Saturday, November 23, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 14

14. కాయల్గాచెవధూనఖాగ్రాములచే(గాయంబువక్షోజముల్
రాయన్రాపడె రొమ్ము మన్మథ విహార క్లేశ విభ్రాంతి చే
బ్రాయంబాయెను, బట్ట గట్టె(దల,చెప్పనో రోత సంసారమే(
జేయం జాల విరక్తుజేయ( గదవేశ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!కాయంబు – శరీరము,వధూ – స్త్రీల, నఖ్శ అగ్ర – కొనగోళ్ళ చేత,కాయల్ – కాచెన్ – కాయలు కాచింది, మొద్దు బారింది, రొమ్ము్స ఛాతీ,వక్షోజముల్ – స్తనములు,రాయన్ – రాచుకొనగా,రాపడెన్ – రాయి వలె గట్టి పడినది,మన్మథ విహార – మన్మథ విహారము వల్ల కలిగిన, క్లేశ – కష్టముల (యొక్క) విభ్రాంతిచేన్ – మాయ వల్ల,ప్రాయంబు – వయస్సు,ఆయెను – అయిపోయింది, తల – శిరము, బట్ట గట్టెన్ – బట్ట అయింది,(బట్ట తల అయింది),చెప్పన్ – చెప్పటానికి, రోత – అసహ్యము, సంసారము – లౌకిక జీవనాన్ని,చేయన్ – నడపటానికి,ఏన్ – నేను,చాలన్ – సమర్థుడనుకాను,విరక్తున్ – వైరాగ్యం కలవాడిగా,చేయన్ – కదవే – చేయవా?

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! స్త్రీల గోళ్ళగాటుల చేత నా శరీరం కాయలు కాసింది. వారి వక్షోజాల రాపిడి చేత నా రొమ్ము రాయి లాగా గట్టిపడింది. మన్మథక్రీడలందుఅలసి పోవటం అనే దానిపై గల వ్యామోహం లో పడి, ఆయువు గడచిపోయింది. వెండ్రుకలు రాలిపోయి తల బట్టతల అయింది. ఇవన్నీ చెప్పటానికే అసహ్యం కలుగుతోంది. రోత కలిగించే ఈ సంసార జీవనాన్ని గడపటం నా వల్ల కాదు. వైరాగ్యాన్ని ప్రసాదించ వలసింది. (వైరాగ్యం కలిగించి భవబంధ విముక్తుణ్ణి చేయమని భావం.)

విశేషం:
(శ్రీకాళహస్తీశ్వరా!) సుఖమని మానవులు భావించే స్త్రీ సంపర్కము వల్ల తానెంతకోల్పోయాడో పశ్చాత్తాపంతో వ్యక్తీకరించాడు కవి. వైరాగ్యం కలగటం కూడాశివానుగ్రహమే. శివానుగ్రహం తప్ప లోకంలో మరేమీ లేదనే భక్తితాత్పర్యం ఈ పద్యంలో వ్యక్తమౌతోంది. విరక్తి అంటే విశేషమైన రక్తి. అప్పటి వఱకు కొన్ని విషయాలకే (స్త్రీలు, ధనాలు మొదలైన వాటికి) పరిమితమైన రక్తి (మిక్కిలి ఇష్టం),అన్నింటిపైన కలగటం, సమస్తం ఈశ్వరవిలాసంఅని గుర్తించి, సృష్టి లోని సమస్తంపై ఇష్టం కలిగి ఉండటాన్నే విరక్తి, వైరాగ్యం అంటారు.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి

ఇది కూడా చ‌ద‌వండి : శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 13

Advertisement

తాజా వార్తలు

Advertisement