Friday, November 22, 2024

శివ తేజంతో ఆవిర్భవించినవాడే సుబ్రహ్మణ్యేశ్వరుడు…

సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణజన్ముడు. కుమార స్వామి, కార్తికే యుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్‌, గుహూడు అనే పేర్లతో పిలుచుకునే సుబ్రహ్మణ్యేశ్వరుడు మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు. తారకాసురు సంహారం కోసం ఆవిర్భవిం చినవాడు. తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు. బలశాలి. వర మదాంధుడు. అతడు శివుని అఘోర తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో తనకు చావులేని విధంగా శివుని నుంచి వరం పొం దాడు. దాంతో వర మదంతో తాను అజేయుడునని, అమరుడునని ముల్లోకాలను గజగజలాడించాడు. అతని అకృత్యాలకు తల్లడిల్లిపో యిన దేవతలు బ్రహ్మ దేవుని దగ్గరకు వెళ్లి తారకాసురుడి అరాచకా లను మొరపెట్టుకున్నారు. విషయాన్ని తన దివ్య దృష్టితో వీక్షించిన బ్రహ్మ దేవుడు తారకాసురుడి మరణం ఈశ్వర తేజాంశ సంభవుని వల్లే అవుతుందని, కనుక ముందు సతివియోగ దు:ఖంతో ఉన్న ఈశ్వ రుడికి, గిరిరాజు హమవంతుని పుత్రికగా అవతరించిన పార్వతీదేవికి వివాహం జరిపించమని, వారికి కలిగే పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడవుతాడని చెబుతాడు.
బ్రహ్మ దేవుడి సూచన మేరకు తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న పార్వతికి, శివునకు మధ్య అన్యోన్య త చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు దేవ తలు మన్మధుని ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో శివ పార్వతుల మధ్య అన్యోన్య వాతావరణాన్ని సృష్టిం చడానికి మన్మధుడు పూల బాణాలతో ఈశ్వరుని చలింప చేసి, పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి కారణమవుతాడు. తాను ఈశ్వర ఆగ్రహానికి గురై భస్మం అవుతాడు. అయితే ఆదిదంపతుల వివాహం అయిన తరువాత దేవతల అభ్యర్ధనతో శివుడు తిరిగి మన్మధు నికి పునర్జీవితం కల్గిస్తాడు.
ఇలా ఉండగా పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానంద సమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మంది రంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజ స్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్యతేజాన్ని అగ్నిదేవుడు గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజం అదే సమయంలో నదిలో స్నానమాచరిస్తున్న షట్‌ కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. అయితే, ఆ రుద్రతేజాన్ని వారు భరించలేక రెల్లు పొదలో విసర్జిస్తారు. అంతట ఆ తేజం ఆరు తేజస్సులతో ఆరు ముఖా లతో ఒక దివ్యమైన బాలుడిగా ఆవిర్భవిస్తాడు. ఈ విషయం తెలుసు కున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందువల్ల గాంగేయుడని, షట్‌కృత్తికలు అతనిని పెంచి పెద్దచేసిన కారణంవల్ల, ఆరు ముఖాలు కలిగినవాడు అవ్వడం వల్ల షణ్ముఖుడని, కార్తికేయు డని గౌరీశంకరుల పుత్రుడవడం వల్ల కుమారస్వామి అని, సుబ్ర హ్మణ్య‌స్వామి అనే పేర్లతో విరాజిల్లాడు. దేవతల కోరిక మేరకు పార్వ తి పర మేశ్వరులు దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమిస్తారు. అనం తరం పరమేశ్వరుడు ”శూలం” తదితర ఆయుధాలను అనుగ్రహించగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి ‘శక్తి’ అనే ఆయుధా న్నిస్తుంది. ఆ తర్వాత తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.
కార్యోణ్ముఖుడైన సుబ్రహ్మణ్యస్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి, ఆరు చేతుల తో ధనస్సులను, మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేన ను ఒకేసారి సంహరించాలని తలచి, ”సర్పరూపం” దాల్చి రాక్షసుల ను ఉక్కిరిబిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరిస్తా డు. తారకాసురుడు అంతమొందడంతో దేవేంద్రుడు ఆనందంతో తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ షష్ఠినాడు ”శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి” వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపిస్తాడు. ఈ రోజును ”శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి”గా పరిగణిస్తారు. అలాగే, తారకాసుర సంహారం జరిగిన రోజు కనుక స్కందషష్టి అని కూడా అంటారు.
ఒక చేతిలో మహాశక్తి అయుధాన్ని, ఇంకో చేతిలో వజ్రాయుధా న్ని, ఇంకొక చేతిని కటిపై ఉంచి, మరొక హస్తంతో అభయ ప్రదానం చేస్తున్న సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే ఎలాంటి కష్టాలయినా పోతా యని భక్తుల విశ్వాసం. ఆ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయి. అవివాహితులకు వివాహం అయ్యి, సత్‌ సంతాన సౌభాగ్యం కలిగి ఆయు రారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢ నమ్మకం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి పూజచేసినా, కావడి సమర్పించినా సత్సం తాన ప్రాప్తి, రాబోయే తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మ కం. ఈ రోజు పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయి. స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకలశుభాలు కలుగుతాయని ప్రతీతి. అలాగే స్కంద షష్టి నాడు శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం వీక్షించే భక్తుల ఆటంకాలు సైతం తొలగి వివాహాలు జరిగి, సత్సం తానం కలుగుతుందని విశ్వాసం. పర్వదినం నాడు ఉదయాన్నే స్నా నం చేసి, ఏ ఆహారమూ తీసు కోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వు లు, పండ్లు, నాగ పడగల రూపాలను స్వామికి సమర్పిస్తారు. ఇదం తా నాగపూజకు సంబంధించినదే.
తమిళనాడులో సుబ్రహ్మణ్య షష్టి రోజున కావడి మొక్కు తీర్చు కుంటారు. కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతో నూ, పాలతోనూ నింపుతారు. అయితే ఆయా వ్యక్తుల మొక్కుల నను సరించి కుండలను ఆ పదార్ధాలతో నింపుతారు.
కొన్ని ప్రాంతాలలో బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించే పద్ధతి ఉంది. ఈ రోజున బ్రహ్మచారికి (ముగ్గురు లేదా ఐదు గురు) పూజ చేసి వస్త్రాలు సమర్పించి భోజనం పెడతారు. కొన్ని ప్రాం తాల్లో, షష్ఠి నాడు ఉపవాసముండి మరుసటి రోజు సప్తమినాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెడతారు. అలాగే, ఈ పర్వదినం నాడు ఉపవాసం ఉండి సర్ప మంత్రాన్ని దీక్షగా పఠిస్తే సర్వశుభాలు జరుగుతాయని నమ్ముతారు. ఆరోజున నాగ ప్రతిష్ట చేసినవారికి సంతానం కలుగుతుందనే నమ్మకం కూడా భక్తులలో ఉంది. మార్గశిర శుద్ధ షష్ఠి రోజునే చంపా షష్ఠి, ప్రవార షష్ఠిలాంటి వ్రతాలను కూడా చెయ్యా లని వ్రత గ్రంథాలు చెబు తున్నాయి.

  • -దాసరి దుర్గా ప్రసాద్‌
    7794096169
Advertisement

తాజా వార్తలు

Advertisement