూర్తులైన సీతారాముల దివ్య పుణ్య కథయైన రామాయణాన్ని కావ్యాలుగా, కీర్తనలుగా, శతకాలుగా రచించిన కాళిదాసు, భవభూతి, రామదాసు, త్యాగరాజు, మొల్ల, కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ, వాసుదాసస్వామి వంటి మహనీయు లెందరో ధన్యులైనారు. ఆ రామాయణాలను ఎందరో భక్తులు పారా యణం చేసి మోక్షం పొందుతున్నారు.
”రామ” నామ మహిమ భక్త రామదాసు
”రా”- కలుషంబు వెల్ల బయలం బడద్రోచిన ”మా” కవాటమై ఢీకొని ప్రోచు నిక్కమని థీయుతలెన్న తదీయ వర్ణముల్‌ గైకొని భక్తితో నుడువ గాన రుద్రాక – విపత్పరంపరల్‌
దా కొనునే జగజ్జనుల! దాశరథీ కరుణాపమోనిధీ!!
”రామా” అనే నామంలోని ”రా” అనే అక్షరాన్ని ఉచ్చరిస్తే అది దేహంలోని పాపాలన్నింటినీ (నాలుక ద్వారా) బయటకు నెట్టి వేయగా ‘మ’ అనే అక్షరాల్ని ఉచ్ఛరించగానే అది నోటిలో కవాటం వలె అడ్డుపడి బయట ఉన్న పాపాలను తిరిగి లోపలికి ప్రవేశించకుండా నిరోధిస్తుందని భక్త రామదాసు తన ”దాశరథీ శతకం”లో ఎంతో రమణీయంగా పారమార్థికంగా పేర్కొన్నాడు.
అంతేకాదు రామ మహిమను గూర్చి రామదాసు
ఇలా వర్ణిం చారు-
”హరు నహా, నవ్వి భీషణున. కద్రిజహం తిరు మంత్ర రాజమై
కరికి, నహల్యకున్‌, ద్రుపద రాజకన్యకు నార్తి. చుట్టమై
పరిగి నయట్టి నీ పతిత పావన నామము జిహ్వపై నిరం
తరము నటింప చేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ!!
శివుడికీ, పార్వతికీ, విభీషణుడికీ, శుభకరమగు మంత్రమై గజేం ద్రుడికీ, అహల్యకూ, ద్రౌపదికీ కష్టాలు పోగొట్టిన చుట్టమై అలరారి, పాపాత్ములను, పాప విముక్తులను చేసే గొప్ప మహిమాన్విత మం త్రం- రామ నామమని, ఆ రామ నామం తన నాలుకపై నటింప జేయు మని భక్త రామదాసు శ్రీరామచంద్రున్ని కోరుతూ ఆ రామ నామ మహిమ వైభవాన్ని ఎంతో మహనీయంగా కొనియాడాడు.
అంతేకాక రామదాసు తన కీర్తనల ద్వారా ”శ్రీ రామ నామం మరువాం! మరువాం!!”, అంతా రామమయం! జగమంతా రామ మయం!” అని ”శ్రీ రామనామ మహిమల మకరందాలను మన తెలుగు జాతికి అందించి రామ నామ మాధుర్యాన్ని చవి చూపించి ధన్యుడైనాడు కదా!!
కనుకనే ఇట్టి సర్వలోక రక్షా మంత్రమైన శ్రీ రామ తారక మంత్ర మహిమను గూర్చి తరతరాలుగా మన పెద్దలూ మహనీయులు పేర్కొనటం, ప్రబోధించటం జరుగుతోంది. అందుకే శ్రీ రామ నామం- లోక కళ్యాణ ప్రదం అని పెద్దలు పలికారు.
ప్రపంచంలో భక్త జనులందరూ సర్వకాల సర్వావస్థలలో తమను రక్షించమని కోరుతూ
”ఆపదామపహార్తారం- దాతారం సర్వ సంపదామ్‌,
లోకాభిరాం శ్రీ రామం భూయోభూయో నమామ్యహం!!”
అని శ్రీరామ ధ్యాన శ్లోకాన్ని పలుమార్లు పఠిస్తూ, శ్రీరామాను గ్రహాన్ని సదా పొందుతూ, సకల భీష్టా సిద్ధి పొందుతూ ధన్యులౌతు న్నారు. సప్త కోటి మహా మంత్రాలలో మహోత్కృష్టమైనది రెండు అక్షరాల రామనామమని మన మహర్షులు కొనియాడటం విశేషం. మన తల్లులు కూడా పసిపిల్లలకు స్నానం చేయిస్తూ చివరిలో ‘శ్రీరామ రక్ష’ అని స్మరించి, దీవించటం కూడా గొప్ప విశేషం. అందుకే సర్వ లోకాలకు ఆ దివ్య శ్రీరామ నామమే సర్వ జగత్తు. అందుకే అట్టి దివ్య మహిమాన్వితమైనట్టి శ్రీ రామ నామా న్ని స దా ధ్యానించి తరించుదాం!!
– కళ్యాణశ్రీ

Advertisement

తాజా వార్తలు

Advertisement