Tuesday, November 26, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 17

17. రాలన్రువ్వగజేతులాడవు, కుమారా, రమ్ము రమ్మంచు నే
జాలన్జంపంగ,నేత్రముల్దివియగాశక్తుండ నే గాను, నా
శీలం బేమని చెప్పనున్న దిక నీ చిత్తంబు నా భాగ్యమో
శ్రీలక్ష్మీపతిసేవితాంఘ్రియుగళా,శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, ఓ శ్రీలక్ష్మీపతి – శుభప్రదుడైన లక్ష్మీదేవికి భర్త అయిన విష్ణువు చేత, సేవిత – పూజింపబడు, అంఘ్రియుగళా – పాదముల జంట కలవాడా,రాలన్ – రాళ్ళను, రువ్వగన్ – విసరుటకు, చేతులు – ఆడవు – చేతులు రావటం లేదు,నేన్ – నేను, కుమారా – కొడుకా, రమ్ము రమ్ముఅంచున్ – రా రమ్మని పిలిచి, చంపగ – చంపుటకు, చాలన్ – సరిపోను. నేన్ – నేను, నేత్రముల్ – కన్నులు, తివియగాన్ – పెరికి కొనుటకు, శక్తుండన్ – సమర్థుడను, కాన్ – కాను. నా శీలంబు – నా ప్రవర్తన, నా చరిత్రము, ఏమి – అని – ఎట్టిదని, చెప్పను – చెప్పగలను?, ఉన్నది – ఉన్నటువంటిది, నీ చిత్తము – నీ ఇష్టము, ఇక – ఆ పైన, నా భాగ్యము – నా అదృష్టము.

తాత్పర్యం
సంపదలకు అధినాయిక అయిన లక్ష్మీదేవికి భర్త అయిన శ్రీమహావిష్ణువు చేత పూజింపబడుపాదపద్మములు గలశ్రీకాళహస్తీశ్వరా! నీ పై పూలకు మారుగా రాళ్ళు రువ్వుటకు నేను సమర్థుడనుకాను. కుమారుని రమ్మని ప్రేమగా పిలిచి చంపలేను. కన్నులు పెరికి ఇచ్చుటకు శక్తి లేదు. నా స్వభావము ( భక్తి) ఇది. గొప్పదని ఏమి చెప్పగలను? ఇక ఉన్నది – అనగాఆశపడుటకున్న అవకాశము నీకు గల దయాగుణము, నేను చేసుకున్న పుణ్యము. అనగా తాను అశక్తుడైనా భగవంతుడు తనను అనుగ్రహించటానికి ఆయన దయాగుణం మాత్రమే కారణం అని భావం.

విశేషం:
పరమేశ్వరుడిపై రాళ్ళు రువ్వినది ఒక కిరాతుడు. అజ్ఞాని అయిన ఒక కిరాతుడు పూజాసమయానికి పూలు లేవని, అందుబాటులో ఉన్న రాళ్ళు విసరి పూజని పూర్తిచేశాడు. అంతే కాదు,పాము కూడా శ్రీకాళహస్తీశ్వరునినాగమణులతో పూజిస్తే ఏనుగ అవి రాళ్ళుఅని తలచింది కదా!
జంగమదేవరపాశుపతదీక్షాపారణకొఱకుచిఱుతొండనంబి తన కుమారుడు సిరియాలుణ్ణి వండిపెట్టిన కథ కూడా సూచితం. అయితే కొన్ని గ్రంథముల ననుసరించి కుమారుణ్ణి వండిపెట్టిన తండ్రి పేరు సిరియాళుడు.
కన్నులు పెఱికి ఇచ్చి కన్నప్ప అయినవాడు తిన్నడు. ఈ మూడు కథలలోని భక్తులకు భక్తి తప్ప మఱొక్కటి తెలియదు. లౌకికజీవనము, నాగరకత, మొదలైన విషయములతో కలుషితము కాని అనన్యభక్తి వారిది. నాగరకులైన నరులకు అట్టి ఏకాగ్రభక్తి ఉండటం కష్టం. అయినా భయం లేదు. ఎందుకంటే, పరమశివుడు దయాళుడు.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి


Advertisement

తాజా వార్తలు

Advertisement