Wednesday, December 18, 2024

‘స్వస్తి పంథా’

స్వస్తి’ అంటే ‘శుభం’ అని అర్థం. అందరం శుభాలు కోరుకుంటాం. కానీ ఆ శుభం కావాలంటే దానిని సంపాదించే మార్గం కూడా శుభమయం కావాలి. ధర్మమార్గమే శుభం. ఆ శుభానికి ఫలంగానే క్షేమం లభిస్తుంది. శుభమే శుభాన్నిస్తుంది. చిత్రం ఏమిటంటే మనందరికీ ఆనందం కావాలి. కానీ తత్సాధనమైన ‘సత్కర్మ’ చేయాలని ప్రయత్నించం. మనకి ‘దు:ఖం’ అక్కర్లేదు. కానీ దు:ఖానికి కారణమైన
దుష్కర్మని మాత్రం వదలం. మనమనుకున్నది మనకు రాదు. మనం చేసేదాని ఫలితమే మనం పొందుతాం.
‘స్వస్తి మార్గంస అంటే మనం చేసేపని దానికి అవసరమైన పరికరాలు, వనరులు, ఆలోచనలు అన్నీ ‘స్వస్తి’మయం కావాలి. అప్పుడే అది సరియైన శుభంకరమైన మార్గం అవుతుంది. లక్ష్యమొక్కటే కాదు, మార్గం కూడా మంగళకరం కావాలి అని వేదం ప్రబోధిస్తోంది. మన వాంఛితాలు, సంకల్పాలు మంగళకరంగా ఉండాలన్నదే మానసిక విజ్ఞానసారం. మంచి ఆలోచనల వల్ల, మంచి స్పందనలు, తద్వారా మంచి ప్రేరణలు, మంచి ఆచరణలు కలుగుతాయి. ఇదో చక్రనేమి క్రమం.
కాబట్టి వేదం శుభాన్ని సంకల్పించుకోవడం, శుభాన్ని ఆశిస్తూ దైవీశక్తులను ఉపాసించడం వంటి శుభాకాంక్షలెన్నింటినో పలికింది. జీవిత పరమలక్ష్యం ‘పరమ శుభం’… దానినే ‘శివం’ అంటారు. అదే పరమ ‘స్వస్తి’. దానినే భగవన్నామంగా పేర్కొన్నారు (విష్ణుసహస్రనామం). ఆ అఖండమైన ‘స్వస్తి’ని సాధించడానికి, అవసరమైన జీవన విధానమే ‘స్వస్తిపంథా’. ఏ లక్ష్యానికి ఏ బాట వేసి ఉందో, దానిని ఆశ్రయించినప్పుడే ఆ లక్ష్యాన్ని చేరుకోగలం. కాబట్టి ఆ ‘పరమస్వస్తి’కి వేసిన 1. జ్ఞానమార్గం, 2. భక్తిమార్గం,3. కర్మమార్గం, 4. యోగమార్గం… ఇవే స్వస్తి పంథాలు. వీటిని వదలరాదు. ఈ నాలుగూ వేటికవే విభిన్నమూ కావు, విరోధమూ కావు. పరస్పర పరిపూరకాలు. వేద విహత కర్మాచరణను జ్ఞాన, భక్తి యోగనిష్ఠలతో ఆచరించడమే స్వస్తి పథం.
‘దారితప్పకపోవడ’మంటే ఇదే. ‘స్వస్తి’తో అనుసంధానించిన పథంలో మనం మాత్రమే ప్రయాణించడం సరిపోదు. మన ఆచరణతో మరి కొంతమందికి స్ఫూర్తి కలిగించి, కలిసి ప్రయాణించి ఆ పరమలక్ష్యాన్ని అందుకోవాలి. ఈ ‘కలసి’ అనే స్ఫూర్తి వైదికసంస్కృతిలో స్ఫుటంగా లభిస్తుంది.
గొప్ప విషయాన్ని పదిమందితో పంచుకోవడం మన గొప్పతనాన్ని చాటుకోవడానికి కాదు. దానితో అనేకమందిని అనుసంధానింప జేయడమనేది ఒక లోక‌హితం. తనతో పాటూ తన చుట్టూ ఉన్నవారికి కూడా స్వస్తి కలగాని కోరుకోవడం ముఖ్యం. మనకి శుభం మరొకరికి ‘అశుభం’ వల్ల రాకూడదు. ఒకరి దు:ఖం వల్ల మనం ఆనందించకూడదు. అలా ఆనందించడం క్రమంగా దు:ఖంగానే పరిణమిస్తుంది. స్వస్తినీ, శాంతినీ ఆశించిన భారతీయసంస్కృతే ‘స్వస్తి పంథా’. ఆ పథానికి సదా స్వస్తియగు గాక!

  • దండంరాజు రాంచందర్‌ రావు
Advertisement

తాజా వార్తలు

Advertisement