Saturday, November 23, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 15

15. నిన్నే రూపముగా భజింతు మదిలో, నీ రూపు మోకాలో? స్త్రీ
చన్నో?కుంచమో? మేక పెంటికయో? యీ సందేహముల్మాన్పి నా
కన్నారన్ భవదీయ మూర్తి సగుణాకారంబుగా( జూపవే
చిన్నేరేజ విహార మత్త మధుపా! శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
చిత్ – జ్ఞానపూర్ణమైన హృదయము అనే (శుద్ద జ్ఞానము, చిత్తము),నీరేజ – పద్మము నందు, విహార – విహరించు,మత్తమధుపా – మదించిన తుమ్మెదా! శ్రీకాళహస్తీశ్వరా! మదిలో – మనస్సులో, నిన్ను – నిన్ను, ఏ రూపముగా – ఏ రూపం కలిగిన వాడవని, భజింతున్ – సేవించ గలను? నీ రూపు – నీ ఆకృతి, మోకాలు – ఓ – మోకాలా?, స్త్రీ చన్ను – ఓ – స్త్రీ కుచమా?, కుంచము – ఓ – కొలపాత్రయా?, మేక పెంటిక – ఓ – మేక పెంటికయా?ఈ సందేహముల్ – ఈ అనుమానాలను,మాన్పి – పోగొట్టి, భవదీయ మూర్తిన్ – నీ స్వరూపాన్ని,సగుణ – ఆకారంబుగాన్ – త్రిగుణాత్మకమైన రూపంగా, నా కన్నారన్ – నా కంటి నిండుగా, చూపవు – ఏ – చూపవలసినది.

తాత్పర్యం:
జ్ఞానపూర్ణమైనహృదయపద్మంలో విహారం చేసే మదించిన తుమ్మెద వంటి శ్రీకాళహస్తీశ్వరా! నీ రూప మేదియని ధ్యానం చేయ గలను? మోకాలా? స్త్రీ కుచమా?మేకపెంటికయా? నా యీ సందేహాన్ని పోగొట్టి, నీ సగుణరూపాన్ని నాకు చూపించవా? ( చూపించమని ప్రార్థన).

విశేషం:
(శ్రీకాళహస్తీశ్వరుడు) శివుడు అవ్యక్తుడు. నిర్గుణుడు. సర్వవ్యాపి. రూపాతీతుడు. అటువంటి వాడిని ధ్యానించటం ఎట్లా? భక్తుడు సేవించటానికి ఒక రూపం ఆలంబనగా ఉంటే సాధనకు సుకరంగా ఉంటుంది. అందుకొఱకే సదాశివుడు లింగాకారాన్ని ధరించాడు. తరువాత అనేకరూపాల్లోఅనేకమందికి దర్శనభాగ్యాన్ని కలిగించి కరుణించాడు. నిర్గుణ పరబ్రహ్మనిచేరుకొనటానికిసగుణరూపారాధన సహకరిస్తుంది. అట్టి సగుణరూపంఎటువంటిదో దానిని తనకు చూపించ మని గడుసుగా ప్రార్థించాడు ధూర్జటి.
పూర్వగాథలు:
1 మోకాలు: శివుణ్ణి అర్చించటానికి వెడుతున్న అర్జునుడితో శ్రీకృష్ణుడు “శివార్చనకి ఆలయానికే వెళ్ళ వలెనా?”అని ప్రశ్నించి, తన మోకాలిని చూపించి “ ఇది శివలింగముగా కనపడుట లేదా?”అనిప్రశ్నించాడట. అర్జునుడికి జ్ఞానోదయమై శ్రీకృష్ణుడి మోకాలినే శివలింగంగా భావించి పూజించాడట!
2 కుచం: ఒక శివరాత్రినాడు వేశ్య ఇంట నున్న ఒక శివభక్తుడులింగోద్భవ కాలం సమీపించగానే, తన మిత్రుడి వలె కాశీవిశ్వనాథుణ్ణి దర్శించ లేక పోయానే అని బాధపడుతూ ఉండగా,ఆ వేశ్య కుచము అతడికి శివలిగం లాగా గోచరించిందిట. వెంటనే అతడు భక్త్యావేశంతో ఆ స్తనానికి శివలింగానికి లాగా పూజలు చేశాడు. అపుడు శివుడు ప్రత్యక్షమై వారిద్దరికి మోక్షాన్ని ప్రసాదించాడట“ ఆచంటేశ్వరుడు” గా వెలిశాడు. ఈ కథని వేశ్యాలోలుడైన రాజు పరంగా కూడా చెప్పటం కద్దు.
3. కుంచం: నిత్యశివపూజాదురంధరుడైనఒక వర్తకుడు ఒకనాడు పూజాసమయానికి పొరుగూళ్ళో ఉండిపోయాడు. అతడు బోర్లించి ఉన్న కుంచమునే శివలింగంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించగనే ఆ కుంచం శివలింగంగా అయిపోయింది.అతడే “ కుంచేశ్వరుడు”.
మేకపెంటి: ఒక గొల్లవాడు తాను పూజించటానికి ఒక శివలింగం లేదని బాధపడుతుండగా ఒక ముని “ ఎందుకు విచారించెదవు?మేకపెంటికనే శివుడుగా భావించి పూజింపు” మనగా అతడట్లు చేసి శివలోకాన్ని పొందాడు. ఆ గొల్లవాడి పేరు కోటయ్య. అతడి పేరు మీదగాఅచటి శివుడు “ కోటేశ్వరుడు” అని పిలవబడతాడు.
నిర్గుణుడైన శివుడు ఇన్ని రూపాలలో భక్తుల ననుగ్రహించటానికి వ్యక్తం అయినాడు. తన కోసం కూడా ఒక రూపాన్ని ధరించి కనపడటం ఆయనకి ఒక పెద్ద విషయం కాదని భావం.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement