Thursday, September 19, 2024

చదువులకే చదువు శివుడు!

పరమ నిష్ఠాగరిష్ఠులైనట్టియు, మహా తపోధనులైనట్టియు మ#హర్షుల కు ఆవాసమైన నైమిశారణ్య ప్రదేశం పరమ పవిత్రమైనది. ఆ ప్రదేశంలో శౌనకాది మహామునులు సాగిస్తున్న సుదీర్ఘ యజ్ఞంలో భాగంగా, వాయుదేవుడు వచ్చి పరమశివుడి గురిం చిన కథలను చెబుతున్నాడు. వింటున్న ముని గణానికి వీరభద్రుడి విజయగాథను కథగా వినాలనే కోరిక కలిగి అభ్యర్ధించగా, అలాగే అని చెప్పడం మొదలుపెట్టాడు అనిలుడు.
తొల్లి యుగాదులందు- అనగా సృష్ట్యాదికి సంబంధించిన కాలం గడుస్తున్న రోజులలో, చంద్ర విభూషణుడైన ఉమా మ##హశ్వరుడు సతీసమేతంగా రజతాచలంపై కొలువుతీరి ఉండగా… #హరుడికి తమ కార్యకలాపాలన్నిటినీ విన్నవించుకోవాలన్న కోరికతో ఒకనాడు సకల దేవతలు, ముని గణాలు, గంధర్వాధిపులతోసహా కైలాసానికి ప్రయాణం కట్టారు. నాలుగు వేదములు కూడా అలా ప్రయాణం కట్టిన వారిలో భాగంగా ఉన్నాయి. ఆ సంగతిని ఈ క్రింది కంద పద్యంలో అక్షర రమ్యంగా చెప్పాడు పోతన.
కం. చదువులు పెక్కులుగల వా
చదువులకును మొదలు నాల్గు చదువులు గలవా
చదువులకు మొదలుగలిగిన
చదువులు గల శంభుఁగొలువఁ జదువులు వచ్చెన్‌.
(వీరభద్ర విజయం, ప్రథమాశ్వాసం, 55)
‘చదువులు’ అనగా లోకంలో ‘నేర్వదగిన విద్యలు’ ఎన్నో ఉన్నాయి. ఆ ‘చదువులు’ అనగా ‘లోకం లో మనిషి నేర్వవలసిన విద్యలన్నిటికీ’ ఆధారమైనట్టివనదగిన మొదటి ‘నాల్గు చదువులు’, అనగా ‘నాలుగు వేదములు’ ఉన్నాయి. అయితే ఆ నాలుగు వేదములకు కూడా మూలమైనటువంటివి అని చెప్పవలసిన చదువులను, అనగా పరమమైనది అయిన ఆదిమ జ్ఞానాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని ఉన్న ఆ శంభుని కొలవడానికి, భక్తితో పూజించడానికి, అందరితో కలిసి ‘నాలుగు వేదములు’ కూడా వచ్చాయి అని భావం.

Advertisement

తాజా వార్తలు

Advertisement