Saturday, November 23, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 33


33. ఎన్నేళ్లుండుదు? నేమిగందు?ని(క నేనెవ్వారిరక్షించెదన్
నిన్నే నిష్ఠ భజించెదన్నిరుపమోన్నిద్రాప్రమోదంబు నా
కెన్నండబ్బెడు? నెంతకాల మి(క నేనిట్లున్న నే మయ్యెడిన్?
జిన్నంబుచ్చక నన్ను నేలుకొనవేశ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం :
శ్రీకాళహస్తీశ్వరా! ఎన్ని + ఏళ్లు = ఎన్ని సంవత్సరాలు, ఉండుదున్ = జీవిస్తాను? ఏమి + కందున్ = ఏమి చూస్తాను? ఏ + వారి = ఎవరిని (పుత్రకళత్రాదులని), రక్షించెదన్ = కాపాడగలను?, నిష్ఠన్ = నియమంతో, నిన్ను+ ఏ = నిన్నే, భజించెదన్ = సేవించు కుంటాను. నాకు= నాకు, నిరుపమ = సాటిలేని, ఉన్నిద్రప్రమోదంబు = ధ్యానస్థితిలో లభించే ఆనందం, ఎన్నండు = ఎప్పుడు, అబ్బెడున్ = లభ్యమౌతుంది?, నేను = నేను, ఎంతకాలము = ఎన్నిరోజులు, ఇక = ఇకపైన, ఇట్లు + ఉన్నన్ = ఈ విధంగా ఉన్నా కాని, ఏమి + అయ్యెడిన్ = ఏం జరుగుతుంది?/ ఏం లభిస్తుంది?, నన్నున్ = నన్ను, చిన్నం + పుచ్చన్ = చులకన చేయకుండా, ఏలుకొనవు+ ఏ = పాలింపవా?

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! ఎన్ని సంవత్సరాలు జీవిస్తానో! ఇంకా ఏం చూస్తాను? ఎవ్వరిని నేను రక్షించ గలను? ఎంతో నిష్ఠతో నిన్ను సేవించు కొంటున్న నాకు సమాధిస్థితిలోని ఆనందం ఎప్పుడు లభిస్తుంది? ఈ విధంగా ఎంతకాలం గడిచినా ఏం జరుగుతుంది? నా మనస్సుని చిన్న బుచ్చక నన్ను పాలించు.

విశేషం:
తాను లౌకికజీవితంలో అన్ని చూశాను(అనగాఅనుభవించాను). ఇంకచూడవలసినదేమీ లేదు అంటే తృప్తి చెందాను, లేక విరక్తి చెందానుఅని అర్థం. ఎవరినీ పోషించ వలసిన అవసరం లేదనటంతో కుటుంబ బాధ్యతలు తీరాయని అర్థం. అటువంటి జీవితాన్ని ఎంత గడిపినా ఎదుగు బొదుగు ఉండదు. కనుక సమాధిస్థితిలోని ఆనందాన్ని కలిగించ మని ప్రార్థించాడు.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement