- తనువే నిత్యముగా నొనర్పు, మది లేదా, చచ్చిజన్మింపకుం
డ నుపాయంబుఘటింపు మా గతులు రెంటన్నేర్పు లేకున్న
లేదని నా కిప్పుడ చెప్పు, చేయగల కార్యంబున్నసంసేవ( జే
సి నినుంగాంచెద( గాక కాలముననోశ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం :
శ్రీకాళహస్తీశ్వరా!, తనువు + ఏ = శరీరమే, నిత్యము + కాన్ = శాశ్వతం అయ్యేట్టు, ఒనర్పుము = చేయ వలసినది. అది = ఆ విధంగా, లేదా = కుదరనట్లయితే, చచ్చి = చనిపోయిన తర్వాత, జన్మింపక + ఉండన్ = పుట్ట కుండగ, ఉపాయంబు + ఘటింపుము = ఏర్పాటు చెయ్యవలసినది. ఆ గతులు = ఆ పద్ధతులు, రెంటన్ = రెండింటిలో, నేర్పు = నైపుణ్యం, లేక + ఉన్న= లేనట్లయితే, లేదు + అని = నేర్పు లేదని, నాకు = నాకు, ఇప్పుడు + అ = ఇప్పుడే, చెప్పు= చెప్ప వలసినది. చేయన్ + కల = చేయ గలిగిన, కార్యంబు = పని, ఉన్న = ఉన్నట్లయితే, కాలమునన్ = (తగిన) సమయంలో, చేసి = నిర్వర్తించి, సంసేవన్ = నిన్ను చక్కగా సేవించుకోవటం ద్వారా, నిన్నున్ = నిన్ను, కాంచెదన్ + కాక = దర్శిస్తాను. ( నిన్ను చేరుకుంటాను).
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! శరీరమే శాశ్వతమయ్యేట్టుగా చేయి. లేదా, చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టకుండా చేయి. ఈ రెండు నీ వల్ల కాకుంటే ఆ సంగతి నాకిప్పుడే చెప్పు. నేను చేయగల పని సకాలంలో నిర్వర్తించి, నిన్ను చక్కగా సేవించుకున్న దాని ఫలితంగా నిన్ను దర్శిస్తాను.
విశేషం:
జీవితం అశాశ్వతంఅని, చనిపోయిన జీవి మళ్ళీ జన్మించక తప్పదని అందరికీ తెలుసు. అది సృష్టిధర్మం. దాన్ని తప్పించటం ఒక్క పరమేశ్వరుడికే సాధ్యం. కనుకనే అ శివుణ్ణి ప్రార్థించటం. ఒకవేళ శివుడికి కూడా సాధ్యపడక పోతే, అది శివభక్తుడికి సాధ్య మవుతుంది–శివానుగ్రహం కారణంగా. అది లభ్యం కాక పోయినా భక్తుడు బాధ పడడు. అన్నిటినీ మించింది శివదర్శనం. అది లభిస్తే ఇంకేమీ కోరడు శివభక్తుడు.