పూర్వం పురాణకాలంలో, నముచి అనే ఒక రాక్షస రాజు ఉండేవాడు. బలపరాక్ర మాలలో మంచి పేరున్నవాడు. విధివశాన తన సంపదనంతా పోగొట్టుకుని, అలల అలజడి అణిగిపోయిన సముద్రంలా స్తబ్దుగా కూర్చుని ఉన్నాడు ఒక రోజు. అది చూసాడు ఇంద్రుడు. జాలిని ప్రదర్శిద్దామన్న కోరిక పుట్టింది. నముచికి దగ్గరగా వెళ్ళి ”చాలా బాధపడుతున్నట్టున్నావే! సంపద అంతా పోయింది, దానితో బంధువులు కూడా ముఖం చాటేసి ఉంటారు. దు:ఖం వేస్తోందా?” అని అడుగుతాడు.
సీ|| సిరిఁబాసియును నొక్క చింతయు లేక వీ
చుల క్రందడంగిన జలధివోలె
నముచి యేకాంత స్థలమున నుండఁగ నింద్రుఁ
డచటికి నేతెంచి యతనిఁజూచి
‘పేదవడ్డాఁడవు ప్రియ జనంబును బరి
వారంబు లే దియ్యవస్థకెంత
వగచెదవో దానవ శ్రేష్ఠ!’ నావుడు
నాతండు ‘వగపు నిరర్థకంబు
తే|| వలయు వస్తువు వగచిన వచ్చునయ్య?
రామి యొక్కటియే శరీరంబు నెదయుఁ
దాపమునఁ బొందు వగపున ధర్మ మేదు;
నింతయెఱుఁగుదు వగవ నే నేమిటికిని.
(ఆంధ్ర మహాభారతము, శాంతిపర్వం, చతుర్థాశ్వాసం- 412)
ఇంద్రుడి ఆ మాటలలోని హళనను అర్ధం చేసుకోలేనివాడు కాదు నముచి. అనవ సరంగా ఆవేశపడకుండా, మాటలతోనే ఇంద్రుడికి సరిపోయే సమాధానం చెబుతూనే, ఒక పట్టు పట్టాలనుకుంటాడు. ‘బలేవాడివే! ఏడవడం దేనికి? ఏడ్చినందు వలన పోయి నది తిరిగి వస్తుందా? లేక, కొత్తగా కావాలనుకున్నది వస్తుందా? ఏదీ రాదు. రాకపోగా, శరీరానికీ మనస్సుకూ మరి కాస్త బాధ కలుగుతుందే తప్ప వేరే ప్రయోజనమేదీ కలుగదు. ఈమాత్రం తెలిసినవాడిని కనుకనే, నీవు మనసులో బహుశా అపోహ పడుతున్నట్లుగా, నేను దేనికీ ఏడుస్తూ కూర్చోను’ అంటాడు. అయినా ఇంకా తృప్తి తీరదు. సమాధానంగా అంతమాత్రమే చెప్పి ఇంద్రుడిని వదిలిపెట్టాలని అనిపించదు నముచికి. సుఖదు:ఖాలు, కష్టనష్టాలు వంటివి ఒక మనిషి జీవితంలో రావడం పోవడం అనే ద్వంద్వాలకు సంబం ధించిన ధర్మసూక్ష్మాల గురించి తనకు తెలిసినది ఇంద్రునికి మరికొంత చెప్పాలని అతని కి మనసు తహతహలాడుతుంది. ఈ క్రింది విధంగా చెబుతాడు:
తే||గీ|| సకల భూతంబులకును శాసకుఁడు గలఁడు
గాదె! యొక్కరుఁడాతని కల్పనమునఁ
బ్రాప్తమైనది నీళులు పల్లమునకు
వచ్చు క్రియఁ దాన వచ్చు గీర్వాణముఖ్య!
