Monday, November 18, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం..

  1. శ్రీ విద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబుధా
    రా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్
    దేవా, నీ కరుణాశరత్సమయ మింతే చాలు, చిద్భావనా
    సేవన్ దామరతంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా. ప్రతిపదార్థం:
    శ్రీ-సాలెపురుగు, కాళ- పాము, హస్తి- ఏనుగ అను మూడింటికి , ఈశ్వరా- ప్రభువైన పరమేశ్వరా, దేవా్స ప్రభూ, శ్రీ- సంపదలు, శుభములు అనెడి, విద్యుత్- మెఱుపు తీగలతో, కలిత- కూడుకొన్న, ఆజవంజవ – సంసారమనెడి, మహాజీమూత-దట్టమైన మేఘముల నుండి కురిసెడి, పాప- అంబుధారా- పాపములనెడి నీటి ధారల, వేగంబునన్- వేగము వలన, మత్ – మనః – అబ్జ (మన్మనోబ్జ) – నా మనస్సు అనే పద్మము యొక్క, సముదీర్ణత్వంబున్ – వికసమును, కోల్పోయితిన్ – పోగొట్టుకుంటిని, నీ – నీ యొక్క, కరుణా – దయ అనెడి, శరత్ – సమయము – శరత్కాలము, ఇంతే – ఈ మాత్రమే ( కొంచెమే), చాలు్స సరిపోతుంది, చిత్ -భావనా – జ్ఞాన స్వరూపుడవైన నిన్ను భావించి, సేవన్ – కొలుచుటచే, తామర తంపర -ఐ -సర్వ సమృద్ధి కలవాడనై, మనియెదన్ – బ్రతికెదను.

తాత్పర్యం:
సాలె పురుగును, పామును, ఏనుగను కూడా కాపాడి, వాటికి మోక్షమొసగి, వాటిని నామము నందు కూడా ధరించి, తీర్థమునకు కూడా అదే పేరుంచిన భక్తవత్సలుడైన ఈశ్వరా! శ్రీ కాళహస్తీశ్వరా!
సంపదలు అను మెఱుపుతీగెలు కల సంసారము అను మేఘములు పాపములు అను వర్షధారలు కురియగా, ఆ వానకు నా మనస్సు అను పద్మము కాంతి లేక వాడి పోయింది. ఇప్పుడు నీ దయ అనే శరత్కాలము వచ్చింది. ఇంత మాత్రము చాలు. నీ చిన్మయ రూపమును ధ్యానించుతూ తామరతంపరగ సర్వవిధముల వికాసము కలవాడనై జీవిస్తాను.
విశేషం: ప్రాచీన కావ్యసంప్రదాయము ననుసరించి తన శతకాన్ని ‘శ్రీ’ అనే మంగళశబ్దంతో ప్రారంభించాడు ధూర్జటి. తన శతకంలో శుభప్రదమైన అంశాలే ఉంటాయని, భక్తులకు శుభము, మంగళము అంటే కైవల్యమే కనుక ఆ కైవల్యాన్ని పొందే మార్గానికి ఇది ప్రారంభం అని సూచన ఉంది. ఈ శతక రచనకు ముందు తాను అనుభవించింది, ఈ రచనా సమయంలో అనుభూత మయింది, రచన వల్ల తాను పొందగోరు ప్రయోజనము అయిన కైవల్యము విన్న, చదివిన వారందరకూ మార్గదర్శకమై లక్ష్యమై సిద్ధిస్తుందనే శుభాశంసన ఈ ప్రథమ పద్యంలో ద్యోతక మవుతోంది. తన రచనా ప్రణాళిక అంతా భక్తుడు భగవంతుణ్ణి చేరటానికి చేసే సాధనా మార్గ మంతా తానీ శతకంలో ప్రస్తావించ బోతున్నట్టు వస్తునిర్దేశం చేసినట్లనిపిస్తుంది. తన రచనా ప్రణాళికను కావ్యవస్తుస్వరూపాన్ని వ్యంగ్యంగా భాసింప చేశాడు.

  1. శ్రీ విద్యుత్ కలితాజవంజవము యొక్క నీచత,
  2. పాపాంబు ధారల వలన మనోజ్ఞము వికాసము కోల్పోయే దుస్థితి,
  3. భగవత్కరుణా శరత్సమయ ప్రయోజనము,
  4. సేవామాహాత్మ్యము
    అనే ఈ నాలుగు ఈ శతకంలో ప్రధానాంశాలు. దీని నుండి ‘ తామర తంపర’ గా పుట్టినవే మిగిలిన పద్యాలు అనే సూచన ఈ పద్యాలలో ఉండి నాటకంలోని నాందీ పద్యం వలె ఉన్నది ఈ తొలి పద్యం. వర్ష ఋతువులో తామర పూలు వాన తాకిడికి వడలి పోయి ఉండటం, శరత్కాలంలో వికసించటం ప్రకృతి ధర్మం. మనస్సుని పద్మంగా చెప్పటం, చిద్భావన వలన వికాసం తామర తంపరగా అవుతుందనటం – షట్చక్రాలని, వాటి వికాసాన్ని స్ఫురణకి తేవటమే. శ్రీకాళహస్తి యందు శివుడు జ్ఞానప్రసూనాంబికాపతి. స్వయంగా జ్ఞానస్వరూపుడు కూడ. కనుక అచటి ఈశ్వరుడిది ‘చిత్’ స్వరూపమే.

అలంకారాలు:
శ్రీకి విద్యుత్ కి ఆజవంజానికి మహాజీమూతానికి, పాపానికి అంబుధారకి, మనస్సుకి అబ్జానికి అభేదం చెప్పబడింది. కనుక ఇది రూపకాలంకారం.
సంపదలు ఆకర్షణీయాలు, అస్థిరాలు, కనులు మిరుమిట్లు గొలుపుతాయి కనుక మెఱుపుతీగలతో పోల్చటం సముచితం.

‘చిత్’ భావన:
‘ చిత్’ అనగా శుద్ధజ్ఞానం. ‘ భావన’ అనగా ఒక భావాన్ని లేక ఒక అంశాన్ని మననం చేసి చేసి, ధ్యానం చేసి, దానిలో ఊరి దానిని వంట పట్టించుకొని, ఆ లక్షణం తనలో భాగం అయిపోవటం. ఉదాహరణకు భావన జీలకర్ర, భావన అల్లం మొదలైనవి. జీలకర్ర, లేదా అల్లం నిమ్మరసంలో భావన చెందినట్లు భక్తుడు భగవంతుడిలో భావన చెందాలి. అది కూడా చిద్రూపమైన భగవంతుడితో.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement