ధృతరాష్ట్రుని వ్యామోహము, దుర్యోధనుని ఈర్శ్యాసూయలు, ఏమైతేనేమి మహా భారత యుద్ధము అనివార్యమైనది. 18 రోజుల లో 18 అక్షోహిణల సైన్యం అసువులు కోల్పోయింది. తమ వారందరికీ గంగానదీతీరమందు తిలాంజులులు సమర్పించిన పాండవులు, విదురుడు, ధృతరాష్ట్రుడు, భరత వంశ స్త్రీలు శోక తప్తులై కొంతకాలం అక్కడే ఉండిపోయారు. యుధిష్టిరుడు తీవ్రమైన శోకానికి, వైరాగ్యానికి గురి అయినాడు. ఆ సమయంలో అతని వద్దకు వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థానుడు, కణ్వుడు మొదలగు మహామహులు తమ శిష్య బృందాలతో విచ్చేసారు. యుధిష్టిరుడు వారందరికీ పూజాధికాలు నిర్వర్తించాడు.
వారికి ఏర్పాటు చేసిన సమున్నత ఆసనాలపై అందరూ ఆసీనులయ్యారు. ఒక్కొక్కరు యుధిష్టిరునకు ధైర్యం చెప్పి రాజ్య పరిపాలన వైవు దృష్టి మరల్చి ప్రయత్నించసాగారు. ధర్మబద్ధ విజయాన్ని పొందిన నీవు శోకముతో కృంగిపోవడం భావ్యము కాదని సముదా యించారు. అంత యుధిష్టిరుడు ”మహర్షులారా! శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయము, బ్రహ్మవేత్తల యొక్క అనుగ్రహ ము, భీమార్జునుల పరాక్రమము వలన ఈ భయంకర సంగ్రామంలో విజయాన్ని పొందాము. కానీ ఈ కుల సంహారము నాకు మహా దు:ఖం కలిగిస్తోంది. ముఖ్యంగా ద్రౌపది పుత్రశోకం, ఆమె బంధువర్గం అంతా మరణించిన మహాశోకం నన్ను కలవరపరుస్తున్నాయి. అన్నింటి కంటే మా తల్లి కుంతీదేవి కర్ణుని జన్మ రహస్యం దాచిపెట్టి నా హృదయాన్ని ఛిద్రం చేసింది. ఈ రాజ్యం, భోగాలు నా మనసును ఆనందపరచలేవు. శోకం ముందు ఆనందం నిలువలేదు. పతిపుత్రులను కోల్పోయిన ఈ అబలల ఆర్తనాదాలు నా చెవులలో మారుమ్రోగుతున్నాయి” అంటూ తీవ్రమైన ఆందోళన కు గురయినాడు.
అంత వ్యాసభగవానుడు యుధిష్టిరునితో ”చనిపో యినవారు ఎటువంటి కర్మలు చేసినా తిరిగిరారు. ఇది అంతా కాల మహిమ. శిల్పం, మంత్రం, ఔషధులు కూడా దుర్భాగ్య కాలంలో ఫలితాన్ని ఇవ్వవు. నీ వంటి ధర్మపరుడు శోకించడం తగదు. దు:ఖాన్ని అనుమతిస్తే దు:ఖమే కలుగుతుంది. భయాన్ని ఆహ్వానిస్తే భయమే మిగులుతుంది.
సుఖ స్యానన్తరం దు:ఖం దు:ఖస్యానన్తరం సుఖమ్|
న నిత్యం లభతే దు:ఖం న నిత్యం లభతే సుఖమ్||
సుఖమ్ తరువాత దు:ఖం, దు:ఖం తరువాత సుఖం కలుగుతాయి. ఎవరూ ఎల్లప్పుడూ దు:ఖమును గాని, సుఖమునుగాని పొందుట లేదు.
సమయం వచ్చినప్పుడు మాత్రమే మేఘం నీటిని వర్షిస్తుంది. సమయానుకూలంగానే సూర్యోదయ, అస్త మానాలు, చంద్రుని వృద్ధి క్షయాలు, సముద్రపు ఆటు పోట్లు జరుగుతుంటాయి. అందువలన ఈ కాలచక్రంలో అందరూ తిరుగాడవలసినదే!
