- అమరస్త్రీలరమించినన్జెడదు మొహం బింతయున్బ్రహ్మప
ట్టము సిద్ధించిననాస తీరదు, నిరూఢక్రోధమున్సర్వలో
కములన్ మ్రింగిన మాన దిందుగల సౌఖ్యం బొల్ల, నీ సేవ చే
సి మహాపాతక వారిరాశి(గడతున్శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా! అమరస్త్రీలన్ = దేవతాస్త్రీలని, అప్సరసలని, రమించినన్ = అనుభవించినా కాని, ఇంతయున్ = కొంచెం కూడా, మోహము = స్త్రీవాంఛ, చెడదు = నశించదు. బ్రహ్మపట్టము = బ్రహ్మపదవి, సిద్ధించినన్ = లభించినా కాని, ఆస = ఆశ/ కోరిక, తీరదు = పోదు, సర్వలోకములన్ = అన్నిలోకాలని, మ్రింగినన్ = కబళించి నప్పటికిని, నిరూఢ క్రోధము = బాగా లోతుగా నాటుకున్న కోపం, మానదు = ఆగదు, ఇందు = ఈ లోకంలో, కల = ఉన్నటువంటి, సౌఖ్యంబు = సుఖం, ఒల్లన్ = కోరను, నీ + సేవ + చేసి = నిన్ను సేవించుకొని, మహాపాతక వారిరాశిన్ = మహాపాతకము లనెడి సముద్రాన్ని, కడతున్ = దాటెదను.
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!స్త్రీవ్యామోహం అప్సరసల ననుభవించినా తీరదు. అన్నిటి కన్న ఉన్నతమైన బ్రహ్మపదవి సిద్ధించినా ఆశ అంతం కాదు. అంతరాంతరాలలో లోతుగా నాటుకొని ఉన్న క్రోధం లోకాల నన్నిటినిమ్రింగయినా ఉపశమించదు. అందుచేత ఈ లోకం లోని సౌఖ్యాల నింక నేను కోరను. నీ సేవ చేసి, మహాపాతకాలు అనే సముద్రాన్ని తరిస్తాను.
విశేషం: అరిషడ్వర్గాలలోని వైన కామ, క్రోధ, లోభ, మోహాలను పరితృప్తి చెందించి జయించటం జరగదు. వాటిని నిగ్రహించటం ఒక్కటే మార్గం. నిగ్రహించాలంటే అవి ఎంతో లోతుగా నాటుకొని పోయి ఉన్నాయి. ఎట్లా? నీ సేవ ఒక్కటే దారి. దానివల్ల మహాపాతకసముద్రాన్ని కూడా దాటటం జరుగుతుంది.
శరీరంలో మనస్సు ఒక భాగం. అది ఉన్నంత వరకు మనోవ్యాపారాలు, వాటి రూపాంతరాలు అయిన అరిషడ్వర్గాలు ఉంటాయి. వాటిని అనుకూలంగా మళ్లించటం ఒకటే చేయదగిన పద్ధతి. వాటికి లక్ష్యంగా ఇష్టదైవాన్ని చేసుకుంటే వాటి పని అవి చేసుకుంటూనే మనకి అనుకూలంగా ఉంటాయి. అందుకే వాటిని నిగ్రహించటం మాని నీ సేవ చేసుకుంటాను అని తన నిశ్చయాన్ని వెలిబుచ్చాడు ధూర్జటి. కోపం తాత్కాలికం. క్రోధం అంటే ముదిరిన కోపం. క్రోధం కోపాని కన్న భయంకరమైనది.
పరిహారం చేసుకోవటానికి వీల లేని దుష్కృత్యాలు పాతకాలు. వాటిలో తీవ్రమైనవి మహాపాతకాలు.వాటిని పోగొట్టే మార్గం అనుభవించటం మాత్రమే. శివభక్తుడు వాటిని అనుభవించకుండా దాటి వెళ్లగలడు.