కార్తీక మాసంలో ఉసిరి చెట్టును, విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించడం సాంప్రదాయం. అలాగే రావిచెట్టును ప్రతి నిత్యం పూజించేవారికి దారిద్య్రం తొలగిపోతుందని పెద్దల ఉవాచ. మనసులోని కోరికను చెప్పుకుని రావి చెట్టుకు అనునిత్యం ప్రదక్షిణలు చేసి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరు తాయని నమ్మకం. సంతానయోగం కలుగు తుందని విశ్వాసం. రావి చెట్టును త్రిమూర్తుల నిలయంగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ చెట్టు కిందనే బుద్ధుడికి జానోదయం అయిందని నమ్మకం. కాబట్టి, దీనిని ‘బోధి చెట్టు’గా సూచిస్తారు. సంప్రదాయ భారతీయ సాహిత్యం రావి వృక్షాన్ని ‘అశ్వత్థ’ వృక్షంగా వర్ణిస్తుంది.
రావి చెట్టును ఋగ్వేదంలో దేవునిగా సూచించబడుతుంది. యజుర్వేదం ప్రకారం ప్రతి యాగములో అత్యంత ప్రామాణికమైనదిగా పరిగణించ బడుతుంది. అధర్వణ వేదంలో అన్ని దేవతల నివాసంగా వర్ణించ బడింది.
”మూలతో బ్రహ్మరూపాయ
ధృతి విష్ణు రూపిణి,
అగ్రతో శివ రూపాయ,
వృక్ష రాజాయ నమోనమ: …అని మంత్రం.
మహా భారతంలో కృష్ణుడు తనను తాను రావి చెట్టుగా అభివర్ణించినాడు. (వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని… భగవద్గీత). అందువల్ల పూర్వ కాలం నుండే రావి చెట్టు ఆరాధన వుంది. దేవాలయాల్లో రావి, వేప చెట్టు కలిసే ఉంటాయి. ”రావి” చెట్టుని శ్రీ ”మహావిష్ణువు”గానూ, ”వేప” చెట్టుని ”లక్ష్మిదేవి”గాను భావించాలని శాస్త్రాలు, వేదాలు చెపుతున్నాయి. ఈ జంట వృక్షాలను పూజించి, ప్రదక్షిణం చేయడం ద్వారా అనేక దోషాలు తీరి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు. ఈ చెట్టుక్రిందే శ్రీకృష్ణుడు చివరి దశలో విశ్రమించి వైకుంఠంకు చేరాడు. అందుకే శనివారం మాత్రమే ఆ చెట్టును తాకాలని పండితులు సూచిస్తున్నారు. రావిచెట్టుకు బ్రహ్మదేవునితో కూడా సంబంధం ఉంది. చావు పుట్టుకలు లేని బ్రహ్మదేవుడు మరణించిన వారి ఆత్మలను తనలో కలుపుకునే చెట్టుగా రావి చెట్టు ఉన్నది. రావి చెట్టు కింద కర్మ క్రతువులను జరుపుటకు కూడా కారణం ఇదే. రావి చెట్టు ఎన్నడూ ఒకేసారి ఆకు విడువదు. ఆకులు పడిపోయే కొలదీ కొత్త ఆకులు చిగురిస్తూ నూతన జన్మను తీసుకొంటాయి. ఇది జన్మ, మరణ చక్రం అని సూచిస్తుంది. అందు వలన దీనిని ఆధ్యాత్మిక వాస్తవికతకు సంబంధించిన చెట్టుగా భావిస్తుంటారు. కొందరి నమ్మకాల ప్రకారం ఈ భూమి మీద ఉన్న ప్రతి రావి చెట్టు ఆకు ఒక ప్రాణంగా చెప్పబడుతున్నది.
రావి చెట్టు ఎన్నటికీ చనిపోదు… అది శాశ్వతంగా ఉంటుంది. దాని శాశ్వత స్వభావం కూడా శాశ్వతాత్మతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది శాశ్వతమై, మరణం లేనిదిగా ఉంటుంది. శని దోషం ఉన్న వారు రావిచెట్టుకి పూజ చేయాలి. నమస్కరించి, కౌగిలించుకుంటే అనేక దోషాలు పోతాయి. బుద్ధగయ లోని బోధివృక్షం క్రీ.పూ.288 నాటిదని అంచనా.
- రామకిష్టయ్య సంగనభట్ల