Saturday, November 23, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 51

  1. ఏ లీల న్నుతియింప వచ్చు నుపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శ
    బ్దాలంకార విశేష భాషల కలభ్యంబైన నీ రూపమున్
    జాలుం జాలు( గవిత్వముల్నిలుచునేసత్యంబువర్ణించుచో
    ఛీ! లజ్జింపరు గాక మాదృశ కవుల్శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా! ఉపమ + ఉత్ప్రేక్షా = ఉపమ, ఉత్ప్రేక్ష మొదలైనఅర్థాలంకారాలతోనూ, ధ్వని + వ్యంగ్య = ధ్వని, వ్యంగ్యం మొదలైన శబ్ద శక్తులతోనూ, శబ్దాలంకార = అనుప్రాసాదిశబ్దాలంకారాలతోను కూడిన, విశేష భాషలకు = విశిష్టమైన, ప్రత్యేకమైన కావ్యభాషలకు, అలభ్యంబైన = అందని, నీ రూపమున్ = నీ స్వరూపాన్ని, ఏ లీలన్ = ఏ విధంగా, నుతియింపవచ్చున్ = కీర్తించటానికి వీలవుతుంది?, చాలున్ + చాలున్ = చాలు చాలు/ సరి సరి, ఛీ! = ధిక్!, మాదృశకవుల్ = మా వంటి కవులు, లజ్జింపరు + కాక = సిగ్గుపడరు కదా!, సత్యంబు = సత్యమైన భగవత్స్వరూపాన్ని, వర్ణించుచోన్ = వర్ణించటానికి, కవిత్వముల్ = కవితలు, నిలుచును + ఏ = సరిపోతాయా?

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! ఉపమ, ఉత్ప్రేక్ష మొదలైన అర్థాలంకారాలతోనూ, ధ్వని, వ్యంగ్యం మొదలైన శబ్దశక్తులతోను, ఈ శక్తులతో కూడి ఉన్న అనుప్రాసాదిశబ్దాలంకారాలతోను నిండి ఉన్న విశిష్టమైన కావ్యభాషలకి అందని నీ స్వరూపాన్ని ఏ విధంగా కీర్తించగలం? తమ అశక్తతకి మా వంటి కవులు సిగ్గుపడరు. సరి! సరి! సత్యస్వరూపమైన, పరబ్రహ్మమైన నిన్ను వర్ణించటానికి కవిత్వం సరిపోతుందా? సరిపోదు అని భావం.

విశేషం:
ఇంతకు ముందు పద్యంలో మామూలు పూజ కాక కవితార్చన చేస్తాను అన్నాడు ధూర్జటి. వెంటనే దాని పరిమితి అర్థ మయింది. కవిత్వంలో తానెంతతెలుసుకోగలిగాడో, ఎంత చూడగలిగాడో అంత మాత్రమే వర్ణించగలడు. అది పరమాత్మ పరిపూర్ణస్వరూపం కాదు కదా! మామూలు భాష కన్న కవిత్వభాషకి శక్తి అధికం. ఆ సాహిత్యభాష కూడా ‘సత్’ (సత్ + చిత్ + ఆనందస్వరూపుడు పరమాత్మ)స్వరూపుడైన పరమశివుణ్ణి వర్ణించటానికి చాలదు. ఎందుకంటే, భగవత్తత్త్వంఅనుభవైకవేద్యం. వర్ణించటం మొదలు పెట్టగానే అనుభూతి దూరమవుతుంది. అయినా, చాకచక్యంతో మా వంటి కవులు విఫలప్రయత్నం చేస్తారు. కవిత్వం మొదలైన లలితకళలన్ని పరమాత్ముణ్ణి చేరుకునే మార్గాన్ని చూపిస్తాయి. మార్గం కూడా అవుతాయి. అవి గమ్యం కావు. గమ్యానికి చేరాక గమనం, మార్గం, నడిచేవాడు అనే మూడు గమ్యం అయిపోతాయి. నడిచి, చూసినవాడు కూడా చూడబడిన వస్తువులో కలిసిపోయాక చెప్పే వారెవరుంటారు? చెప్పటానికేముంటుంది?

Advertisement

తాజా వార్తలు

Advertisement