Saturday, November 23, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 20

20. నీకున్ మాంసము వాంఛ యేని కరవా? నీ చేత లేడుండగా,
జోకైనట్టికుఠారముండ,ననలజ్యోతుండ,నీరుండగా,
పాకంబొప్ప ఘటించి, చేతి పునుకన్భక్షింప కా బోయచే(
జేకొంటెంగిలి మాంస మిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!నీకున్ – నీకు, మాంసము – మాంసాహారముపై, వాంఛ – ఏని్స కోరిక ఉన్నట్లైతే,కరవా?్స – లేకపోయినదా?,నీ చేతన్ – నీ చేతిలో. లేడి – మృగము, ఉండగా – ఉండగా, జోకైన – అట్టి – పదునైన, కుఠారము – ఉండన్ – గొడ్డలి ఉండగా, అనలజ్యోతి – ఉండన్ – అగ్నిదీపం (లలాట నేత్రం) ఉండగా, నీరు – ఉండగాన్ – నీళ్ళు (గంగానది) ఉండగా, ఒప్పన్ – తగినట్లుగా, పాకంబు – వంటను, ఘటించి – చేసికొని, చేతి పునుకన్్స – చేతిలోని పుర్రెలో, భక్షింపక – తినకుండ, ఆ బోయచేన్ – ఆ బోయవాడైన తిన్నని నుండి, ఎంగిలిమాంసము – ఉచ్చిష్టమైన మాంసాన్ని, చేకొంటి – గ్రహించావు, ఇట్లు – ఈవిధంగా, తగునా – చేయటం సరియా? (సరి కాదని భావం)

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! నీకు మాంసాహారము పై కోరిక ఉన్నట్లైతే, చక్కగా వండుకొని తినవచ్చు కదా. నీ చేతిలో లేడి ఉంది. మాంసం సిద్ధం. మాంసాన్ని చక్కగా ముక్కలు చేయటానికి పదునైన గండ్రగొడ్డలి ఉంది. మూడవ నేత్రంలో నిప్పు ఉంది. గంగ ఉన్నది కనుక వంటకి కావల్సిన నీరు కూడ సమకూడింది. వీటన్నిటితో చక్కగా వండి,చేతిలోని పుర్రె (భిక్షాపాత్ర) లో తిన వచ్చు. కానీ, నీవు వీటిని వదలి, తిన్న డిచ్చిన ఎంగిలి మాంసం తిన్నావు. ఇదేమైనా తగునా?

విశేషం:
శంకరుడి భక్తవశంకర లక్షణం ఇందులో కీర్తించబడింది. అన్నీ తన దగ్గర ఉన్నా, తిన్న డిచ్చిన ఎంగిలి మాంసాన్ని తినటం భక్తులని అనుగ్రహించే లక్షణానికి నిదర్శనం మాత్రమే. భక్తులు ఏ విధంగా భావించి, ఏ విధంగా పూజించినా పరమాత్ముడు స్వీకరిస్తాడు. శివుడికి భక్తి ప్రధానం కాని, తదితర అంశాలు కావు అనితిన్నడి కథ నిరూపిస్తుంది. ఎటువంటిది ఇచ్చినా భగవంతుడు స్వీకరిస్తాడు కనుక భగవంతుడికి అర్పించటంలో భక్తుడు ఎంత జాగ్రత్త వహించాలో అర్థం చేసుకోవలసి ఉంది.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement