భగవంతుని ప్రార్ధన, పూజ లేదా భజన చివర్లో లేక గౌరవనీయులైన అతిథిని లేక మహాత్ముడిని ఆహ్వానించేటప్పుడు హారతి ఇస్తాం. ఇదెప్పుడూ ఘంటానాదంతోను కొన్ని సమయములలో పాటలు ఇతర సంగీత వాయిద్యాలతోను, మరియు చప్పట్లతోను కలిసి ఉంటుంది. ఇది పదహారు అంచెలుగా చేసే షోడశోపచార పూజా కార్యక్రమములోని ఒక భాగం. ఇది శుభసూచకమైన మంగళ నీరాజనముగా సూచింప బడుతుంది. భగవంతుని రూపాన్ని ప్రకాశింప చేయడానికి మనం కుడిచేతిలో వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని వలయాకార దిశలో హారతి ఇచ్చేటప్పుడు దీపపు వెలుగులో ప్రకాశించే భగవంతుని సుందర రూపాన్ని ప్రతిభాగము విడిగాను, పూర్తి రూపం శ్రద్ధగా గమనిస్తూ, మనసులో గానీ పైకి గానీ స్తోత్రాలు చదవడం చేస్తాం. ఆ సమయంలో మన ప్రార్ధనలో తపన మరియు భగవంతుని రూపంలో ప్రత్యేకమైన సౌందర్యం మనకు అనుభవమవుతుంది. చివరలో ఆ వెలుగుపై మన చేతుల నుంచి కళ్ళకు అద్దుకొంటాం.
ఇష్టపూర్వకముగా భగవంతుడిని పూజించినప్పుడు, అభిషేకం చేసినప్పుడు, అలంకరించినప్పుడు, ఫలములు, మధుర పదార్థములతో నివేదించినప్పుడు వైభవోపేతమైన ఆయన సుందర రూపాన్ని చూడగలం. దీపపు వెలుగుచే ప్రకాశవంతముగా కనపడుతున్న భగవంతుని ప్రతి భాగము మీద మనస్సు సంధించబడి రమ్యమైన రూపంపై మనసు మెలకువతో నిశ్శబ్ద ధ్యానం చేస్తుంది. గానం చెయ్యడం చప్పట్లు చరచడం, గంట వాయించడం మొదలైనవన్నీ భగవంతుని దర్శనముతో కల్గిన సంతోషాన్ని మరియు శుభ సూచకాన్ని తెలుపుతాయి.
హారతి సాధారణంగా కర్పూరంతో ఇవ్వబడుతుంది. కర్పూరాన్ని వెలిగించినపుడు ఏ మాత్రము చాయలు మిగల్చకుండా తనకు తాను పూర్తిగా కాలిపోతుంది. కర్పూరం మన అంతర్గత ప్రవృత్తులకు (వాసనలు) ప్రతీక. జ్ఞానమనే అగ్నిచేత వెలిగించ బడినప్పుడు ఏదైతే భగవంతుడిని ప్రకాశింప చేస్తుందో ఆ జ్ఞానాగ్నే మన వాసనలు పూర్తిగా దగ్దం చేసి భగవంతుడి నుంచి దూరం చేసే అ#హంకారాన్ని నిర్మూలిస్తుంది. తరచూ మనం ప్రకాశింపచేసే భగవంతుణ్ణి చూడడానికి చాలాసేపు వేచి ఉంటాం. కానీ మన లోపల చూసుకోవడానికా అన్నట్లు హారతి ఇచ్చే అసలు సమయానికి అయాచితంగా కళ్ళు మూత పడతాయి. మన దే#హము దేవుని ఆలయమనీ, లోపల దివ్యత్వాన్ని కలిగి ఉన్నామని ఈ విధంగా కళ్ళు మూయడం సూచిస్తుంది. పూజారి హారతి వెలుగులో భగవంతుడిని స్పష్టంగా చూపించినట్లుగానే, గురువు గారు కూడా జ్ఞానమనే వెలుగు సహాయంతో ప్రతి ఒక్కరికి లోనున్న దివ్యత్వాన్ని స్పష్టంగా తెలియపరుస్తారు. హారతి చివరిలో దానిపై చేతులుంచి తరువాత కళ్ళకి, తలపైభాగానికి అడ్డుకోవడమంటే అర్ధం భగవంతుడిని ప్రకాశింపజేసిన ఈ వెలుగు నా దృష్టిని వెలిగించుగాక! నా దృష్టి పవిత్రమగు గాక! నా ఆలోచనలు ఉన్నతంగాను మంచివి గాను ఉండుగాక! అని ప్రార్ధించడం.
హారతికి వేదాన్తపరమైన అర్ధం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు విద్యుత్ అగ్ని ఇవి వెలుగుకి స#హజమైన మూల కారణాలు. సృష్టిలోని అద్భుతమైన అపూర్వమైన వాటన్నింటికి భగవంతుడు ఆధారం. ఆయన కారణంగానే మిగిలినవి ఏవైనా ఉండటమూ, ప్రకాశించడమూ జరుగుతుంది. హారతి వెలుగులో భగవంతుడిని ప్రకాశింప చేసినప్పుడు మన దృష్టిని అన్ని వెలుగులకు మూల కారణం, జ్ఞానాన్ని జీవితాన్ని సూచించే పరమాత్మ వైపు మళ్లిస్తాం.
సూర్యుడు బుద్ధికి, చంద్రుడు మనసుకి, అగ్ని వాక్కుకీ అధిదేవతలు. భగవంతుడు వీటన్నింటిని వెలిగించే అత్యున్నతమైన చైతన్యం. ఆ చైతన్యం లేకుండా బుద్ధి ఆలోచించలేదు. మనసు భావింపలేదు. నాలుక మాట్లాడ లేదు. మనసు బుద్ధి వాక్కులకీ వెనుక ఉన్నదీ భగవంతుడే. ఈ పరిమితమైన ఉపకరణాలు ఆ అపరిమితమైన భగవంతుడిని ఏ విధంగా ప్రకాశింపజేయగలవు? అందుకే హారతి ఇచ్చేటప్పుడు మనము ఈ క్రింది విధంగా స్తుతిస్తాము.
న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకం
నేమా విద్యుతో భాంతి కుతొ యమగ్ని:
తమేవ భాంత మనుభాతి సర్వం
తస్యభాసా సర్వమిదం విభాతి
సూర్యుడు ప్రకాశించని చోట, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్ ప్రకాశించని చోట, భగవంతుడు ఉన్నాడు. మరి ఈ చిన్ని జ్యోతి (నా చేతిలో ఉన్న) ఏమి చేయగలదు? ప్రతిదీ భగవంతుని శక్తి వలననే ప్రకాశిస్తాయి. ఆ వెలుగు వలన మాత్రమె మనమంతా ప్రకాశింప బడుతున్నాం.
- కామిడి సతీష్ రెడ్డి