Saturday, November 23, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 49

  1. మలభూయిష్ఠమనోజధామముసుషుమ్నాద్వారమో! యారుకుం
    డలియో! పాదకరాక్షి యుగ్మములు షట్కంజంబులో! మోము తా
    జలజంబో! నిటలంబుచంద్రకళయో! సంగంబుయోగంబొ! గా
    సిలిసేవింతురుకాంతలన్ భువి జనుల్శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, మలభూయిష్ఠ = మలంతో కూడిన, మనోజ ధామము = మర్మాంగం, సుషుమ్నాద్వారము + ఓ = సుషుమ్నానాడికి ప్రవేశ స్థానమైన మూలాధార చక్రమా? (కాదు కదా!), ఆరు = నూగారు, కుండలి +ఓ = కుండలినీశక్తియా (కాదు కదా!), పాద + కర+ అక్షి +యుగ్మములు = కాళ్ళు, చేతులు, కళ్ళ జంటలు, షట్ + కంజంబులు + ఓ = ఆరు పద్మాలా? (మూలాధారాది చక్రాలు కావు కదా!), మోము = ముఖం, తాన్ = తాను, జలజంబు + ఓ = పద్మమా? (సహస్రారచక్రం కాదు కదా!), నిటలంబు = నుదురు, చంద్రకళ + ఓ = చంద్రకళయా?(నిత్యా మొదలైన దేవతల స్వరూపం కాదు కదా!), సంగంబు = కలయిక, యోగంబు + ఓ = యోగసిద్ధియా? (కాదే), భువి = లోకంలో, జనుల్ = మానవులు, గాసిలి = ఎంతో కష్టపడి, కాంతలన్ = స్త్రీలని, సేవింతురు = కొలుస్తూ ఉంటారు? ( తెలియటం లేదని భావం)

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! లోకంలో మానవులు ఎంతో శ్రమకోర్చి మరీ స్త్రీలను సేవిస్తూ ఉంటారు. (స్త్రీసాంగత్యం కోసం ప్రయాస పడుతూ ఉంటారు) మలభూయిష్ఠ మైన స్త్రీమర్మాంగంసుషుమ్నానాడికి ప్రవేశద్వారమైన మూలాధారం కాదు కదా! నూగారుకుండలినీశక్తి కాదు కదా! కాళ్ళు, చేతులు, కళ్ళు మూలాధారాది ఆరు చక్రాలు కావు కదా! ముఖం సహస్రార చక్రం కాదే! నుదురు చంద్రకళ కాదే! స్త్రీ సంగమం యోగసిద్ధి కాదు. (మరెందుకు ఈ తాపత్రయం అని భావం).

విశేషం:
ఒక భక్తుడు కాని, సాధకుడు కాని కోరేది యోగసిద్ధి. యోగం అంటే కలయిక. ఆ కలయిక జీవాత్మ పరమాత్మలది కాని, స్త్రీపురుషులది కాదు. యోగసిద్ధికి ప్రారంభం మూలాధారంలో ఉంది. అది వెన్నెముక చివరిపూస వద్ద ఉంటుంది. అక్కడ కుండలినీశక్తి మూడున్నర చుట్టలు చుట్టుకున్న పాము రూపంతో నిద్రావస్థలో ఉంటుంది. యోగసాధన, అనన్య భక్తిపారవశ్యం, లేదా భగవత్కృప కారణంగా కుండలినీశక్తిఉద్బుద్ధమై వెన్నెముక నంటిఉండే ఇడాపింగళల మధ్య ఉన్న సుషుమ్నామార్గానమెఱుపుతీగ లాగా బ్రహ్మరంధ్రం సమీపంలో ఉన్న సహస్రారాన్ని చేరుకుంటుంది. దారిలో అధిగమించ వలసిన ఆరు స్థాయులు షట్చక్రాలు. వీటినే పద్మాలు అంటారు. అవి – మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ. ఇవి దాటితే గమ్యమైన సహస్రారమ్. (వీటి వివరాలు లలితారహస్యనామసాహస్రం లోనూ, ఆదిశంకరులసౌందర్యలహరి మొదలైన గ్రంథాల లోనూ సమగ్రంగా లభిస్తాయి.) యోగసిద్ధికి తోడ్పడే ఆరుపద్మాలు ఇవి. అంతే కాని, కవులు, ప్రియులు పద్మాలుగా వర్ణించే స్త్రీల పాదాలు, చేతులు, కళ్ళు కావు. (పాద పద్మాలు, కరాబ్జాలు, పద్మాక్షి వంటివి కవుల కల్పనలు మాత్రమే. అసలు పద్మాలు అవి కావు అని కవి భావన.)
స్త్రీల నుదుటిని చంద్రుడితో పోల్చుతూ ఉంటారు కవులు. ఆ వర్ణన సౌందర్యపరమావధి అయిన పార్వతీదేవికి మాత్రమే చెల్లుతుంది. ( అష్టమీచంద్రవిభ్రాజదళిక స్థల శోభిత) ఎందుకంటే అష్టమి నాటి చంద్రుడి భౌతికరూపమే కాక తత్త్వం కూడా సరిపోతుంది కనుక. లలితాదేవి ‘చంద్రరూప’. ‘ చంద్రవిద్య’ ను ప్రసాదించింది. దీనికి సంకేతంగానే శివుడు చంద్రకళని శిరసునధరించాడు. సాధించవలసినవి ఇవి అయి ఉండగా సామాన్య మానవులు, వాటిని స్త్రీ పరంగా అన్వయించుకుంటున్నారేమా? అని ధూర్జటి వేదన.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement