Friday, November 22, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 61

61.అంతా సంశయమే శరీరఘటనం బంతా విచారంబె లో
నంతా దుఃఖపరంపరాన్వితమే, మేనంతా భయభ్రాంతమే
యంతా నాంత శరీరశోషణమే దుర్వ్యాపారమే దేహికిన్
చింతన్నిన్ను దలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:శ్రీకాళహస్తీశ్వరా!, దేహికిన్ = శరీరధారికి, అంతా = అంతయు, (ప్రతివిషయంలో), సంశయము+ ఏ = సందేహమే, శరీరఘటనంబు = శరీరస్థితి, శరీరపు కూర్పు, అంతా = అంతయు, విచారంబు + ఎ = ఆలోచించ దగినదే (నిశ్చయంగా చెప్పటానికి వీలు లేనిది), లోన + అంతా = మనసు నందంతా, దుఃఖ = శోకాల, పరంపర + అన్వితము + ఏ = వరుసలతో కూడుకొన్నదే , మేను = శరీరం, అంతా = అంతయు, భయభ్రాంతము + ఏ = భయముతో, భ్రమతో నిండినదే, అంతా = ఈ సంసారం (లోకవర్తనం), న + అంత = అంతం లేని, శరీరశోషణము + ఎ = దేహపీడయే, దుర్వ్యాపారము + ఏ = చెడ్డపనులు చేయటమే, నరుల్ = మానవులు, చింతన్ = భావనలో, (చిత్తము నందు), నిన్ను = నిన్ను (శివుణ్ణి),తలంచి = ధ్యానించి, పొందరు = చేరుకోరు.
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! శరీరధారి అయిన జీవుడికి ప్రతివిషయం కూడా సంశయమే. (ఇది ఇటువంటిది అని గట్టిగా చెప్పటానికి వీలు లేదు) శరీరం యొక్క కూర్పు అంతా ఆలోచించ దగినదే. ( ఎంత కాలం ఉంటుందో ఎవ్వరు చెప్పలేరు కదా!) మనసంతా దుఃఖాల పరంపరలే. (దారాపుత్రాదుల సంబంధాల వల్ల దుఃఖమే తప్ప మరేమీ లేదుకదా!) శరీరం ఎప్పుడు రోగాదుల కారణంగా భయంతో కూడుకున్నదే. ఏ పని చేసినా అంతులేని దేహపీడయే, చెడుపనులు చేయటమే. అన్ని తెలిసి కూడా, మానవులు ఎందుకనో చిత్తంలో నిన్ను తలచి, నిన్ను చేరుకోరు.
విశేషం:ఈ పద్యం కూడా మానవుల అజ్ఞానానికి వెత చెందుతూ చెప్పినదే. శరీరధారి శరీరం, సంబంధాలు అన్నీ అశాశ్వతా లని తెలిసి కూడా దుర్వ్యాపారం చేస్తాడని జాలి పడతాడు కవి.
దుర్వ్యాపారాలు:భగవంతుణ్ణి చేరటానికి చేసే పనులన్నీ సద్వ్యాపారాలు లేక పుణ్యకార్యాలు. అవి కాక బ్రతుకుతెరువు కోసం ఇతరులని బాధించే పనులన్నీ, భగవంతుడి ధ్యాస లేని పనులన్నీ దుర్వ్యాపారాలు. ఇవన్నీ కర్మబంధాలు కలిగించి, పునర్జన్మలకి కారకాలవుతాయి కనుక ఇవి దుర్వ్యాపారాలు.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement