తులసీ కాష్ఠ సంభూతాం యో మాలాం వహతే ద్విజ: |
అప్యశౌచో ప్యనాచారో మామేవైతి న సంశయ: ||
ధాత్రీ ఫలకృతామలా తులసీ కాష్ఠ సంభవా |
దృశ్యతే యస్య దేహేతు సవై భాగవతో నర: ||
తులసీదలజాం మాలాం కంఠస్థాం వహతే తు య: |
మమోత్తీర్ణాం విశేషేణ సనమస్యోదివౌకసామ్ ||
తులసీదల జాం మాలాం ధాత్రీ ఫల కృతామపి |
దదాతి పాపినాం ముక్తిం కింపునర్మమ సేవినామ్ ||
తులసీదల జాం మాలాం మమోత్తీర్ణాం వహేత్తు య: |
పత్రేపత్రే శ్వమేధానాం దశానాం లభతే ఫలమ్ ||
తులసీ కాష్ఠ సంభూతమైన మాలను ధరించునవాడు అపరిశుద్ధుడైననూ ఆచారహీనుడైననూ నన్ను చేరును. ఇందులో సంశయము లేదు. ధాత్రీ ఫలముల (వుసిరి)చే చేయబడిన మాలను,తులసీ కాష్ఠ సంభవమైనదానిని ధరించినవాడు పరమ భాగవతోత్తముడు. తులసీదలముల మాలను కంఠమున ధరించినవాడు అది కూడా నేను ధరించి విడిచినదైనచో అనగా నా శేషమాలను ధరించినవానిని దేవతలు కూడి నమస్కరింతురు. తులసీదల మాల ధాత్రీ ఫలముల చే చేయబడిన మాల పాపులకు కూడా ముక్తి ఇచ్చును. ఇక నన్ను సేవించువారిని ఏమి చెప్పవలయును. నేను ధరించి విడిచిన తులసీదలమాలను ధరించినవాడు ఒక్కొక్క పత్రమున పది అశ్వమేధముల ఫలమును బొందును.
డా|| కందాడై రామానుజాచార్యులు