Saturday, November 23, 2024

సుపుత్రులు కులాభరణులు

పున్నామో నరకత్రయా ఇతిపుత్ర:” అని లోకోక్తి. అనగా పుత్రులు కన్న తల్లిదండ్రులను నరకం నుండి తప్పిస్తారు.
అపుత్రస్యగతిర్నాస్తి” అని సూక్తి. పుత్రులు లేని వారలకు సద్గతులు గల్గవు.
ఆంధ్ర మహాభారతంలో ఆదిపర్వంలో ఆది కవి నన్నయ్యగారు పుత్రులను గురించి చెబుతూ ” నిత్యమై న ధనము- నిర్మల కీర్తియ” అన్నారు.
నిర్మల కీర్తిని సంపాదించిన కుమారుల వల్ల కన్న వారికి తేజస్సు కలుగుతుంది. తనయులు ఉత్తముల యితే తల్లిదండ్రులకూ, వారి వంశానికి, సమాజానికి దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. ఆ కుమారులే చెడ్డవారు అయితే కన్నవారికి ఎంతో అప్రతి ష్ట. గుణవంతుడైన పుత్రుడే ఎంతో ప్రసన్నుని చేస్తాడు.
శ్రీనాథ మహాకవి పల్నాటి వీరచరిత్రలో ఇలా తెలి పాడు. తండ్రి కష్టంబు దప్పింపలేని- పుత్రుడుండిన నేమిపోయిన నేమి” అని అన్నాడు.
కాశీ ఖండకావ్యంలో జననీ జనకులగొల్చుట కంటెను
తనయున కత్యధికమైన ధర్మముగలదే” యన్నాడు.
అలాగే సుమతి శతకారుడు తన శతక పద్యాలలో
కం|| ”పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబునాడు- పొందురు సుమతీ” అంటూ పుత్రులను పొగడాలి అంటే ఆ పుత్రుడు గుణవంతుడై ఉండాలి. ఉత్తముడై సమర్థుడై ఉండాలి. అప్పుడే కన్న వారికీ వంశానికి కీర్తి అన్నాడు. ప్రాచీన కవి పాల్కురికి సోమనాథుడు బసవ పురా ణంలో ఇలా అన్నాడు.
”కులదీపకుడు బుట్ట- కులము వర్దిల్లు
కులనాశకుడు బుట్ట కులమెల్ల డ్రంగు” అన్నాడు.
యోగి వేమన తమ నీతి శతకంలో తనయుడు అనుపమ సద్గుణ సమృద్ధిచే, మాతాపితలకు ఆనంద కరుడు కావాలి. అపుడే ఆ తనయునికి జన్మ సాఫల్యం కలుగుతుంది. వేమన ఒక పద్యంలో-
”తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టలేనివాడు గిట్టనేమి?
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా” అంటూ
”నందనుడు పెరిగి పెద్దల
కందరికి విధేయుడైన నానందమగున్‌
బొందిక చెడి సత్పురుషుల
నిందను బడజింతగలుగు విక్కము వేమా” అని వచించారు.మార్కండేయ పురాణంలో మారన-
”పుత్రుడు పుట్టమి మేలుకు
పుత్రుడు జన్మించుటకంటే బురుషనకు దు
ష్పుత్రుడు దహించు నిజ చా
రిత్రాగ్నిని దండ్రిమనము రేయును బగలున్‌” అన్నాడు. శ్రీనాథుడుకు పుత్రత్వంబుకంటె నపుత్రత్వం బు మేలు అన్నాడు.
తెనాలి రామకృష్ణ ఇలా తెలిపాడు.
్వ్వశ్రీ లాలిత్యము- నిత్య శుద్ధియు- గుణోత్సేకంబును న్గల్గియు ర్వేల స్పూర్తితో ప్రకాశించే తండ్రి అనే సముద్రంలో చంద్రునిలాగా జన్మించాలి కుమారుడు. అలాకాకుండా పాపాత్ముడై పుడి తేసాల గ్రామఖనిలో జాత్సల్ప పాషాణము పుట్టినట్లుంటుంద”ని వర్ణించాడు.
కొడుకులు కీర్తిమంతులైతే తల్లిదండ్రులకు స్వర్గం- అపకీర్తి పరులైతే నరకం. కీర్తిమంతులైతే తల్లిదండ్రులకు ఒక వెలుగు అనగా కీర్తి లభిస్తుంది. మూఢుల వలన మాతాపితరులకు అలాంటి వెలుగు లభించదు. జీవిత మంతా చీకటిననుభవించవలసినదే.
కీర్తిని సంపాదించి కన్నవారికీ, వంశానికీ మంచి పేరు తేవాలి కుమారులు. ఉత్తమ గుణ సంజాతులు కావాలి. కొడుకులు కీర్తిమంతులైతే తల్లిదండ్రులకు స్వర్గం- అపకీర్తిపరులైతేనరకం. కీర్తిమంతులైన పుత్రుల వలన మాతాపితరులకు అలాంటి వెలుగు లభించదు. జీవితమంతా చీకటిననుభవించవలసినదే. గురువుల- పెద్దల పట్ల వినయవిధేయతలు ప్రదర్శించి, ఆదర్శపుత్రు లు కావాలి. శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో దూర్జటి కవి ప్రసిద్ధుడు. శివభక్తుడు. శివారాధకుడు. ఆయన తన కాళహస్తీశ్వర శతకంలో కుమారుల ప్రస్తావన గావిస్తూ ఒక చక్కని పద్యం రచించారు.
”కొడుకుల్‌ పుట్టరటంచునేడ్తు రవి వేకుల్‌- జీవన భ్రాంతులై / కొడుకుల్‌ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్‌ వారిచే యేగతుల్‌ / బడసెన్‌, పుత్రులు లేని యాశుకునకున్‌ వాటిల్లెనో దుర్గతుల్‌ / చెడునే మోక్షపదంబపుత్రునకున్‌ శ్రీ కాళహస్తీశ్వరా” అంటూ చెడ్డ కుమారుల వలన మహా భారతంలో అన్నదమ్ముల మధ్య కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. వంశమే నాశనమైపోయింది. ధృతరాష్ట్రుడు, గాంధారీదేవి దుర్యోధనుని వలన జీవితాంతం దు:ఖం లో మునిగిపోవల్సి వచ్చింది.
భారతీయ సాహిత్యంలో ప్రాచీన- ఆధునిక కవులు కూడా కుమారుల విషయాలను తమ రచనలో ప్రస్తా వించి లోకానికి కనువిప్పు కల్గించారు. ఆధునిక కవులైన మధునాపంతులు, విశ్వనాథ, కరుణ శ్రీ, కవి కోకిల గుర్రం జాషువాగారలు తమ పద్య రచనల ద్వారా లోకా నికి సందేశాన్ని అందించారు.
– పివి సీతారామమూర్తి
9490386015

Advertisement

తాజా వార్తలు

Advertisement