Friday, November 22, 2024

పురాణపండ గ్రంథాలను ఆవిష్కరించిన శ్రీవిద్యాశంకర భారతి

హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : వందలకొలది వేద పండితుల వేదగానాలు, మంత్ర ధ్వనులతో రవీంద్రభారతి ఆడిటోరియం పవిత్రంగా ప్రతిధ్వనిస్తూ పులకించిపోయింది. భారతీయులకు తరతరాల వైదిక విశ్వాసాన్ని సంప్రదాయబద్ధంగా అందించే సర్వోన్నత పీఠమైన పుష్పగిరి పీఠాధిపతులు, అభినవోద్ధండ విద్యాశంకర నృసింహ భారతీస్వామి అనుగ్రహంతో తెలంగాణ పూర్వ ప్రత్యేక సలహాదారు డాక్టర్ కేవీ.రమణాచారి అధ్యక్ష పీఠంలో రసవత్తరంగా సుమారు రెండు గంటల పాటు సంస్కృతీ విలువలతో నడిచిన ఈ పవిత్ర శ్రీకార్యంలో ప్రముఖ రచయిత, ఆరాధన పత్రిక పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ అద్భుత గ్రంథాలను వేద పండితులు, రసజ్ఞులు అందుకోవడంతో వారి సంతోషాన్ని రమణాచారికి, పురాణపండకి కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల తిరుమల మహాక్షేత్రంలోని వేంకటాద్రి, యాదాద్రి, భద్రాద్రి, ఇంద్రకీలాద్రి దేవస్థానాల్లో అనేక మంగళకర దివ్యభవ్యగ్రంథాలతో అధికార అనధికార గణాలతో పాటు భక్తబృందాలను విశేషంగా ఆకర్షించి పవిత్రమయ ప్రశంసలు పొందిన పురాణపండ శ్రీనివాస్ అఖండ రచనా సంకలనాలైన ఆనంద నిలయం, దేవీం స్మరామి గ్రంథాలను శనివారం రవీంద్ర భారతిలో పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్ధండ విద్యాశంకర నృసింహ భారతీ స్వామి ఆవిష్కరించి తొలి ప్రతులను కేవీ.రమణాచారికి అందజేశారు.

రెండున్నర దశాబ్దాలకు పైగా ఎన్నో అపూర్వ కార్యక్రమాలను భాగ్యనగరానికి సమర్పించిన ప్రముఖ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంస్థ సత్కళాభారతి సంస్థాపక అధ్యక్షులు సత్యనారాయణ సమర్థవంతమైన పర్యవేక్షణలో 28వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వేదపండితులకు ఆనంద నిలయం, దేవీం స్మరామి మనోహర గ్రంథాలను బహూకరించడం విశేషంగా పేర్కొనాలి.

ఈ సందర్భంగా బ్రాహ్మణోత్తములు, వేద విహిత కర్మలు, వేద పారాయణం నిరంతరం చేయడం వల్లనే ఆత్మవంతులు కాగలుగుతారని, జన్మ చరితార్ధమవుతుందన్నారు. సభాధ్యక్షులు రమణాచారి మాట్లాడుతూ వేదమే బ్రాహ్మణులకి పరమైశ్వర్యమని, వేదకాంతి జగజ్జేగీయమానమన్నారు. ఈ ఉత్తమ కార్యానికి సౌజన్యమందించిన ఆర్ఎస్ బ్రదర్స్ అధినేతలు రాజమౌళి, వెంకటేష్ లను అభినందించారు.

సభను ప్రారంభించిన తెలంగాణ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ ఈ పవిత్రకార్యంలో పాల్గొనడం పురాకృత జన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పారు. అభయముద్రలాంటి పుష్పగిరి పీఠాధిపతులు ఈ మంగళకార్యానికి రావడం పరమ శుభాలను ఆవిష్కరిస్తోందని పేర్కొన్న రమణాచారి, పరమ పవిత్ర కార్యాన్ని చక్కగా నిర్వహించిన సత్కళాభారతి సత్యనారాయణను అభినందించారు.

- Advertisement -

వేద పండితులను ఆర్ఎస్. బ్రదర్స్ అధినేతలు రాజమౌళి, వెంకటేష్ నగదు, శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్కళాభారతి కార్యదర్శి భాష్యం యదుమోహన్, జీ.శేషాద్రిరాజు, చిలువేరు రఘురాం తదితరులు పాల్గొన్నారు. అద్భుత సత్కారంలో చక్కని లావణ్యాభరితమైన గ్రంథాలను, మహోన్నత ముద్రణతో అందించిన నిర్వాహకుల సమయస్ఫూర్తిని ఎంతోమంది పండితులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement