Saturday, November 16, 2024

శ్రీరామచంద్రుని లోకారాధనలు!

ఆదికవి వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణంలో అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడు రూపుదాల్చిన ధర్మం. షడ్గుణౖశ్వర్య సంపన్నుడు. ధర్మము యొక్క ఆకా రమే శ్రీరాముడు. ఇలాంటి ఆదర్శపురుషుడైన శ్రీరాముని పలు గ్రంథాలు- కావ్యాలు ఆయనను వివిధ రకాలుగా ప్రస్తుతించాయి. ఆయన గుణగణాలను పలు రీతుల ప్రశంసించినాయి. కవుల పద్యర చనల్లో శ్రీరాముని స్తోత్రములు జగద్విదితము గాంచినాయి.
ఆంధ్ర మహాభాగవతంలో..

ఉ|| నల్లనివాడు- పద్మనయనంబులవాడు- మహాశుగంబులన్‌
విల్లును దాల్చువాడు- గడు విప్పగు వక్షమువాడు మేలుపై
జల్లెడువాడు- నిక్కిన భుజంబులవాడు- యశంబుదిక్కుల్‌
జల్లెడు వాడునైన- రఘు సత్తముదిచ్చుత మాకభీష్టముల్‌|
అంటూ వర్ణించినాడు సహజకవి పోతనామాత్యులవారు. ”ఇన్ని గుణములు గల్గిన శ్రీరాముడు మాకు అభీష్టములననుగ్రహించుగాక” అని వేడుకొనినాడు. పోతనగారే మరో కంద పద్యములలో యిలా తెలి పారు. శ్రీరామనామ వైభవాన్ని.
కం|| మంతనములు- సద్గతులకు
పొంతనములు- ఘనములైన పుణ్యములకిదా
నీంతన పూర్వ మహాషుని
కృంతనములు రామనామకృతి చింతనముల్‌||
అని వర్ణించారు. మంచి మార్గంలో నడిపించానికి- గొప్ప పుణ్యా లను లభింపచేయడానికి శ్రీరామ కధాకావ్యాలే దిక్కు. అవే మూలాలు. ఎన్నో జన్మల నుంచి పేరుకొనిపోయిన పాపాలను రామ నామ కృతులే నశింపచేస్తాయి.
ఆంధ్ర మహాభారతంలో రాముని గుణగణాలు

సీ|| అభినవ పద్మాదళాక్షు- నక్షీణ విస్తృతవక్షు- నాజానుదీర్ఘబాహు,
మధుర స్మితానను- మీద గజమను- నీరూఢయవ్వను- నభిరూపతేజు,
శ్రీరమణీయు- బ్రసిద్ధ యశోరమ్యు నిఖిల విద్యాగమనిపుణ చిత్తు,
నింద్రసమాను- జతేంద్రియు- ధర్మజ్ఞు బీరబాంధవజన- ప్రార్థనీయు.

గీ|| దుష్టని గ్రహైక ధుర్యు- విశిష్ఠసం
రక్షణాభిలోలు- రామచంద్రు
గులపవిత్రు- బెద్దకొడుకునుంగొని
రాజవరుడు గరము రాగమెసగ||
మహాభారతం అరణ్యపర్వంలో రామకథ వస్తుంది. మార్కండే య మహర్షి ధర్మరాజుకు చెబుతారు. రాముడి స్వరూప స్వభావాన్ని ఎలా దర్శించాడో చెబుతున్న పద్యమును ఎఱ్ఱనగారు మనోజ్ఞంగా తెలి పారు. శ్రీరాముడు మూర్తిమత్వము, వ్యక్తిత్వమూ ఉన్న రాముని గాంచి తండ్రి దశరథ మహారాజు ఎంతో అనురాగంతో యువరాజుగా పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. సూర్యవంశాన్ని పావనం చేసిన పుణ్యపురుషుడు శ్రీరాముడు.
భాస్కర రామాయణంలో…

భాస్కర రామాయణంలో కవి కిష్కింధాకాండలో సుగ్రీవునితో హనుమ చెప్పిన మాటలను- శ్రీరాముని గుణములను వర్ణించాడు.
ఉ|| రాముడు నిత్య సత్యుడు- శరణ్యుడు- న్యాయపరుండు- ద్రాతయు
స్వామియు- ధర్మవత్సలుడు- సత్యసమేతుడు గాన- పాపహిం
సామతిగాడు- లక్ష్మణుడు చాల సహాయయుడుగాగ-జన్న-ని
న్నేమియు జేయ డర్కసుతయేగుము వేగమ రాముపాలికిన్‌|| అంటూ శ్రీరాముడు తననేమి చేస్తాడోనని భయంతో ఆందోళన చెందుతున్న వేళ హనుమ యిలా తెలిపాడు. సుగ్రీవా! వెంటనే రాముని దగ్గరకు వెళ్ళు లక్ష్మణుడు తోడుగా ఉంటాడు. నిన్ను రాముడేమీ చేయడు. ఆయ నెవరనుకుంటున్నావు? నిరంతరం సత్యానికే కట్టుబడి ఉండేవాడు. శరణు కోరిన వారిని ఆదుకుంటాడు. న్యాయంగా ఉంటాడు. రక్షిస్తాడు. మనకు నాధుడు. ధర్మం అంటే కన్నబిడ్డలా వాత్సల్యం చూపిస్తాడు. పాపాన్ని దరికి రానీయడు. పరహింస చేయడుగాన ముందు వెళ్ళి శ్రీరా ముని కలుసుకో అని తెలిపాడు.
పాదుకా పట్టాభిషేకం- అయోధ్యకాండలో…

- Advertisement -

శ్రీరామ సోదరుడు భరతుడు శ్రీరాముని తిరిగి రాజ్యానికి రమ్మని కోరినపుడు రాముడు భరతునితో అన్న పలుకులు. శ్రీరాముని గుణ ములు- పితృవాక్య పాలనను గురించి ఒక పద్యంలో యిలా తెలిపారు.
చ|| జనకుని శాసనంబునను సాగితి గాననమేను- నీవునుం
జనకుని శాసనంబునను సాకుము ధారణి- నీకు, నాకునీ
జనకుని మాటకాదదెడు జాల్మత- మేల్మికినున్కి పట్టగున్‌
జనకుని మాటసేత- కొనసాగుము- రాఘవ వంశనీతియై|| అంటూ భరతా! నాన్నగారి ఆజ్ఞను పాటించి నేను అడవికి వచ్చాను. నేను తండ్రి మాటను పాటించినట్లుగానే, నువ్వు పాటించి భూమిని పాలించు నేను రాజ్యం వస్తే మనిద్దరమూ తండ్రి మాటను ధిక్కరించిన వాళ్ళమవుతాము. అట్టి వివేకం మనిద్దరికి చుట్టుకుంటుంది. నాన్న మాట వింటే ఎప్పుడూ మేలే జరుగుతుంది. ఇది మన వంశంలో పూర్వం నుంచి వస్తున్న నీతియిదిగా పితృవాక్య పరిపాలన ముఖ్యం.
విశ్వనాథ వారి కల్పవృక్షంలో…

విశ్వనాథ వారు అయోధ్యకాండలో సుమిత్ర లక్ష్మణుని శ్రీరాము నితో అడవులకు పంపేవేల పల్కిన పలుకులు, సుమిత్ర సుతునికి ఉపదేశం.
మధ్యా|| ఎఱుగుము రాముదశరథుడేయని- యేనని సీత
నెఱుగుము, వనమయోధ్యయని యెఱిగి- పోయెదవేని పొమ్ము
కఱదలేటికి? నీలమేఘకాంతప ఘనుడైన- రాము
మఱువకు, సీదామనీ సమ శరీర- మఱువకు సీత||
లక్ష్మణా! సీతారాములతో నీవు అడవిలో ఉన్నప్పుడు రాముని దశరథునిగా, సీతమ్మను నన్నుగా సంభావించు. అయోధ్య నగరమే అడవిగా భావించు. నువ్వు వెళ్ళాలంటే ఇలా అనుకొని వెళ్ళు. నీకు ఉప దేశాలెందుకు? నీలమేఘశ్యాముడైన రాముని పట్ల, మెరుపు తీగలాం టి సీతమ్మ పట్ల ఏ క్షణంలోనూ ఏమరుపాటుగా నుండకు. వెళ్ళిరా అని లక్ష్మణుని దీవించినది. కావున సకల జనులు పవిత్రం చేసే రామాయ ణాన్ని పఠించిన ధన్యజీవు లు కావాలి. పుణ్యచరితులు కావాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement