Saturday, November 23, 2024

స్వస్వరూపానుసంధానమే ”జ్ఞానము”

నేపరమ పురుషుడు పరమాత్మ జగద్గురువైన శ్రీరామకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని దయనీయ పరిస్థితిని గాంచి, యుగయుగాలలో నిలిచి ఉండే జ్ఞాన బోధను గావించి, తన సఖునికి స్వధర్మమును తెలుపుట ఎంతో ఆనందదాయకం. ఆదర్శ ప్రాయము. మార్గని ర్దేశ్యమై అలరారినది. భగవద్గీతలోని ఎనిమిది అధ్యాయాలలో నాల్గవది అయిన జ్ఞాన యోగము ప్రతి జీవికి ఎంతో అవసరం. ఈ జ్ఞానమును ఒక యోగముగా వర్ణించి కర్తవ్య బోధను గీతాచార్యుడు వివరిస్తూ, అసలు జ్ఞానమంటే ఏమిటి? జ్ఞాన సాధన ఫలితం ఏమిటి? అన్న విషయం భక్తిశ్రద్ధలతో వినమని అర్జునునికి తెలిపారు. జీవులందరికీ దు:ఖం దేని వలన కల్గుతుంది? సమాధానంగా గీతాచార్యు డి శరీర పరిగ్రహణము వల్ల అంటూ, ఈ శరీరము కర్మల వలన కలుగుతుంద న్నారు. రాగాదుల వలన కర్మలు కలుగుతాయి. రాగాదులు అజ్ఞానం వలన కలు గుతాయి కనుక, ఈ అజ్ఞానం జ్ఞానంతో పోవునట్లు జీవులు కర్మలు చేయాలన్నాడు. జీవులకు ఆత్యంతిక దు:ఖ రాహిత్యము జ్ఞానము వలననే సిద్ధిఇస్తుంది. తన స్వరూపమును మరచిపోయినందు వలన బంధాలు, తిరిగి తన స్వరూపమును జ్ఞప్తికి తెచ్చుకొన్నం దువలన మోక్షము కలుగుచున్నది. దీనినే పెద్దలు, ఆర్యులు స్వస్వరూపాను సంధానముచే జ్ఞానమన్నారు. మోక్ష రూపమై పరమ శాంతిని కోరువారు ఆ ప్రకార మగు జ్ఞానానుభవమును తప్పకుండా పొందాలి. ఈ విషయమునే పరమాత్మ సత్యం అంటూ జ్ఞాన యోగంలో ఒక శ్లోకంలో
”శ్రద్దావాన్‌ లభతే జ్ఞానం- తత్పరం సంయతేంద్రియ:”
జ్ఞానం లభ్వా పరాం శాంతి మాచిరేణాధి గచ్చతీ”
అంటూ గురు, శాస్త్ర వాక్యములందు శ్రద్ధగలవాడును, ఆధ్యాత్మిక సాధన లందు తదేక నిష్టతో గూడి, ఇంద్రియాలను జయించిన మానవుడు జ్ఞానాన్ని పొంది, పరమ శాంతిని శీఘ్రంగా పొందగలడు. ”జ్ఞానం లబ్ద్వా పరాం శాంతి – మచిరేణాధి గచ్చతీ” అంటూ గురు, శాస్త్ర వాక్యములందు శ్రద్ధ గలవాడును, ఆధ్యాత్మిక సాధనలందు తదేక నిష్టతో వుండి, ఇంద్రియ నిగ్రహము కావలెనని భావం. ఇవిలేని వారు జ్ఞానమును పొందలేరు. జ్ఞాన యోగంలో ఎన్నో ఉపమానాలను భగవానుడు వివరించినాడు. జ్ఞాన తపస్సుచే ఎందరో పునీతులైనారని, ధనాదులతో గూడిన యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనదని, పాప సముద్రాన్ని జ్ఞానమనే నౌకతో తేలికగా దాటవచ్చనీ, జ్ఞానమనే అగ్ని సమస్త కర్మలను, కట్టెలను భస్మీభూతము చేసి వేస్తుందనీ వివరించారు. అజ్ఞాన జనితమైన సంశయము ను జ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి వేయాలన్నారు. జ్ఞానానికి అపార మహి మ కలదనీ, దీనికి ఎంతో అద్భు తశక్తి వుంద నీ పదవ అధ్యాయంలో కూడా వివరించారు. జీవులను హెచ్చరిస్తూ, జ్ఞాన తపస్సు నాచరించి పవిత్రులు అవండి. జ్ఞాన యజ్ఞం నాచరించి ముక్తి కాంతను పొందండి. జ్ఞానమను తెప్పచే పాప సముద్రమును దాటి, జ్ఞానాగ్ని రగిల్చి కర్మ కట్టెలను కాల్చి వేయండి అని చెప్పాడు. జ్ఞాన భాస్కరుని దివ్యతేజముచే అజ్ఞా నాంధకారమును రూపుమాపుడు. జ్ఞాన జ్యోతిని వెలిగించి, అమృతమయమైన కాంతి కిరణములను నలు దెసల వెదజల్లుడని ప్రవచిస్తూ- జనులందరికినీ హితవు చెప్పినాడు గీతాచార్యు డు. ఇంక జ్ఞానాన్ని వివరిస్తూ ప్రకృతి పురుషుల కలయికయే ప్రపంచము. ఈ ప్రపం చంలో ఆత్మ- అనాత్మ క్షేత్రము- క్షేత్రజ్ఞుడు- దృక దృశ్యములు అన్ని ఏకమై యున్నట్లు అజ్ఞానానికి కనపడుతుంది. వానిని విడదీయుటయే జ్ఞానము. వానిని విభజించి, జడమును జడముగను, చైతన్యమును చైతన్యముగను భావించుటయే జ్ఞానము, ఆత్మయందే చిత్తమును నిలిపి అనాత్మయందు విరక్తిని కల్గియుండుటయే జ్ఞానము. ఆత్మానుభూతియే జ్ఞాన ఫలము. అదే మోక్షము. జ్ఞాన విచారణ జీవుని మహోన్నత ఆధ్యాత్మిక శిఖరాలను గొనిపోయి స్వస్వరూపానుభవము ద్వారా జీవుని దేవునిగా జేసి, పరమానందమును, జీవన్ముక్తిని కలుగజేయుచున్నవి. జ్ఞానము కలిగిన పిదప మనుజునిచే ఆచరింపబడు కర్మలు మహా పవిత్రమై, నిర్లేపమై యుండును. జ్ఞాని యగువాడు లోక హితార్థము కర్మ చేసినను, అట్టి అసక్త బుద్ధితోనే నిర్లిప్తమైన మనస్సుతోనే చేయునుగాన అట్టికర్మ పరమపునీతమై అద్భుతమైన మహిమతో గూడి యుండును. జ్ఞానిచేయు కర్మకు, అజ్ఞాని చేయు కర్మకు వ్యత్యాసమిదియే. పరమాత్మ రెండో అధ్యాయంలో జ్ఞానోపదేశం చేసి, కర్మ యందు కుశలత్వమును తెలిపారు. జ్ఞాన ప్రభావము వలన కర్మలు జీవులను బంధించును. కావుననే ”నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహా విధ్యతే” అంటూ జ్ఞానముతో సమానమైన పవిత్ర వస్తువు జగతిలో ఏదీ లేదన్నారు. జ్ఞాన ప్రభావాన్ని ఎలుగెత్తి చాటారు. అమానిత్వాది జ్ఞాన గుణాలను సాధకుడు అభ్యసించి జ్ఞేయ వస్తువైన పర బ్రహ్మమును అనుభూతం చేసుకోవాలన్నారు. జ్ఞాన స్థితి అమోఘము. జన్మ సార్థకత కు ఆలంబన. ఈ స్వస్వరూపానుభవమునే పరమాత్మ ఐదో అధ్యాయం 16వ శ్లోకంలో ఇలా తెలిపారు.
శ్లో|| జ్ఞానే నతుతద జ్ఞానం- యేషాం నాశిత మాత్మన:
తేషా మాదిత్య వజ్ఞానం – ప్రకాశ యతితత్వరమే”
ఆత్మ జ్ఞానముచే ఎవరి అజ్ఞానం నశింపజేయబడినదో, అట్టివారి జ్ఞానము సూర్యుని వలె ఆపర బ్రహ్మ స్వరూపమును ప్రకాశింపజేయబడుటయే స్వస్వరూ పానుభవమును కలుగజేయునది. ఆ దివ్య సందేశం అందించి జ్ఞాన వైశిష్ట్యాన్ని సకల జగతికీ పంచుట మన అదృష్టం, జ్ఞానంతోనే జన్మలు ధన్యము అవుతాయి. ఆత్మ జ్ఞానము ను పొంది ధన్యులవుతారు.

  • పివి సీతారామమూర్తి
    9490386015
Advertisement

తాజా వార్తలు

Advertisement