తిరుపతి : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల్లో రెండో రోజైన సోమవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ జరిగింది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. జూలై 5న గరుడ వాహనసేవ జరుగనుంది.
హనుమంత వాహనంపై విహారం
సాక్షాత్కార వైభవోత్సవాల్లో రెండో రోజు రాత్రి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు హనుమంత వాహనంపై మాడ వీధులలో భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుండి తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు. కావున దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.