Saturday, November 23, 2024

అంగ‌రంగ వైభ‌వంగా రామానుజుల‌ స‌హ‌స్రాబ్ది

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:భగవద్రామానుజుల సహస్రాబ్ది సమారోహ కార్యక్ర మం బుధవారంనాడు శాస్త్రోక్తంగా, అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో సరికొత్త ఆధ్యాత్మిక శోభ కనువిందు చేస్తుండగా.. వేద మంత్రోచ్ఛారణలు… జీయర్ల అనుగ్రహ భాషణాలు.. కళాకారుల కోలాటాలు.. నడుమ వేడుకలు ప్రారంభమయ్యాయి. సహస్రాబ్ది వేడుకల్లో తొలిరోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటల సమయంలో దివ్యసాకేతం నుంచి అశ్వవాహనంపై సీతారామచంద్ర స్వామివార్ల శోభాయాత్ర ప్రారంభమయింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో ఆరంభమైన ఈ యాత్రలో అహోబిల రామానుజ జీయర్‌ స్వామి, దేవనాథ రామానుజ జీయర్‌ స్వామి, రామచంద్ర రామానుజ జీయర్‌ స్వామి, అష్టాక్షరీ రామానుజ జీయర్‌ స్వామి, వ్రతధర రామానుజ జీయర్‌ స్వాములు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా అంకురార్పణ
సాయంత్రంవేళ యాగశాల లో వేదపారాయణ మధ్య స#హస్రాబ్ది వేడుకలకు అంకు రార్పణ చేశారు. ప్రధాన యాగశాలలో రుత్విక్వ రణం, యజమా నులకు కంకణధారణ జరిగింది. అనంతరం దీక్షలు స్వీకరిం చి యాగదీక్ష స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చిన్న జీయర్‌ స్వామివారి శిష్యబృందం ఆధ్వర్యంలో జీవా ప్రాంగణం నుంచి పవిత్ర యాగశాల వరకు సాంస్కృతిక శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది.
రామానుజుల పోస్టల్‌ స్టాంప్‌ విడుదల
ఈ కార్యక్రమంలోనే భగవద్రామానుజుల పోస్టల్‌ కవర్‌, పోస్టల్‌ స్టాంప్‌ను తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ పోస్ట ల్‌ సర్వీసెస్‌ వి.వి.సత్య నారా యణ రెడ్డి సమక్షంలో చిన్న జీయర్‌ స్వామి, జూపల్లి రామేశ్వరరావు ఆవిష్కరించారు.
మోడీ పర్యటనకు భద్రత కట్టుదిట్టం
ఈనెల 5న ప్రధాని నరేంద్ర మోడీ, 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సమతాస్ఫూర్తి కేంద్రానికి రానున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్నంతా కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రత్యేక హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం లేదా హెలికాప్టర్‌ వచ్చే అవకాశాలు ఉండటంతో రెండు మార్గాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందుకు గొల్లపల్లి వద్ద విమానాశ్రయం వెనుకభాగంలో ఉన్న గోడను అధికారులు తొలగించి కొత్త రోడ్లను వేశారు. భద్రత, భక్తుల సేవా కార్యక్రమాలపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించిన చినజీయర్‌ స్వామి సమన్వయంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే భక్తుల కోసం ప్రాంగణంలో వైద్య ఆరోగ్య శాఖ మెడికల్‌ క్యాంప్‌ను కూడా ఏర్పాటు చేసింది.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్‌ శివారులోని ముచ్చింతల్‌ క్షేత్రంలో జరుగుతున్న రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ తొలి రోజు కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మంత్రి సాయంత్రం ముచ్చింతల్‌ క్షేత్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ, యశోదా ఆసుపత్రిలో ఆధ్వర్యంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను పరిశీలించి, వైద్యులకు పారా మెడికల్‌ సిబ్బందికి తగు సూచనలు చేశారు.
12వేల మంది వాలంటీర్లు…
ఈ వేడుకల్లో సేవలు అందించేందుకు వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 12వేల మంది వాలంటీర్లు వివిధ దశల్లో భక్తులకు సేవలు అందిస్తున్నారు. అమెరికాతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలం గాణలోని 20 జిల్లాలు సహ మరో 18 రాష్ట్రాల నుంచి సేవకులు వచ్చారు. యాగశాల, సమతామూర్తి విగ్రహం, ఆహార శాలలు, మరుగుదొడ్లు లాంటి వేర్వేరు చోట్ల వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు.

కనులవిందుగా శోభాయాత్ర
మంగళ వాయిద్యాల నడుమ భగవత్‌ రామానుజుల నామస్మరణతో అత్యంత వైభవోపేతంగా 3 కిలో మీటర్ల మేర శోభాయాత్ర సాగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఋత్వికులు, అర్చకస్వాములు ఈ యాత్రలో ముందుండి నడిపించారు. కళాకారుల కోలాటాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరిస్తుం డగా.. శ్రీమన్నారాయణ నామసంకీర్తనలు మిన్నంటగా, మంగళవాయిద్యాల ఘోష నడుమ స్వామివార్ల శోభాయాత్ర పవిత్ర యాగశాలలోకి చేరింది. యాగశాలలో తొలుత సీతారామచంద్ర స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ఐదుగురు జీయర్‌ స్వాములు అనుగ్రహభాషణం చేశారు. 1035 హూమ గుండాలలో నిర్వహంచే కార్యక్రమాలను భక్తులకు వివరించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి, మైంహోమ్‌ గ్రూప్‌ అధినేత డా. జూపల్లి రామేశ్వరరావు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

సరికొత్త శోభ
రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగను పురస్కరిం చుకొని 12 రోజుల పాటు నిర్వహించనున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రీరామనగరం కొత్త కళతో అలరిస్తోంది. రంగురంగుల విద్యుత్‌ కాంతులు, యాగశాలలు, శోభాయాత్ర, వేలాది మంది భక్తులు, ఋత్విక్కుల మంత్రోచ్ఛారణ, కోలాటాలు.. ఒకటేమిటి సమస్త వర్గాలు అక్కడకు చేరుకోగా శోభాయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. ఒకవైపు అష్టా క్షరీ మంత్ర జపం.. మరోవైపు జై శ్రీమన్నారాయణ నామస్మరణతో ప్రాంగణమంతా మారుమోగింది. 14వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో సమతామూర్తి విగ్రహాన్ని 5వ తేదీన జాతికి అంకితం చేయనున్నారు. 216 అడుగుల ఎత్తున నిర్మించిన విగ్రహాన్ని ఆ రోజు ప్రధాని నరేం ద్రమోడీ ఆవిష్కరించనున్నారు. ఈ సహస్రాబ్ది వేడుకలు జరిగే అన్ని రోజులూ ఉదయం, సా యంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రతి రోజు సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్య అతిథుల ప్రసంగాలు ఉంటాయి. తర్వాత రాత్రి 9.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

విశ్వక్సేన పూజ.. పుణ్యహవచనం
ప్రథమంగా విశ్వక్సేన పూజతో ప్రారంభించి వాస్తు ప్రాంగణ శుద్ధి, పుణ్యహ వచనం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వాస్తుహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు శ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి చేతుల మీదుగా జరిగాయి. యాగశాలకు వచ్చిన భక్తులకు వాస్తుశాంతి పూజ ప్రాధాన్యతను అందులోని విశిష్టతను చిన్న జీయర్‌ స్వామి వివరించారు. 144 యాగశాలల్లో జరిగే 1035 హోమ గుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు గురించి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement