Saturday, November 23, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 60

60
రతిరాజుద్ధతిమీఱ నొక్క మఱి గోరా జాశ్వునిన్నొత్త బో
నత డా దర్పకు వేగ నొత్తగవయం బా( బోతునుందాకి యు
గ్రత(బోరాడగనున్న యన్నడిమి లేగ ల్వోలెశోకానల
స్థితి పాలై మొఱవెట్టినన్మనుపవేశ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, ఒక్కమఱి = ఒక్కమారు, రతిరాజు = రతీపతి అయిన మన్మథుడు, ఉద్ధతిమీరన్ = గర్వం అతిశయించగా, గోరాజ + అశ్వున్ = వృషభ వాహనుడవైన, నిన్ను = నిన్ను (శివుని), ఒత్తన్ + పోన్ = తాకటానికి ప్రయత్నం చేయగా, అతడు = నీ వాహనమైన నందీశ్వరుడు (శివుడని కూడా చెప్పవచ్చు), ఆ దర్పకున్ + ఆ మన్మథుణ్ణి, వేగన్ + ఒత్తన్ = వేగంగా ఎదుర్కుంటే, గవయంబు = ఆవు, ఆబోతున్ = ఆబోతుని,తాకి = ఎదుర్కొని, ఉగ్రతన్ =తీవ్రంగా, పోరాడగన్ + ఉన్న = పోరాడటానికి సిద్ధంగా ఉండగా, ఆ నడిమిన్ = వాటి మధ్యలో ఉన్న, లేగల్ + పోలెన్ = దూడల వలె, శోక+ అనల స్థితి పాలు + ఐ = శోకాగ్నికి లోనై, మొఱ + పెట్టినన్ = ప్రార్థించగా, మనుపవు + ఏ = రక్షించలేదా? (నన్ను రక్షించవా? లేదా దేవతలను రక్షించ లేదా?)

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! ఒక్కమారు మన్మథుడు గర్వం అతిశయించి, వృషభవాహనుడవైన నిన్ను యుద్ధంలో జయించటానికి ప్రయత్నం చేస్తే, నీ వాహనమైన నంది అతణ్ణి ఎదుర్కొన్నాడు. అపుడు దేవతల పరిస్థితి ఆవు, ఎద్దు తీవ్రంగా పోరాడుతుంటే వాటి మధ్య నలిగి పోతున్న లేగదూడల వలె అయి, శోకాగ్ని పాలయితే వారిని రక్షించ లేదా?( రక్షించావు కదా!నన్ను కూడా రక్షించ లేవా? అని భావం)

విశేషం:
రాక్షసులతో ఓడిపోయిన దేవతలు తమ ఓటమికి సేనానాయకుడు లేకపోవటమే కారణమని, తమకు సేనానాయకుడుగా శివుడి అంశతోజన్మించినవాడేకావాలని తెలుసుకున్నారు. దక్షయజ్ఞానంతరంసతీవిరహంతోతపోదీక్షలో ఉన్నాడు శివుడా సమయంలో. సతీదేవి హిమవంతుడికి కుమార్తెగా జన్మించి నట్లు తెలుసు. వారి వివాహం జరిగితే వారి కుమారుడు సేనానాయకుడౌతాడు. ఈ సంగతి తెలుసుకున్న ఇంద్రుడు మన్మథుడి సహాయం కోరాడు. రాజే నన్ను కోరాడు అనే గర్వంతో శివుడు తపస్సు చేస్తున్న హిమవత్పర్వతసానువులకు వెళ్ళాడు మన్మథుడు. అతడి స్నేహితుడు వసంతుడు వెంట వెళ్ళాడు. పార్వతి శివుణ్ణి అర్చించటానికి వచ్చిన సమయం చూసి, మన్మథుడు పూలబాణం తీశాడు. అకాలవసంతాన్ని చూసిన నంది కన్నెఱ్ఱ చేస్తే ప్రకృతి స్థంభించింది. మన్మథుడు మాత్రం పూ బాణం వేయనే వేశాడు. చంద్రోదయ సమయంలో సముద్రం లాగా శివుడి మనస్సు చలించింది. కారణ మేమా? అని చూశాడు. చూపు పడటం మన్మథుడి శరీరం బూడిదగా మిగలటం ఒక్కసారే జరిగాయి. రతీదేవి విలపిస్తే ఆమెకు మాత్రం మన్మథుడు సశరీరంగా దర్శన మిస్తాడనే వరం ప్రసాదించటం, పార్వతి తపస్సు చేసి అపర్ణ కావటం, పరీక్షించిన పిదప వివాహం చేసుకోవటం తరవాత జరిగిన అంశాలు. వారి పుత్రుడు కుమారస్వామియేదేవసేనాపతియై తారకాసుర సంహారం చేశాడు. మన్మథుడు, శివుడి వాహనమైన నంది(లేక శివుడు) ఒకరి నొకరు ఎదుర్కొంటూ ఉంటే ఆవు ఎద్దు పోరాడుతున్నట్టు ఉన్నాయట. దేవతలు లేగదూడల లాగా భయపడి పోయారట! నంది హుంకరిస్తే ప్రకృతి అంతా స్తంభించి బొమ్మలాగా అవటం భయం వల్లనే కదా! యుద్ధం నందికి మన్మథుడికి అయితే కొయ్యబారింది ప్రకృతి. పార్వతీపరమేశ్వరుల వివాహం అయింది కాని, ముందుగా భర్తని కోల్పోయింది రతీదేవి. అంతకు ముందే రాక్షసుల చేతిలో ఓడిపోయి శోకతప్త మయిందిదేవతాగణం. వారందరూప్రార్థించగా అందరను రక్షించావు కదా! వరంతో రతీదేవికి, కుమార జననంతో దేవతలకి సంతోషం కలిగించావు. అటువంటి వాడివిమమ్ములను రక్షించ లేవా? రక్షించ గలవుఅని నమ్మకం.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement