Friday, November 22, 2024

ధర్మం మర్మం (ఆడియోతో..)

శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం
శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్‌” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.

ఈరోజు హయగ్రీవ అవతార వైశిష్ట్యంపై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
హయగ్రీవుడు
సోమకాసురుడు అను అశ్వశిరముతో అనగా హయగ్రీవ రూపంలో ఉన్న రాక్షసుడు బ్రహ్మ ని దురపోవుచున్నపుడు అతని నుం డి వేదములను హరించి సముద్రమున దాగెను. తనవంటి వానితోనే తనకు మరణం కలగాలని బ్రహ్మ నుండి వరము పొందిన కారణంగా శ్రీమన్నారాయణుడు హయగ్రీవరూపంతో సముద్రమునకు వెళ్ళి సామగానము చేసెను. అతని సామగాన మాధుర్యానికి మైమరిచిపోయిన సోమకాసురుడు ఆ గానమును వినుటకు సముద్రం పైకి వచ్చెను. ఇదే అదనుగా హయగ్రీవస్వామి సముద్రములోనికి వెళ్ళి దాచిన వేదములను తీసుకొని తిరిగి బ్రహ్మకు ఇచ్చెను. ఇది గమనించిన సోమకుడు వి ష్ణువుపైకి దండెత్తగా విష్ణువు హయగ్రీవ రూపంతో అతనిని సంహరించెను. ఈ విధంగా హయగ్రీవస్వామి వేదరక్షకుడు, విద్యాప్రదాత.
బ్రహ్మ యజ్ఞం చేస్తుండగా ఆ యజ్ఞ గుండం నుండి విష్ణువు హయగ్రీవరూపంలో ఆవిర్భవించెనని పద్మపురాణ గాథ. హయగ్రీవ స్తోత్రమున కూడా ఇలాగే ప్రస్తావించబడినది. ”అగ్నౌ సమిద్ధారి ్చషి సప్త తంతో: | ఆతస్థివాన్‌ మంత్రమయం శరీరం ||” అని వేదాంత
దేశికుల ఉవాచ. అదేవిధంగా స్కాంద పురాణమున, బ్రహ్మాండ పురాణమున వేద రక్షణ, వేద ప్రభోదం, యజ్ఞ రక్షణ కార్యములను ఉద్దేశించి విష్ణుమూర్తి నారదుని ద్వారా శివునితో తనకు విరోధము కల్పించుకొనగా శివకేశవులు ఇరువురు యుద్ధ రంగమున తలపడగా విశ్రాంతి కోరిన శ్రీహరి యుద్ధరంగంలోనే ధనువు కొనపై చుబుకమును ఉంచి నిద్రించెను. కీటక రూపంలో వచ్చిన ఇంద్రుడు ధనువు తాడును కొరకగా, ధనుష్కోణము పైకి లేచి విష్ణువు శిరస్సు ఎగిరిపడగా వెంటనే బ్రహ్మాది దేవతలు అశ్వశిరమును తెచ్చి విష్ణువుకు జోడించెను. ఇది కేవలము హయగ్రీవ అవతారము కొరకు శివకేశవుల లీల మాత్రమే. ఈ విధంగా సముద్రజలమున, యజ్ఞ గుండమున, యుద్ధ రంగమున ఆవిర్భవించి వేదాలను రక్షించి 84 విద్యలను వృద్ధిపొందించినవాడు హయగ్రీవుడు. హయము అనగా అశ్వము, శక్తికి సంకేతం. ఈనాటికీ శక్తిని అశ్వముతోనే లెక్కకడతాం. గ్రీవము అనగా కంఠం అదే నాదనిలయము. ‘హయగ్రీవమే’ వేదశక్తి, నాదశక్తి. దీనికే మరోపేరు విద్యాశక్తి కావున హయగ్రీవుడు విద్యాదేవత.

జ్ఞానానంద మయం దేవం నిర్మల స ్ఫటికాకృతిం |
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవ ఇతి యోవదేత్‌ |
తస్య నిస్యరతే వాణి జహ్ను కన్యా ప్రవావహత్‌ ||

హయగ్రీవ నామాన్ని ప్రతీ రోజు మూడు సార్లు భక్తి శ్రద్ధలతో స్మరించిన వారి వాక్కు గంగా ప్రవాహంలా లోకాన్ని పవిత్రం చేస్తుంది. శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement