Wednesday, November 20, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 43

  1. చనువారిం గని యేడ్చువారుజము(డా! సత్యంబుగావత్తుమే
    మనుమానం బి(క లేదు నమ్ముమని తా రా వేళ నా రేవునన్
    మునుగంబోవుచు బాస చేయుట సుమీముమ్మాటికింజూడగా(
    జెనటుల్గానరు దీని భావ మిదివోశ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీ కాళహస్తీశ్వరా!చనువారిన్ = చనిపోయిన వారిని, కని = చూచి, ఏడ్చువారు = ఏడ్చేజనులు, తారు = తాము, ఆ వేళన్ = ఆ సమయంలో ( పదవరోజుధర్మోదకాలు ఇచ్చే సమయంలో), ఆ రేవునన్ = ఆ స్నానాల రేవులో, మునుగన్ + పోవుచు = క్రుంకు లేస్తూ, జముడా! = ఓ యముడా!, ఏమున్ = మేము కూడా, సత్యంబుగా = నిక్కంగా, వత్తుము = వస్తాం. ఇక = ఇటుపైన, అనుమానము = సందేహం, శంక, లేదు = లేదు. నమ్ముము = విశ్వసించు, అని = అంటూ, బాస చేయుట = ప్రమాణం చేయటమే, సుమీ = సుమా!, ముమ్మాటికిన్ = మువ్విధంగా ( త్రికరణ శుద్ధిగా), చూడగాన్ = పరిశీలిస్తే, దీని భావము = దీని అర్థం ( ఈ పనుల ఉద్దేశం), ఇది + పో = ఇదే సుమా అని, చెనటుల్ = అవివేకులు, కొనరు = అర్థం చేసుకోరు.

తాత్పర్యం:
శ్రీ కాళహస్తీశ్వరా! చనిపోయినవారిని గూర్చి పదవనాడురేవులో మునుగుతూ (తిలోదకాలు ఇస్తూ) ఏడుస్తారు. బాగా పరిశీలిస్తే అది “ ఓ యముడా! మేము కూడా నిజంగా వస్తాము. అందులో అనుమానం లేదు.” అని వాగ్దానం చేయటమే. అవివేకులు మాత్రం ఈ భావాన్ని గ్రహించ లేరు.

విశేషం:
చావు గురించి మానవుల స్పందనలను స్పష్టంగా ఈ పద్యంలో వర్ణించాడు ధూర్జటి. ఎవరైనా చనిపోయినప్పుడు చూసేవాళ్ళు ఏడవటం, అవతలివారు పోయినందుకు కాదు, ముందు ముందు తమ గతి కూడ ఇంతే కదా! అనే భయంతో అని ఆధునిక మనస్తత్వ శాస్త్రపరిశోధకులు కూడా చెపుతున్న మాట. యముడితో తాము కూడా వస్తాములేఅని చెప్పే సమయంలో బాధ రాక తప్పదు కదా! అందుకనే ఏడవటం జరుగుతుంది. తెలివిగలవారు గుర్తిస్తారు. చూసి కూడా అర్థం తెలుసుకోనివారు మూర్ఖులు.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి

ఇదికూడా చ‌ద‌వండి :శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 42

Advertisement

తాజా వార్తలు

Advertisement