మోక్ష కాంక్ష కలిగిన నేను పరమాత్మను శరణు వేడుతున్నాను (శ్వేతాశ్వతర ఉపనిషత్తు) ‘శరణాగతి’ అనే ధర్మం వేదమతంలోనే ఉన్నదని ఈ వాక్యం స్పష్టం చేస్తోంది.
మానవ మేధస్సుకి, శరీర సామర్థ్యానికి ఉన్న పరిమితులు అనేకం. వీటిని మించి ఉండే విశ్వ చైతన్య శక్తిని శరణు వేడడం వల్లనే అతడు తరించగలడు. ‘మోక్షం’ అనేది సర్వబంధన మోచకమైన, పరమమైన కైవల్యం. అది కలగడానికి అనేక మార్గాలు చెప్పారు. కర్మ, భక్తి, జ్ఞాన, యోగ మార్గాలు ప్రసిద్ధాలు. ఇందులో ఒక్క ‘భక్తి’లోనే శరణాగతి ఉంటుందని చాలామంది అభిప్రాయం. కాని, ఏ మార్గంలోనైనా శరణాగతి అవసరం. ఎందుకంటే ఏ చైతన్యాన్ని ఏ చైతన్యంతో మనం సాధించాలనుకుంటున్నామో, ఆ చైతన్యం భగవచ్చైతన్యమే. అందుకే జ్ఞానప్రధానమైన ఉపనిషత్తులో ఈ శరణాగతి వాక్యం ప్రస్తావించబడింది.
”ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైతవాసనా”… ఆ అనుగ్రహ సాధనకై ఆయనను శరణు వేడాలి. శరణాగతి అంటే, విధ్యుక్తమైన కర్మను ఫలాపేక్షరహితంగా ఆచరిస్తూ, ఈశ్వరార్పణం చేయడం అని చెప్పవచ్చు. ఎంత ధార్మికుడైనా తాను పరిపూర్ణంగా ధర్మాచరణ చేస్తున్నానని చెప్పలేడు. చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నమే తప్ప మరేదీ పరిపూర్ణం కాదు. అలాగే, యోగంలో కూడా పరిపూర్ణత విషయం సంశయమే. వాటిలో పరిపూర్ణత సిద్ధించాలన్నా కనిపించిన కారణాలతో పాటుగా, కనిపించని అనేక కారణాలుంటాయి. వాటన్నిటినుండీ ఉద్ధరించి, ఆ మార్గంలో పరిపూర్ణత సాధింపజేసేందుకు భగవత్ కృప ఒక్కటే సాధనం. ప్రేమ పూర్వకమైన శరణాగతి భక్తిలో ఉన్నది కనుక, ఆ మార్గాన్ని సర్వశ్రేష్ఠ మార్గం… ‘మోక్షసాధన సామగ్య్రాం భక్తిరేవ గరీయసీ’ అన్నారు.
ఇక లౌకికంగా చూస్తే, మోక్షం(విడుదల) ఇక్కడా ఉంది. ఒక దు:ఖం నుండి విడుదల, ఒక సమస్య నుండి విడుదల… ఇవి మనకు కావాలి. ఇవి తాత్కాలికమే అయినా లోకమార్గం నడిచేందుకు అవసరం. వాటి నుండి విడుదల కావాలన్నా భగవత్ శక్తి మనల్ని అనుగ్రహించాల్సిందే. అందుకే మనకు ఇహపరాలకు భగవత్ కృపే ఆధారమన్నారు. మన బుద్ధితో, మన శరీరశక్తితో మన దు:ఖాల నుండి విడుదల పొందాలి. ఆ సాధనకు ఉపకరణాలే ఇంద్రియాలు. అయితే బుద్ధికి సరియైన స్ఫురణ, ప్రేరణ, ఆలోచన, శరీరానికి సామర్థ్యం ఎక్కడినుండి వస్తాయి?
‘ధియో యో న: ప్రచోదయాత్’ అని పరమ చైతన్యమైన పరమేశ్వర కృపయే మన బుద్ధుల్ని ప్రేరేపిస్తుంది. కనుక శరణువేడి, ప్రయత్నం సాగిస్తే ఆ ప్రయత్నం సఫలీకృతమవుతుంది. ఫలించాలంటే ఎన్నో అనుకూలించాలి.
ఎన్ని అనేది మనమే నిర్ణయించలేం. సూక్ష్మాంశాలు ఎన్నో ఒక్క ప్రయత్న సాఫల్యానికి హేతువౌతాయి. వాటన్నింటినీ సమీకరించి, సాఫల్యం దిశగా పరిణమింపజేసేది భగవత్ శక్తి మాత్రమే. ఆ చైతన్యాన్ని త్రికరణశుద్ధిగా గుర్తించడమే ‘శరణాగతి’.
అందుకే గీతాచార్యుడు శ్రీకృష్ణపరమాత్మ…
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ:
”అన్ని ధర్మాల ఫలితాలనీ నాకు అర్పించి, నన్ను శరణువేడితే అన్ని పాపాల నుండి విముక్తుని చేసి, మోక్షాన్నిస్తాను… దు:ఖింపకు” అని అభయవాక్యాన్ని ప్రసాదించాడు. ”పంతాన వేంకటేశ పట్టి నిన్ను శరణంటి” అని అన్నమయ్య వంటి మహాభక్తులు ఈ శరణాగతినే ప్రబోధించారు. ఈశ్వరుని అనుగ్ర#హం చేతనే మానవునికి జ్ఞానం కలుగుతుందని ఆదిశంకరుల వాక్యం.
- దండంరాజు రాంచందర్ రావు