Tuesday, November 26, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 56

  1. సులభుల్, మూర్ఖులు, నుత్తమోత్తములురాజుల్కల్గియేవేళ న
    న్నలతంబెట్టిన నీ పదాబ్జముల( బాయ జాల, నే మిచ్చినం
    గల ధౌతాచలమేలుటంబునిధిలో( గాపుండుటబ్జంబుపై(
    జెలువొప్పన్సుఖియింప( గాంచుటసుమీ! శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, సులభుల్ = తేలికగా అనుగ్రహించే వారు, మూర్ఖులు = మూఢులు, ఉత్తమ + ఉత్తములు = చాల ఉత్తమమైన స్వభావం కలిగిన వారు అయిన, రాజుల్ = రాజులు, కల్గి= ఉండి, ఏ వేళన్ = ఎప్పుడైనా, నన్ను =నన్ను, అలతన్ + పెట్టినన్ = బాధించి నట్లైతే, నీ పదాబ్జములన్ = నీ పాదపద్మాలని, పాయన్ + చాలన్ = విడువలేను, నీవు = నీవు, ఏమి + ఇచ్చినన్ = ఏం ప్రసాదించినా, ధౌత + అచలము + ఏలుట = వెండికొండని పాలించటం గాను, (శివపదవి గాను), అంబునిధిలోన్ = సముద్రంలో, కాపు + ఉండుట = కాపుర ముండటం గాను, (విష్ణుపదవి గాను), అబ్జంబుపైన్ = పద్మం మీద, చెలువు + ఒప్పన్ = అందగించగా , సుఖియింపన్ + కాంచుట = సుఖపడటం గాను, (బ్రహ్మపదవిగాను) సుమీ = భావిస్తాను సుమా!

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! తేలికగా అనుగ్రహించేవారు అయినా, మూఢులు అయినా, చాలా ఉత్తమస్వభావం కలిగినవారు అయినా, రాజులు నన్నెపుడైనా బాధ పెట్టినా గాని, నీ పాదాలు మాత్రం వదలను. నీవు నా కే మాత్రమిచ్చినా అదే శివపదం గాను, విష్ణుపదం గాను, బ్రహ్మపదం గాను భావిస్తాను.

విశేషం:
రాజులలో భేదాలు చెప్పాడు ధూర్జటి ఈ పద్యంలో. త్వరగా అనుగ్రహించేవారు ఉత్తములు, మధ్యములు, వినిపించుకోని మూర్ఖులు అధములు. అడగకుండానే ఆదరించేవారు ఉత్తమోత్తములు.వారెటువంటి వారైనా వారి కోసం నీ పాదసేవ వదలను. వారు కించపరిస్తే వారినే వదులుతాను అన్న ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నాడు ధూర్జటి. తనని ఆదరించిన శ్రీకృష్ణదేవరాయలు శ్రీవైష్ణవమతాభిమాని అయినా, తాను మాత్రం పరమమాహేశ్వరుడిగానే మిగిలిపోయాడు. శివుడు తనకేం ప్రసాదించినా అది త్రిమూర్తులకిచ్చిన పదవి వంటిది గానే భావిస్తా నన్నాడు. అంటే, పరమశివుడు త్రిమూర్తుల కన్న పరుడైనఅద్వితీయుడైన పరంబ్రహ్మ, అనాది, సనాతనుడు అని ధూర్జటి దర్శనం.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement