Friday, December 20, 2024

ప్రథమం… అధమం!

ధనం మనిషిని నడిపించే ఇంధనంలా మారిన నేపథ్యంలో మానవ జీవితాలు కడు దుర్భరంగా మారుతున్నాయి. ఆప్యాయతలకు అర్ధాలు మారుతున్నాయి. బంధాలకు నిర్వచనాలు రూపాంతరం చెందుతున్నాయి. మానవ సంబంధాలు విశ్వసనీయత కోల్పోయి, ఆర్థిక బంధాలుగా పరివర్తన చెందుతున్నాయి. చేసిన త్యాగాలు, అనుభవించిన కష్టాలు అక్కరకు రాకుండా పోతున్నాయి. కృతజ్ఞత కానరావడం లేదు. మేలు చేసిన వారికి కీడు ఎదురవుతున్నది. మనుషుల మధ్య మాటలు కూడా కరువైపోతున్నాయి. పలకరిస్తే దండగనే భావనతో ఆత్మీయులు సైతం దూరమైపోతున్నారు. అవకాశవాదంతో రంగులు మారుస్తున్నారు. స్వార్థం కోసం అనునిత్యం జరిగే అన్వేషణా క్రమంలో మానవ #హృదయానికి స్వాంతన సమకూరడం లేదు. స్వార్ధ చింతనలో మునిగి తేలుతూ నిజమైన ఆనందాన్ని కోల్పోతున్న నేపథ్యంలో కృత్రిమ ఆనందం కోసం వక్ర మార్గాలు వెతుక్కోవడం విడ్డూరం. సక్రమ జీవన విధానమే నిజమైన ఆనందానికి సోపానం. మానసిక దారిద్య్రంలో బ్రతుకుతున్న మనిషికి నిజమైన ఆనందం ఏనాటికీ లభించదు. సకల సద్గుణ సంపదలను కోల్పోయి సకలపాపాలను మూటగట్టుకుని జీవించడంలో నిజమైన మానసిక సంతృప్తి లభించదు. సిరిసంపదలకంటే గుణసంపద మనిషిని మహూన్నతుని చేస్తుంది. నీతి కథలతో సద్గుణాలు అలవడేవిధంగా సంస్కారవంతమైన పెంపకాలతో సాగిన నాటితరం ఆలోచనలు నేటి తరానికి పనికిరావడం లేవు. సృష్టిలో మానవుడంటే ప్రథముడు కాదు అధముడు అనే భావన క్రమేపీ పెరిగిపోతున్నది. నిండైన గుణాలు మెండుగా ఉంటే వ్యక్తిత్వం వికసిస్తుంది. సమాజం గౌరవిస్తుంది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం వలనే వ్యక్తిత్వానికి వన్నె చేకూరుతుంది. గాలికి వంగే చెట్టు తుఫానును సైతం తట్టుకుని నిలబడుతుంది. పొడవైన చెట్టు అననుకూలమైన పరిస్థితుల్లో నిటారుగా నిలబడితే, గాలివాటానికి వంగకపోతే నేలపై ఒరగక తప్పదు. మనిషి కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమే నిజమైన సంస్కారగుణం.

– సుంకవల్లి సత్తిరాజు

Advertisement

తాజా వార్తలు

Advertisement