Tuesday, November 26, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 30

  1. అడుగంబోయిననవ్యమార్గరతులన్బ్రాణావనోత్సాహినై
    యడుగంబోయిన( బోదునీదుపదపద్మారాధకశ్రేణి యు
    న్నెడకున్, నిన్ను భజింపగా( గనియు నా కేలా పరాపేక్ష? కో
    రెడిదింకేమి? భవత్ప్రసాదమగుతన్శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!ఇకన్ – ఇటుపైన, ప్రాణ – అవన – ఉత్సాహిని – ఐ – ప్రాణములను రక్షించుకొనుటయందు మిక్కిలి ఇష్టము కలవాడనై, అన్యమార్గరతులన్ -ఇతర సంప్రదాయములందు ఇష్టము కలవారిని (ఇతర దేవతల భక్తులను), అడుగన్ – పోను – యాచించటానికి వెళ్ళను. అడుగన్ – పోయినన్ – ఒకవేళ అడగటానికి వెళ్లినట్లయితే, నీదు – నీ యొక్క, పదపద్మ – పాదములనెడు పద్మాలని, ఆరాధక – శ్రేణి – సేవించేవారి సమూహం, ఉన్న – ఎడకున్ – ఉన్నటువంటి చోటుకి, పోదున్ – వెళ్ళుదును, నిన్ను – నిన్ను, భజింపగాన్భ – కనియు – సేవించుట తెలిసియు, నాకు – నాకు, పర – అపేక్ష -ఇతరుల నుండి కోరుట, ఏలా -ఎందులకు? (అవసరము లేదని భావం), కోరెడిది – నేను కోరుకొనేది, ఇంక – ఏమి? – ఇంకేమున్నది?, భవత్ – నీ యొక్క, ప్రసాదము – అ – అనుగ్రహమే, తగున్ – చాలును.

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!ప్రాణరక్షణయందు, మిక్కిలి కుతూహలంతో శివభక్తులుకానివారిని యాచించను. ఒకవేళ అడగవలసి వస్తే, నీ పాదదాసులైన భక్తుల వద్దకేవెడతాను. నిన్ను సేవించే పద్ధతులు తెలిసిన తరువాత నాకు “పరాపేక్ష” (ఇతరులను కోరుట ఇతరమైన దానిని కోరుట, పరలోకాన్ని కోరటం) ఎందుకు? అయినా, కోరటానికేమున్నది? నీ అనుగ్రహమే చాలు నాకు.

విశేషం:
ఇది ధూర్జటి శివభక్తికి పరాకాష్ఠ. శివభక్తులుకానివారినే కాక, ఇతర దైవభక్తులని కూడా అడుగట. ఇతర దైవాలను పూజించేవారు కూడా నాస్తికుల కిందయేలెక్క. శివారాధన తెలిసినవారికి పరాపేక్ష, అంటే, పరలోకాన్నికోరటం ఉండదు. ఒక్క శివానుగ్రహం ఉంటే చాలు. శివుడి దయ ముందు స్వర్గాది లోకాలన్నీ తక్కువే. ముక్తి కూడా శివభక్తి కన్న కోరదగిన దేమీ కాదు.

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement