Thursday, November 21, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 46

  1. లేవోకానల( గందమూలఫలముల్, లేవోగుహల్, తోయముల్
    లేవోయేఱుల, బల్లవాస్తరణముల్లేవో; సదా యాత్మలో
    లేవో నీవు విరక్తులన్మనుప, జాలిం బొంది భూపాలురన్
    సేవల్చేయగ( బోదురేలకొజనుల్శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీ కాళహస్తీశ్వరా! కానలన్ = అడవులలో, కంద + మూల + ఫలముల్ = దుంపలు, మూలాలు, పండ్లు, లేవు + ఓ = లేవా?, గుహలు = సహజంగా ఏర్పడిన కొండగుహలు, లేవు + ఓ = లేవా?, ఏఱుల = వాగులలో, తోయముల్ = నీళ్ళు, లేవు + ఓ = లేవా?,పల్లవ + ఆస్తరణముల్ = చిగుళ్ళతో చేసిన శయ్యలు, లేవు + ఓ = లేవా?, విరక్తులన్ = వైరాగ్యం కలవారిని, మనుపన్ =రక్షించటానికి, సదా = ఎల్లప్పుడు, ఆత్మలో = హృదయంలో, నీవు = నువ్వు, లేవు + ఓ = లేవా?, జాలిన్ + పొంది = దీనస్థితికి లోనై, జనుల్ = మనుషులు, భూపాలురన్ = రాజులను, సేవల్+ చేయగన్ = సేవించటానికి, పోదురు = వెడతారు, ఏలకో? = ఎందుకు? ( తనకు అర్థం కాలేదని భావం)

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!లౌకికజీవితం మీద వైరాగ్యం కలిగితే విరాగులుఅయినవారు ఇతరులపై ఆధార పడకుండా తినటానికి అడవులలో కందమూలఫలాలు, నివసించటానికి మానవనిర్మితం కాక సహజంగా ఏర్పడిన గుహలు, త్రాగటానికి సెలయేళ్లలో తియ్యని నీరు, పరుండటానికి చిగురుటాకుల శయ్యలు, సదా రక్షించి కాపాడటానికి ఆత్మలో నువ్వు ఉన్నావు కదా! అయినా, మానవులు దీనులై రాజులని సేవించ బోవటానికి కారణం తెలియదు.

విశేషం:
భగవంతుడు ప్రకృతి సిద్ధంగా మానవులకు గ్రాసవాసాలకి ఏర్పాటు చేశాడు. ఇవి అనుభవించటానికి దీనుడు కావలసిన పని లేదు. కాని, రాజు నుండి ఆశిస్తున్నప్పుడు మాత్రం మానవుడు తనని తాను చులకన చేసుకోక తప్పదు. హాయిగా విరక్తుడై జీవించ దలచినవాడు జీవనోపాధికి రాజుని ఆశ్రయించాను అనిచెప్పుకోవలసిన పని లేదు.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement