Thursday, November 21, 2024

ఉత్తమ ధర్మం!

అంపశయ్యపై ఉన్న భీష్ముడిని ‘ధర్మం అంటే ఏమిటో’ తనకు సూక్ష్మంగా తెలపాల్సిందిగా కోరాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు.. ‘ఇతరులు ఏం చేస్తే, మన మనసు బాధ పడుతుందో, అటువంటి పని ఇతరులకు మనం చేయకుండా ఉండటమే ఉత్తమోత్తమమైన ధర్మం’ అంటాడు. అదే స్వధర్మం. అందులో భాగం దానం. పాత్రత ఎరిగి ఇచ్చిన దానం ధర్మాన్ని నిలబెడుతుంది. అలాంటి ధర్మం నేటి సమాజానికి ఎంతో అవసరం. ‘దానం మహత్తర కార్యం’ అని పేర్కొన్నాడు వేదవ్యాసుడు. మనం ఆశించకపోయినా పుణ్యఫలం అందించే గొప్పతనం దానానికి ఉంది. కన్యాదానం, గోదానం, భూదానం, విద్యాదానం ఈ నాలుగింటిని అత్యున్నత దానాలుగా పేర్కొన్నాయి మన శాస్త్రాలు. కన్యాదానం వల్ల ఒక కుటుంబం ఏర్పడుతుంది. భూదానం, గోదానం వల్ల కుటుంబానికి అవసరమైన పాడిపంటలు సమకూరుతాయి. విద్యాదానం వల్ల అజ్ఞానం అంతరించి, జీవన విధానానికి దారి దొరుకుతుంది. ఇవే కాకుండా దశ దానాలనీ, షోడశ దానాలనీ కూడా ఉన్నాయి. మరి ఇన్ని దానాలలో చేర్చనిదీ, ఆర్తులకు ఆకలిని తీర్చేది అన్నదానం. దీనులకు సాయపడటాన్ని ‘దానం’ అని అభివర్ణించారు. కాబట్టి పైన పేర్కొన్న అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని పెద్దల మాట. మరణ భయంతో విలవిల్లాడే వాడికి అభయం ఇవ్వడం, వ్యాధిగ్రస్తుడికి సరైన చికిత్స అందించడం, విద్యాభిలాషికి విద్యాదానం చేయడం, ఆకలితో ఉన్నవానికి అన్నదానం చేయడం ఈ నాలుగూ చతుర్విధ ఉత్తమ దానాలు. శక్తి, సామర్థ్యం కొద్దీ దానధర్మాలు చేయాలని శాస్త్ర వచనం. శక్తికి మించి చేయకూడదు. కలియుగంలో దానాన్ని మించిన సత్కర్మ లేదని పురాణాలు చెబుతున్నాయి. కృత యుగంలో తపస్సు, త్రేతా యుగంలో జ్ఞానం, ద్వాపర యుగంలో యజ్ఞం, కలియుగంలో దానం చేయడం విశిష్ట కర్మలుగా పేర్కొన్నారు. దానం గొప్పదే! అయితే, ఇచ్చే స్థితిలో ఉన్నందుకు సంతోషించాలే కానీ, మిడిసిపడకూడదు. దానగ్ర#హతలను చులకనగా చూస్తూ, వారి మనసు నొప్పించే విధంగా మాటలు అని దానం చేస్తే పుణ్యం రాకపోగా, పాపం పెరుగుతుంది. దానాన్ని శ్రద్ధతో ఇవ్వాలి. అభిమానంతో సాయం చేయాలి.

  • కామిడి సతీష్‌ రెడ్డి
Advertisement

తాజా వార్తలు

Advertisement