Sunday, November 17, 2024

‘శ్రీమద్రమణాయణమ్‌’

యోగులు, ఋషులు, ముముక్షువులు, ఈ కాలంలో ఉంటారా అని సందేహపడనవసరం లేకుండా మొన్నమొన్నటి వరకు (74 సంవత్సరాల క్రితం వరకు) మన మధ్యలో జీవించిన భగవాన్‌ శ్రీ రమణ మహర్షిని ఆర్ష ధర్మానికి నిలువెత్తు రూపంగా చెప్పవచ్చు. ”రామో విగ్రహవాన్‌ ధర్మ:” అన్నారు వాల్మీకి. శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మ స్వరూపుడని అర్థం. అదే విధంగా ”శ్రీరమణో విగ్రహవాన్‌ ఆర్ష ధర్మ:” అని ఘంటాపథంగా సిద్ధాంతీకరించవచ్చును.
శ్రీరామ చరిత్రను రామాయణం అన్నట్లుగా శ్రీరమణ మహర్షి జీవిత చరిత్రను రమణాయణం అని పేర్కొందాం. శ్రీరామునికి, శ్రీరమణులకు ఉన్న పోలికలను పరిశీలిద్దాం. శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రమే శ్రీరమణుల జన్మ నక్షత్రం. ఇరువురూ కరుణ నిండిన అరవింద దళాయతాక్షులు. మిక్కిలి బుద్ధిమంతులుగా, పెద్దలమాటను మన్నించే వారుగా, పరోపకార బుద్ధి, భూతదయ, కల్గినవారుగా పేరుగాంచా రు. తన నడవడి అందరికీ ఒరవడి కావాలని, అన్ని విద్యలకు తానే మూలమైన వాడైనా వశిష్ఠ , విశ్వామిత్రాది గురువుల వద్ద విద్యలను అభ్యసించాడు. సకల విద్యల మూలతత్త్వమునెరిగిన వాడైన శ్రీరమణులు లౌకిక విద్యల పట్ల ఆసక్తి చూపక, కేవలం పెద్దల ఆదేశం మేరకు వీధి బడిలో తన విద్యాభ్యాసం మొదలుపెట్టారు. అనంతర కాలంలో అంటే తాము ఆశ్ర మ జీవితాన్ని గడపబోయే దశలో నిద్రకు సమయముండదని కాబోలు బాల రమణులు చిన్నతనంలో గాఢ నిద్ర…. ఒక రకంగా చెప్పాలంటే రామాయణంలో కుంభకర్ణుడు, ఊర్మిళాదేవి లాగా నిద్రపోయేవారు. ఆ సమయంలో బాహ్య ప్రపంచంలో ఏమి జరిగినా రమణులకు తెలిసేది కాదు. పదునాలుగేండ్లు నిద్రను త్యజించి సీతారాములను కనురెప్ప వేయకుండా కాపాడుకొంటున్న భర్తకు బదులుగా లక్ష్మణస్వామి పత్ని అయిన ఊర్మిళ నిద్రపోగా, భావి జీవితపు నిద్రను బాల్య దశలోనే అనుభవించారు శ్రీరమణులు. ”రామ” అన్నా , ”రమణ” అనినా ‘ఆనందింపజేయువాడు’ , ఆనంద స్వరూపుడు, అనే అర్థం. పైగా రమణుల పూర్వాశ్రమ నామం” వేంకటరామన్‌” కావడం యాదృచ్ఛికమైతే కాదు.
శ్రీరామునికి మిథిలకు విశ్వామిత్రుడు దారి చూపినట్లుగా, రమణులకు ఆయన దూరపు బంధువైన, రామస్వామి అయ్యర్‌ అనే ఆయన, అరుణాచల క్షేత్రాన్ని గురించి తెలిపారు. శ్రీరామునికి శివధనుస్సు ఎక్కుపెట్టడమనే పరీక్ష జరిగినట్లుగా, రమణులకు ”మరణానుభూతి” అనే పరీక్ష జరిగింది. శ్రీరాముడు శివధనుస్సును విరిచి సీతను గెలుచుకొన్నట్లు రమణుడు మరణానుభూతిని చవిచూచి ఆత్మతత్త్వాన్ని తెలుసుకొన్నారు. ఇంతవరకు ఉన్న రమణుల జీవిత భాగాన్ని శ్రీమద్రామాయణంలోని ‘బాలకాండ’తో పోల్చవచ్చు.
శ్రీమద్రామాయణంలోని అయోధ్య కాండతో పోల్చదగింది రమణాయణంలోని మధురా నగర కాండ. ‘పెరియ పురాణం’ వంటి మహద్గ్రంథాలను చదవడం రమణుల జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. రాజ్యాన్ని త్యజించి శ్రీరాముడు అడవికి వెళ్ళినట్లుగా, కుటుంబాన్ని వదిలి రమణులు అరుణాచలంబాట పట్టారు. రాముని రాజ్య త్యాగానికి ఆయన పినతల్లి కైకేయి కారణమైనట్లు రమణ మహర్షి గృహ త్యాగానికి ఆయన అన్న నాగస్వామి మందలింపు కారణమయ్యింది. అరుణాచలానికి చేరడానికి ముందు, దారిలో కృష్ణాష్టమి నాడు ఆకలితో తమ ఇంటికి వచ్చిన రమణులను ఆదరించి, ఆయన అరుణాచలం చేరడానికి రైలుటికెట్టు కోసం కొంత సొమ్ము ఇచ్చిన ముత్తయ్య భాగవతార్‌ను రామాయణంలోని గుహుని పాత్రతోను, ఎంతో ఆప్యాయతతో బాలక-ృష్ణునికి నివేదించినట్లు రమణునికి పిండి వంటలతో భోజనం పెట్టి, దారిలో తినడానికి కూడా ఆహారాన్ని మూటకట్టి ఇచ్చిన భాగవతార్‌ గారి వితంతు సోదరిని శబరి పాత్రతోను పోల్చవచ్చు. అరుణాచలం చేరి, కౌపీనమాత్రధారియై, పాతాళ గుహలో ఆయన తపోదీక్షతో గడిపిన తొలి దశను అరణ్యకాండమనవచ్చు.
శ్రీరమణుల చెంతకు సిద్ధులు, పెద్ద పులి, చిరుత పులి, బంగారు వర్ణపు ముంగిస, నెమళ్ళు, జింకలు, ఆవులు, తేళ్ళు, పాములు, కోతులు, గిరిజనులు, పిల్లలు, ఇలా రకరకాల రూపాలలో రావడం, వారితో రమణులు మమేకమై గడపడం కిష్కింధ కాండ కాగా, కోతులతో ఎన్నో సందర్భాలలో ఆత్మీయంగా గడపడం, వాటితో సంభాషించడం, వాటి సమస్యలు తీర్చడం, వాటిని ఓదార్చడం, సుందరకాండం అనవచ్చు. కాన్సర్‌తో పోరాడిన దశ రమణుల జీవితంలో యుద్ధకాండ కాగా, దే#హ పరిత్యాగం తర్వాత కూడా భక్తులను, శిష్యులను అనుగ్ర#హస్తూ ఉండడం ఉత్తరకాండ అని చెప్పవచ్చును.
శ్రీమద్రామాయణ పారాయణలాగా, శ్రీమద్రమణాయణ పారాయణ కూడా నిస్సందేహంగా ముక్తిదాయకమే!

  • గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి
Advertisement

తాజా వార్తలు

Advertisement