Tuesday, November 19, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం..

  1. వాణీవల్లభ దుర్లభంబగు భవ ద్ద్వారంబున న్నిల్చి ని
    ర్వాణ శ్రీ జెఱ పట్ట ( జూచిన విచార ద్రోహమో , నిత్యక
    ల్యాణ క్రీడల( బాసి, దుర్దశల పాలై రాజలోకాధమ
    శ్రేణి ద్వారము దూర( జేసి తిపు డో శ్రీకాళహస్తీశ్వరా.

ప్రతిపదార్థం:
శ్రీ కాళహస్తీశ్వరా!, వాణీవల్లభ- సరస్వతీదేవి భర్త యగు బ్రహ్మ కూడ, దుర్లభంబు – అగు – దొరకుటకు వీలు కాని, భవత్ – ద్వారంబునన్ – నీ యొక్క ( ఇంటి) వాకిట, నిల్చి్స నిలబడి, నిర్వాణశ్రీన్ – మోక్ష లక్ష్మిని, చెఱపట్టన్ -చూచిన – బంధించి తీసికొని పోవ ప్రయత్నించిన, విచార్స ఆలోచనల వలన కలిగిన, ద్రోహము – ఓ – ద్రోహమో ఏమో? నిత్య – నిరంతర (ప్రతి దినము), కల్యాణ క్రీడలన్ – శుభప్రదమైన విలాసములకు ( అనగా నీ సేవాభాగ్యమునకు), పాసి -వదలి, దూరమై, దుర్దశల్స దురవస్థలకు, పాలు – ఐ – లోనై, ఇపుడు్స ఈ సమయమున, రాజలోక -రాజుల సమూహములో, అథమశ్రేణీ – తక్కువ తరగతికి చెందిన వారి, ద్వారము – గుమ్మమును, దూరన్ -ప్రవేశించునట్లు, చేసితీవి – చేశావు, కల్పించావు.

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! తారతమ్యము లెఱుగక, బ్రహ్మాదులకు కూడా దుర్లభమైన నీ ఇంటి వాకిట నిలబడి, ముక్తికాంతను చెఱబట్టి (బలవంతముగా తీసుకొని, అర్హత, అనర్హతల గురించి ఆలోచింపక) తీసికొని పోదామని అనుకున్న, నా ఆలోచన లోని ద్రోహబుద్ధికి ఫలితమై యుండ వచ్చును, సర్వశుభప్రదములైన నీ సేవాభాగ్యమునకు దూరమై, నీచులై రాజుల గుమ్మములలో ప్రవేశించునట్లు చేశావు.

విశేషం:
తాను రాజాస్థాన ప్రవేశాన్ని కోరటం కూడా ఈశ్వరవిలాసమేనట. కాని, దానికి కారణం మాత్రం తన దురాశ యట. మోక్ష మన్నది భగవంతుడి అనుగ్రహం వలన సిద్ధించునదే కాని, మానవులు తాము స్వయంకృషితో సంపాదించా మనుకొనటం సత్యం కాదు. అయినప్పుడు ముక్తికాంతను బలవంతంగా చేపట్ట దలచటం ద్రోహమే కదా. పరమేశ్వరుడి యందు భక్తి, తత్ఫలితమైన పరమేశ్వరానుగ్రహం ఉండగా ‘ ముక్తి’ అన్నది కాంక్షించటం నమ్మకద్రోహం కాదా? ఎవరి కెంత వరకు, ఏమివ్వాలి? అన్నది ఈశ్వరుడికి తెలుసు. నమ్మినపుడు సందేహించ కూడదు.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement