పరమ రుషుల అనుగ్రహాన్ని పవిత్ర సుగంధ సౌరభ సంపన్న మంత్రపేటికలుగా అందిస్తున్న పురాణపండ శ్రీనివాస్‌కు కనకదుర్గమ్మ కటాక్షం పుష్కలంగా ఉందని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. రచయిత పురాణపండ శ్రీనివాస్ అందించిన ‘ఉగ్రం.. వీరం’ గ్రంధాన్ని బెజవాడ దుర్గమ్మ సన్నిధానంలో ప్రత్యేక వేదికపై ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ లక్ష్మీనృసింహ స్వామి ఉపాసన ఉన్న చోట విచారాలు, విషాదాలు, నైరాశ్యాలు ఉండవన్నారు. ఆపదలను దూరం చేసే అద్భుతమే ఈ ‘ ఉగ్రం .. వీరం ‘ దివ్యగ్రంధమని చెప్పారు.
ఈ అపురూప కార్యక్రమాన్ని పర్యవేక్షించిన దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం జాయింట్ కమిషనర్, ఈవో కేఎస్ రామారావు మాట్లాడుతూ.. సర్వ ప్రహరణాయుధుని మహాపరాక్రమమే పురాణపండ ‘ ఉగ్రం… వీరం ‘ గా పరతత్వంతో అందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులతో పాటు పెద్ద ఎత్తు భక్తులు పాల్గొన్నారు. కాగా, ఈ గ్రంథాన్ని దేవస్థాన సిబ్బంది ఉచితంగా అందజేశారు.