19. నీ రూపంబుదలంపగా( దుదమొదల్నే గాన, నీ వైననున్
రారమ్మని యంచుజెప్పవు,వృథారంభంబులింకేటికిన్
నీరన్ముంపుము, పాల ముంపు మిక నిన్నే నమ్మి నాడంజుమీ
శ్రీరామార్చితపాదపద్మయుగళాశ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీరామ – అర్చిత – శ్రీ రాముని చేతపూజింపబడిన,పాదపద్మయుగళా – పద్మముల వంటి పాదముల జంట కలిగినవాడా, శ్రీకాళహస్తీశ్వరా!నేన్ – నేను, నీ రూపంబు – నీ స్వరూపమును, తలంపగాన్ – ఊహించుటకైనను, తుద,మొదల్ – చివర ఏదో, మొదలు ఏదో, కానన్ – ఎరుగను,నీవు – ఐ – నీఅంతటనీవుగా, ననున్ – నన్ను, రా రమ్ము – అని – రమ్ము, రమ్ము అని, అంచున్ – అంటూ, చెప్పవు – పిలువవు, వృథా – ఆరంభంబులు్స పనికి రాని ఈ ప్రయత్నాలు, ఇంక – ఏటికిన్ – ఇక ఎందులకు?, నీరన్ – నీళ్ళలో, ముంపుము – ముంచుము, (ముంచుతావో), పాలన్ – పాలలో, ముంపుము – ముంచుము (ముంచుతావో), ఇక – ఇక పైన, నిన్ను – ఏ – నిన్ను మాత్రమే, నమ్మినాడన్ – నమ్మి ఉన్నాను. చుమీ – సుమా.
తాత్పర్యం:
శ్రీరాముని చేత పూజింపబడినపాదపద్మములజంటగలిగినశ్రీకాళహస్తీశ్వరా! నీ రూపము ఇటువంటిది అని ఊహించటానికైనా తుద మొదలు నాకు తెలియదు. (ఆదిమధ్యాంతరహితుడు) పోనీ, నాకు ఎఱుక లేదు కదా,అని నీ వైనా నన్ను ఆప్యాయంగా చేర రమ్మని పిలువవు. పనికిరాని ప్రయత్నాలు (చేతకానివి) చెయ్యటం అనవసరం. నీట ముంచినా, పాల ముంచినా నీదే భారము. నిన్నే నమ్ముకొని ఉన్నాను.
విశేషం:
బ్రహ్మ విష్ణువులు ఆధిపత్యానికై తగవులాడుతున్నప్పుడు పరమశివుడు లింగాకారంగా ఉద్భవించి, తన మొదలు,తుదతెలుసుకున్నవారే గెలిచి నట్లుఅనగా, బ్రహ్మ శిరస్సు వైపు, విష్ణువు మూలం వైపు బయలుదేరి వెళ్ళి,అంతు తేలక తిరిగి వస్తారు. సృష్టిలో మొదటి జీవుడైన బ్రహ్మ,స్థితికారకుడైన విష్ణువు తెలుసుకోలేక పోయామంటే వారిని అనుగ్రహించి లింగం నుండి శివుడు వ్యక్తమయ్యాడు. మానవుడు చేసే ప్రయత్నాలు కూడా బ్రహ్మవిష్ణువుల ప్రయత్నాల వలె వృథలే. వారిని అనుగ్రహించినట్లే తనను తనను కూడ అనుగ్రహించమని, దానికి హేతువు తన నమ్మకమే నని, ధూర్జటి వాదం.
జీవుడి ప్రయత్నం కన్న పరమాత్ముడి అనుగ్రహమే మోక్షదాయక మనే శరణాగతి ఈ పద్యంలో మనకి కనపడుతుంది.
శ్రీ రామచంద్రుడి చేత పూజించబడిన రామలింగేశ్వరుడిగూర్చిన సూచన ఉంది.
శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 19
Advertisement
తాజా వార్తలు
Advertisement