ధర్మానికి దీక్ష పూనడం, యుద్ధం చేయడం, దండనీ తిని అమలుచేయడం, యజ్ఞ దక్షిణలు సమర్పించడం, దేశాన్ని రక్షించడం మొదలగునవి రాజుల యొక్క యో గం అని గ్రహించు. నీకీ శోక సమయంలో అశ్మ మహర్షి విదేహరాజు జనకునికి ఒక దు:ఖ కాలంలో శుభం కలగ టానికి ఎలా నడచుకోవాలో విశదపరిచాడు.
మానసానం పునర్యోనిర్దు:ఖానాం చిత్త విభ్రమ:|
అనిష్టోపనిపాతోవా తృతీయం నోపసద్యతే||
మనిషికి నిరంతరం కలుగు మానసిక దు:ఖము లకు కారణములు చిత్త భ్రమణము, అనిష్ఠప్రాప్తి. జయా పజయాలు యుద్ధములో అనివార్యం. అయితే విజయ ము లభించిననూ వార్ధక్య మరణములు తప్పవు. అందు వలన కర్తవ్య పాలన ధర్మము.
ఈ సంసార చక్రము తిరుగుచునే ఉండును. దీనిలో ప్రియజనుల సహవాసము శాశ్వతము కాదు. సోదరు లు, మిత్రులు, తండ్రులు, తల్లులు మున్నగువారి కలయి క, వియోగం ప్రయాణమందు తటస్థపడు ప్రయాణీకుల వంటివి. ఈ ప్రపంచమున మనము అనేక పర్యాయము లు జన్మలెత్తి అనేకమంది తల్లిదండ్రులను, స్త్రీ పుత్రులను పొంది అనుభవించితిమి. కాని ఇప్పుడు వారు ఎవరి వారు? మనము ప్రస్తుతం ఎవరి వారము? మనము వారందరిలో ఎవరు? అను ప్రశ్నలకు సమాధానము లేదు. కావున వివేకవంతుడు ఎవరి కొరకు శోకించడు. సుఖ దు:ఖాలు జ్ఞానాన్ని నశింపజేస్తాయి. అజ్ఞానంలో ఇతరుల సంపద మీద మనసు పడుతుంది. అనుచిత మైన ఉపాయాల ద్వారా, అధికారాన్ని, ధనాన్ని పొందా లని చూస్తాడు. ఆ సమయంతో ఇతర రాజుల నుండి ప్రతిఘటన మొదలవుతుంది.
జనన మరణాలు, లాభనష్టాలు దైవాధీనములు. వైద్యుడు కూడా రోగి అవుతాడు. బలవంతుడు నిర్భలుడ వుతాడు. శ్రీ మంతుడు దరిద్రుడవుతాడు. మంచి వంశం లో జన్మించడం, పౌరుషం, ఆరోగ్యం, రూపం , సౌభా గ్యం, ఐశ్వర్యం మొదలగునవి ప్రారబ్ధంతో లభిస్తాయి. రోగం, ఆపద, జ్వరం, మృత్యువు, పతనం, ఇవన్నీ జీవు డు జన్మించినప్పుడే నిర్ణయమైపోతాయి. కావున పరి స్థితులను ఎదుర్కొని సాగవలసినదే తప్ప తప్పించుకోలే రు. అయితే తనకు శుభం కలగాలి అని కోరుకునే వారు ధర్మాన్ని శాస్త్రానుసారంగా పాటించాలి. పితరులను మనసున నిలుపుకోవాలి. దేవయజ్ఞం కొనసాగిం చాలి. ధర్మార్థ కామాలను సేవించాలి. పరమాత్మను ఆరాధిం చాలి. మంచి గృహస్థుగా సంతానాన్ని పొందాలి. వారిని ధర్మ నిరతులుగా లోకానికి అందించాలి.
ఈవిధంగా అశ్మ మహర్షి జనకునికి ధర్మ రహస్యం బోధించి దు:ఖ విముక్తిని కలిగించాడని శ్రీ వ్యాస భగవానుడు యుధిష్టిరునికి చెప్పి రాజ్య పరిపాలన వైపు దృష్టి మరల్చాడు. యుద్ధంలో విజయాన్ని పొందినా దాని దారుణ ప్రభావం యుధిష్టిరుని కృంగదీసింది.
– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
80746 66269
యుద్ధ ప్రభావం
Advertisement
తాజా వార్తలు
Advertisement