(ఆంధ్ర మహాభారతము, శాంతిపర్వం, చతుర్ధాశ్వాసం, 413)
‘సృష్టిలోని ప్రాణి సముదాయమంతటికీ ఒకడు శాసించేవాడుగా ఉండడం తెలిసి నదే కదా! ఏ కాలానికి ఎవడికి ఏది ప్రాప్తమో, అది ఆ కాలానికి, పల్లానికి ప్రవహంచే నీటి చందాన, ప్రాప్తించి తీరుతుంది.
కం|| ఇది నా కయ్యెం గాఁగల
యది యై; యను గాఢ నిశ్చయం బెవ్వని నె
మ్మఁ గలుగు, నుబ్బువగ సం
పద యాపద గలుగ వట్టి భవ్యున కింద్రా!
(ఆంధ్రమహాభారతము, శాంతిపర్వం, చతుర్ధాశ్వాసం, 414)
సుఖమైనా దు:ఖమైనా, ఇది నాకు జరగాల్సి వుండే జరిగింది అని ఎల్లప్పుడూ అను కుని గట్టిగా సమాధానపడే వ్యక్తిని, అలా అవడానికి సంబంధించిన ఏవిధమైన సందే హాలు, ఆనందం దు:ఖం, సంపద ఆపద వంటి ద్వంద్వాలు బాధించవు.
కం|| ధైర్యంబున వీర్యంబున
శౌర్యంబునఁ బ్రజ్ఞఁ బడయఁ జాలునెనరుఁ డె
క్కార్యము నప్రాప్యమయిన?
నార్యుండది యెఱుఁగుఁ గాన యడలఁడు శక్రా!
(ఆంధ్రమహాభారతము, శాంతిపర్వం, చతుర్ధాశ్వాసం, 415)
మనోధైర్యంతో కాని, బలపరాక్రమంతో కాని, శౌర్యంతో కాని, బుద్ధి బలంతో కాని, ఒకనికి లంభించేది కాదని నిశ్చయమై వున్న దానిని ఏ వ్యక్తి అయినా పొందగలడా? పొందలేడు. తెలివైన వాడు అది గ్రహస్తాడు కాబట్టి, ఓ ఇంద్రా, కంగారుపడిపోడు’ అని సవివరంగా చెబుతాడు నముచి. అంతా విన్న ఇంద్రుడు, ఈ విషయంలో ఇత గాడికి ఇక ఎవరైనా చెప్పగలిగినదేమీ లేదని గ్రహంచి, నముచిని మెచ్చుకుని, తన దారి న తాను అమరావతికి వెళ్ళిపోతాడు. విధివశాన వచ్చిన ఆపదలకు కలత చెందకుండ డమే ధీరుని లక్షణం అని చెప్పడం ఇందులో ముఖ్యోద్దేశం. అవకాశం దొరికినచోటల్లా మహాభారతం ఈ సంగతిని చెప్పింది. పాముకాటుకు కొడుకును పోగొట్టుకున్న గౌతమి అనే స్త్రీ ఉదంతంలో కూడా ఆమెచేత ఈ మాటనే చెప్పించింది మహాభారతం.
కం|| విధివశమున వచ్చిన కీ
డధములు గొనియాడి వెడఁగులై, విపులభవాం
బుధి మునుఁగుదురు; మునుంగరు
సధర్ములగు నుత్తములు, ప్రశాంతి జులుకనై.
(ఆంధ్రమహాభారతము,అనుశాసనికపర్వం,ప్రథమాశ్వాసం, 9)
”దైవసంకల్పితంగా వచ్చే బాధలకు ధర్మ లక్షణం తెలిసి వర్తించే మనుషులు బాధ పడరు. ప్రశాంతతను పోగొట్టుకోరు. తెలియని వారే దు:ఖితులై భవాంబుధి అనే సంసారిక బంధనాల్లో మరింతగా చిక్కుకుని సతమతమౌతారు” అని పై పద్యం భావం.