విశాఖపట్నం, (ఆంధ్రప్రభ) : పసితనపు లాలిత్యం మూటకట్టిన పరిణిత ప్రజ్ఞ, పరమార్థభావనతో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం సలహాదారు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనాలు శ్రీపూర్ణిమ, శ్రీమాలిక గ్రంథాలు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లోని అనేక ఆలయాల్లో, సాంస్కృతిక ఉత్సవాల్లో వందల కొలది రసజ్ఞుల్ని, భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
పురాణపండ శ్రీనివాస్ అసాధారణ ప్రతిభ, ఆధ్యాత్మిక సాహిత్యపు విలువలతో ఎంతో శోభాయమానంగా అందిస్తున్న ఈ మహాగ్రంథాలు భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి లోనుచేయడం ఎంతో సంతోషదాయకమని తిరుమల మహాక్షేత్ర ప్రధానార్చకులు ఏ.వేణుగోపాలదీక్షితులు అభినందించడం గమనార్హం.
గతంలో విఖ్యాత ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించిన శ్రీపూర్ణిమ గ్రంథాన్ని నాటి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహా దారు కేవీ.రమణాచారి సమర్పించడం విశేషం. ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం సంస్థ అధినేత సాయి కొర్రపాటి నిస్వార్థసేవగా అఖండంగా దివ్యత్వంతో శ్రీపూర్ణిమ తొలి ప్రచురణను ప్రచురించి సినీవర్గాలను కూడా ఆకట్టుకున్నారు.
తరువాత ఇదే గ్రంథాన్ని వరుసగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆర్కే.రోజా సెల్వమణి ప్రచురించి నాటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిచే ఆవిష్కరింప జేసి, సహచరమంత్రులు, శాసనసభ్యులు, నియోజక వర్గ ఆలయాలకు, భక్తులకు పంచారు. హైదరాబాద్ త్యాగరాయ గానసభ, రవీంద్రభారతిల్లో ఎన్నో సాంస్కృతిక ఉత్సవాల్లో శ్రీపూర్ణిమ గ్రంథాలను జ్ఞాపికలుగా గానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి సారథ్యంలో పంపిణీ చేయడం విశేషం.
మరొక ఆకర్షణీయ గ్రంథం శ్రీమాలికను మొదట లలిత బ్రాండ్ రైస్ సంస్థ ప్రచురించి కంచి కామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతీ మహాస్వామిచే ఆవిష్కరింప చేసి తూర్పు గోదావరి, విశాఖ నగరాల్లోని ఎన్నో వేద పాఠశాలలకు పంచడంతో లలిత బ్రాండ్ రైస్ ఖ్యాతిని పెంచినట్లయింది.
సినీనిర్మాత సాయి కొర్రపాటి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడి కుమారుడు ముప్పవరపు హర్షవర్ధన్ హైదరాబాద్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణలో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవాల్లో శ్రీమాలిక గ్రంథాన్ని ప్రచురించి, భక్తకోటికి ఉచిత కానుకగా సమర్పించి, ఏడాది కావొస్తున్నా ఇప్పటికీ భక్తజనం ఈ గ్రంథంతో అనేక చోట్ల పారాయణాలు చేయడం గమనార్హం.
ఏదేమైనా పురాణపండ శ్రీనివాస్ అందిస్తున్న ప్రాణభూతమైన గ్రంథాలు ఒక కృతార్థతను ఆవిష్కరిస్తున్నాయని, ప్రత్యక్షంగా ఆయన స్తోత్రాలకు అందించే తొలి పలుకుల అద్వైతసిద్ధి పీఠాధిపతులనే ఆశ్చర్యపరుస్తోందని రామకృష్ణమఠం మఠాధిపతి స్వామి జ్ఞానదానంద గతంలోనే స్పష్టం చేశారు.
వచ్చే కార్తీకమాసంలో విశాఖనగరంలోని అనేక ఆలయాలకు ఈ శ్రీపూర్ణిమ, శ్రీమాలిక గ్రంథాలు ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రచురణ సంస్థ జ్ఞాన మహాయజ్ఞకేంద్రం సంస్థ సమర్పించబోతోంది. అనవరత శివార్చనలో తరిస్తూ శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారునిగా గతంలో ఎన్నో సేవలనందించిన పురాణపండ శ్రీనివాస్ నిశ్చలమైన నిష్ఠతో ఈ గ్రంథ రచనా వైభవాలను హైదరాబాద్, విశాఖ నగరాల ఆలయాలకు, మఠాలకు, పీఠాలకు అందించడం శుభపరిణామంగా విఖ్యాత నటు-లు, ప్రఖ్యాత రచయిత తనికెళ్ళ భరణి పేర్కొనడం విశేషం.